ఆల్క ప్రవీణ్ కుమార్ మేంగే
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ ప్రజల అభిప్రాయం మేరకు థర్డ్ ఫేస్ లో జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని విద్యావేత్త అల్కా ప్రవీణ్ కుమార్ మేంగే మంగళవారం నవతెలంగాణతో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నాన్న ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఏండ్ల తరబడి గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఇందులో భాగంగా మీలాంటి వారు సర్పంచ్ గా నిలబడాలని గ్రామ ప్రజలు, యువకులు కోరుతున్నట్టు వారు తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు వస్తే మా నాన్న ఇతరులకు గెలిపించేవారని, సర్పంచ్ గా ఉంటే ప్రజలకు దగ్గరుండి సేవలు చేయవచ్చని, నాన్న ఆశయాలను నెరవేర్చాలని ఉద్దేశంతో ప్రజల కోరిక మేరకు సర్పంచ్ గా పోటీ చేస్తానని వెల్లడించారు. మా కుటుంబాన్ని గ్రామస్తులు ఎంతో ప్రేమిస్తారని, ఎందుకంటే మా నాన్న ప్రజలకు ఎంతో సేవ చేసేవారని, ప్రస్తుతం నాన్న లేనప్పటికీ గ్రామం కోసం ప్రజలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నప్పటికీ గ్రామానికి అభివృద్ధి జరగాలంటే ప్రథమ పౌరులుగా సర్పంచ్ గా ఉంటే గ్రామం అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సర్పంచ్ గా నన్ను ప్రజలు గెలిపిస్తే గ్రామాభివృద్దికి పాటుపడతానని తెలిపారు. అంతే కాకుండా.. ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామంలో ఏండ్ల తరబడి కొన్ని కుటుంబాలే రాజకీయాలు చేయడం, అయినా ఏమాత్రం అభివృద్ది పనులు చేయకుండా తమ స్వార్ధాలకు వారి అధికారాలను వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మాలాంటి వారిని గెలిపిస్తేనే గ్రామం అన్నిరకాలుగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. గ్రామాభివృద్దే తమ ప్రథమ ఎజెండాగా పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్దమైనట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.



