Tuesday, December 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి73వ రాజ్యాంగ సవరణ మహిళలకు ఏమిచ్చింది?

73వ రాజ్యాంగ సవరణ మహిళలకు ఏమిచ్చింది?

- Advertisement -

ఏడేండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నగారా మోగించిన విషయం అందరికీ తెలుసు. డిసెంబర్‌ పదకొండు నుండి తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మను వాద సంస్కృతిని రుద్దుతున్న నేపథ్యంలో వందల ఏండ్ల మహిళల చైతన్యం అణిచి పెట్టినటువంటి వ్యవస్థను రాజ్యాంగం బద్దలు కొట్టింది. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత మహిళలకు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్లు వచ్చాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, జీపీ వార్డు మెంబర్‌ వరకు కూడా మహిళలకు ప్రాతినిధ్యం లభించింది. ఫలితంగా వారిలో అంతులేని చైతన్యం ప్రవేశించింది. ఆ విధంగా పురుషాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి అనేక సందర్భాల్లో ఆ కుర్చీలను (ప్రజాప్రతినిధి బాధ్యతను) కాపాడుతూ ఆ కుర్చీలకు న్యాయం చేయడం కోసం ఇండ్లల్లో గొడవలు, బయట ఘర్షణలు పడ్డారు. ఆఖరికి సారా లాంటి ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. అంతేకాదు, రాజకీయంగా ఇంట్లోనే నిర్ణయాధికారం లేనటువంటి మహిళలు సమాజంలో ఒక అడుగు ముందుకేసి దాన్ని సాధించారు. గ్రామపంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో తమదైన శైలిలో ఒక ముద్రవేశారు. బ్రహ్మాండమైన పరిపాలనతో సత్తాచాటారు. ఒక ఇందిరాగాంధీ లాంటి వారే కాదు, సాధారణ మహిళలు కూడా రాజ్యాలు ఏలగలరని నిరూపించారు. అందుకే ఇవాళ 33 శాతం రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో పంచాయతీలకు పోటీ చేస్తున్నారు. గ్రామాల్లో వీరి సేవల్ని బేరీజు వేసుకుని గెలిపించాల్సిన అవసరం ఉన్నది.

ఆర్టికల్‌ 243ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు అభివద్ధి చెందాలి. ఆ నిబంధనల ప్రకారం రాజ్యాంగం అనేక విస్తత అవకాశాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నలభై శాతం గ్రామీణ ప్రాంతాలకి కేటాయించాలని రాజ్యాంగం పేర్కొంది. అదే విధంగా ఆ నిధుల్ని గ్రామసభ ద్వారా గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించి వాటికి అనుగుణంగా ఎన్నికైనటువంటి గ్రామపంచాయతీలు ఆ గ్రామంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలి, వంద రోజుల పని కల్పించడమా, బడి లేదా గుడి ఏది అవసరమ నేది అక్కడ నిర్ణయం జరగాలి. ఈ విధానమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసే క్రమంలో అమలు జరిగింది. ఈ విధానమే జాతిపిత కోరు కున్నది. ఈ విధానమే సుందరయ్య లాంటి మహానుభావులు కలగన్నది. గ్రామ స్వరాజాలు ఏర్పడాలని, గ్రామాలు సుభిక్షంగా వర్ధిల్లాలని, కరువు కాటకాలు ఆత్మహత్యలు లేనటువంటి గ్రామాలుగా తయారు కావాలని, పాడిపంటలు పశుసంపద, రైతు ఆత్మహత్యలు, మహిళల ఆత్మహత్యలు లేనటువంటి ప్రభుత్వాలు రావాలని, యువత శక్తి నిర్వీ ర్యం కానటువంటి పాలన కావాలని కోరుకున్నారు. కానీ ఇవాళ సమాజంలో అది జరగడం లేదు. నిధులు మొత్తం స్ధానికంగా వున్న అభిప్రాయాలకు భిన్నంగా ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లడం వల్ల, వారు ఇష్టమైన వారికి కాంట్రాక్టులు ఇచ్చి సగం నిధులను మింగేస్తూ సగం మాత్రమే ప్రజల కోసం ఖర్చుపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో కూడా లోకల్‌ కాంట్రాక్టర్లు వారి వారి భజనపరులు మింగే స్తున్నటువంటి దుస్థితి. ఆ కారణంగా గ్రామాల్లో అభివద్ధి చాలా కుంటుపడిందన్నది వాస్తవం.
ఏడున్నర దశాబ్దాలుగా గ్రామ స్వరాజ్యాలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా అభివద్ధి గురించి ఇంకా మాట్లాడుకుంటుంటే, ఇవాళ భారతదేశంలోనే కేరళ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. పేదరికాన్ని అరికట్టడంలో మాత్రం ఏ సర్కారూ విజయం సాధించలేక పోయింది. కానీ ఇవాళ దేవభూమిగా పేరుగాంచినటువంటి ఒక కమ్యూనిస్టు పరిపాలనలో కొనసాగుతున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అరికట్టగలిగింది. ఇది దేశానికే గర్వకారణం.
2021లో నిటిఆయోగ్‌ ప్రకటించిన లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు పేదరికం రేటు 14.96శాతం కాగా అది కేరళలో 0.7 ఒక శాతం, బీహార్‌లో 23.9 శాతం ఉండగా జార్ఖండ్‌లో 18.18, యూపీలో 11.5 గా ఉంది. అయితే 2025 నవంబర్‌ నాటికి కేరళ రాష్ట్రం అత్యంత పేదరికం లేని రాష్ట్రంగా తన 65 వేల పేదరిక కుటుంబాలను కూడా దారిద్య్రం నుంచి బయటపడేసి పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించింది. అంటే అది ఏ పరిపాలన వల్ల సాధ్యమైంది అనేది ప్రజలు గమనించాలి. ఆ విధంగా కేరళ అభివద్ధిని చూసి గాని లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మానికొండ సూర్యవతి మండల పరిధిలో మహిళకు మరుగుదొడ్లు నిర్మించిన చరిత్ర గురించి మనకు తెలుసు. అలాగే వాజేడు మండలంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో బొన్నమడి అనేటువంటి అరవై ఏండ్ల గిరిజన మహిళ మద్యం లేని గ్రామాన్ని నిర్మించింది. ప్రగతి నగర్‌ ప్లాస్టిక్‌ లేని మద్యం లేని గ్రామంగా అవార్డు అందుకుంది. వరంగల్‌ జిల్లాలోని గంగదేవిపల్లి పంచాయతీ అరవై దేశాల సందర్శనకు వేదికగా నిలిచింది. ఖానాపురంహవేలి, భద్రాచలం మహిళలపై లైంగికదాడుల సంఖ్య తగ్గించారు. మన సర్పంచి, వార్డు మెంబర్ల గెలుపువల్ల మొత్తంగా ఉమ్మడి ఏపీలోనూ ఇవాళ తెలంగాణ లోనూ మార్క్సిస్టు పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపువల్ల అవినీతి లేని ప్రజాభివద్ధి జరిగిందని గర్వంగా చెప్పగలం. ఈ గ్రామాలన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మహిళలు పరిపాలించినటువంటి గ్రామాలు, మండలాలు.
నేడు ఎన్నికలు రాజకీయ గుర్తుల మీద జరగకపోయినప్పటికీ ప్రతి పంచాయతీలో ఏదో ఒక రాజకీయ పార్టీ తమ మద్దతుతో అభ్యర్థులను నిలబెడుతున్నది. వార్డు మెంబరు దగ్గర నుండి ఇది జరుగుతున్నది. గనుక ఓటు వేసేటపుడు ఏ రాజకీయ పార్టీ విధానమేమిటి? ఎటువంటి అభ్యర్ధిని బలపరుస్తున్నది? అనేదాన్ని చూసుకునే ప్రజలు ఓటు వేయాల్సిన అవసరమున్నది. మనకేమో సబ్సిడీలు, పెన్షన్ల ఆశలు చూపెట్టి వచ్చినటువంటి వంద రోజుల పనికోసం కేటాయించినటువంటి వేలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ని పందికొక్కులు మెక్కినట్టు మెక్కుతున్నటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. అటువంటి రాజకీయ పార్టీలు సపోర్ట్‌ చేస్తున్న వారికి ఓటు వేద్దామా? నీతి నిజాయితీతో దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించే కమ్యూనిస్టులు బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేద్దామా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

బత్తుల హైమావతి
9391360886

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -