– మిస్ వరల్డ్ స్పోర్ట్స్ చాలెంజ్
నవతెలంగాణ-హైదరాబాద్
మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ చాలెంజ్‌లో మిస్ ఈస్టోనియా ఎలిసి రాండ్‌మా చరిత్ర సృష్టించింది. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన స్పోర్ట్స్ చాలెంజ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఎలిసి..1999 తర్వాత ఈస్టోనియా నుంచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. స్పోర్ట్స్ చాలెంజ్‌లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ నాకౌట్, షాట్ ఫుట్, చెస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ పెనాల్టీ షుటౌట్, షటిల్ రన్స్ అండ్ స్ప్రింట్స్ సహా జుంబా సెషన్స్ పోటీలు నిర్వహించారు. ఈ చాలెంజ్‌లో పోటీదారుల ఫిజికల్ ఫిట్‌నెస్, ఓవరాల్ హెల్త్, అథ్లెటిక్ ఎబిలిటీ సహా పాజిటివ్ మైండ్‌సెట్‌ను అంచనా వేస్తారు. మిస్ వరల్డ్ మార్టినిక్ ఆరెలి జావోచిమ్ సిల్వర్ సాధించగా, మిస్ వరల్డ్ కెనడా ఎమ్మా మారిసన్ కాంస్యం అందుకుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనా లిసె నాంటన్ నాల్గో స్థానంలో నిలిచింది.
మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ చాలెంజ్ కీలకం. 108 దేశాల నుంచి పోటీదారులు నాలుగు గ్రూపులుగా (అమెరికన్స్ అండ్ కరీబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, ఓసియానా) పోటీపడ్డారు. పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి మిస్ వరల్డ్ స్పోర్ట్స్ లేదా స్పోర్ట్స్‌ఉమెన్ అవార్డును ప్రదానం చేస్తారు. స్పోర్ట్స్ చాలెంజ్ విజేత నేరుగా టాప్-40లో నిలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ స్పోర్ట్స్ చాలెంజ్ సందడిగా సాగింది. సాంస్కృతిక కళారూపాలతో ముద్దుగుమ్మలకు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు సహా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి సహా తదితరులు స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మిస్ ఈస్టోనియాకు పసిడి
- Advertisement -
- Advertisement -