Monday, May 19, 2025
Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్‌పై పోస్ట్‌ పెట్టిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

ఆపరేషన్‌ సిందూర్‌పై పోస్ట్‌ పెట్టిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

- Advertisement -

– న్యాయం, శాంతి కోరుకునే వారే లక్ష్యంగా అరెస్టులు: సీపీఐ(ఎం)
పానిపట్‌:
విద్వేష వ్యాఖ్యలు చేసిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, మంత్రులు స్వేచ్ఛగా తిరుగుతుండగా.. హింసను వ్యతిరేకిస్తూ పోస్టు చేసిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్మూదాబాద్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బీజేపీ యువ మోర్చా నాయకుడు, జతేరి గ్రామ సర్పంచ్‌ యోగేష్‌ జతేరి, హర్యానా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేణు భాటియా ఫిర్యాదు మేరకు అలీఖాన్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నామని హర్యానాలోని రారు (సోనిపట్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎసిపి) రారు అజీత్‌ సింగ్‌ తెలిపారు. ఆయనపై రారు పోలీస్‌ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. కోర్టులో హాజరు పరిచామని, ఐదు రోజుల రిమాండ్‌ విధించారని తెలిపారు. సోనీపట్‌లోని అశోకా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్‌ వ్యవహరిస్తున్నారు.
అలీఖాన్‌ వ్యాఖ్యలు ఇవీ
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మీడియా సమావేశాల్లో వివరించిన కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లకు సంబంధించి సోషల్‌ మీడియాలో అలీఖాన్‌ పోస్టు చేశారు. ”సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లు జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదు. కానీ దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలి. లేదంటే అది వంచనే” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. ”సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లను చూసి మేం గర్విస్తున్నాం. వారికి మా సలాం. వాళ్లపై అలీఖాన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఈ తప్పు చేసినందుకు అలీఖాన్‌ ఈ రోజే కమిషన్‌ ఎదుట హాజరై క్షమాపణ చెప్పాలి” అని పేర్కొంటూ ఈ నెల 12న అలీఖాన్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేణూ భాటియా నోటీసులు పంపారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు : అలీఖాన్‌
మహిళా కమిషన్‌ నోటీసులపై వెంటనే స్పందించిన అలీఖాన్‌.. తన వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ వక్రభాష్యం చెప్పిందని పేర్కొన్నారు. తన పోస్ట్‌ మహిళల హక్కులు లేదా చట్టాలకు ఎలా విరుద్ధమో సమన్లలో కమిషన్‌ పేర్కొనలేదని తెలిపారు. ”మహిళా కమిషన్‌ నా వ్యాఖ్యలను తప్పుడు కోణంలో, తప్పుడు ఉద్దేశంతో చదివింది. వాటిని తప్పుగా అర్థం చేసుకుంది. వాటిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. నా మాటల్లోని అర్థాన్ని మార్చేందుకు యత్నించింది” అని పేర్కొంటూ అలీఖాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ఇది కొత్త రకమైన సెన్సార్‌ షిప్‌, హెరాస్మెంట్‌ అని, లేని వాటిని సమస్యలుగా చూపించారని పేర్కొన్నారు. తాను భారత సాయుధ దళాలను ప్రశంసించానని, కానీ హింసను విమర్శించానని తెలిపారు. 1200 మంది అకడమీషియన్లు, సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్‌కు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
విద్వేషాన్ని వ్యతిరేకించిన వారి అరెస్టులు… ప్రోత్సహించే వారికి స్వేచ్ఛ : సీపీఐ(ఎం)
విద్వేషానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదాబాద్‌ను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. విద్వేషాన్ని ప్రేరేపించే బిజెపి మంత్రి విజరుషా లాంటి వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొంది. న్యాయాన్ని, శాంతిని కోరుకునే వారు మోడీ భారత దేశంలో లక్ష్యంగా మారుతున్నారని విమర్శించింది. వెంటనే అలీఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -