Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌ ఎదుట కార్మికులు గొంతెత్తలేరు

ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌ ఎదుట కార్మికులు గొంతెత్తలేరు

- Advertisement -

– అధికారుల నిర్లక్ష్యం వల్లే సిగాచీ ఘటన
– దర్యాప్తు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారు?
– సిగాచీ ఫ్యాక్టరీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీకి చెందిన బలమైన యాజమాన్యం ముందు కార్మికులు గొంతెత్తి తమ గోడు చెప్పుకోలేని దుస్థితి ఉందని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. ”సిగాచీ దారుణ ఘటనకు ఒక రోజులో జరిగిన లోపం కారణం కాదు.. అది రాత్రికి రాత్రి జరిగిన దారుణ ఘటన కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన” అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. రెడ్‌ జోన్‌లో ఉన్న సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగితే పది పన్నెండు శాఖల ఆఫీసర్లు దర్యాప్తు చేయాల్సివుంటే, ఫ్యాక్టరీ శాఖ మాత్రమే దర్యాప్తు చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, పర్యావరణ శాఖ, కాలుష్య శాఖ మొదలైన శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అధికారులు తనిఖీలు నిర్వహించి ఉంటే 54 మంది ప్రాణాలు పోయేవా? అని నిలదీసింది. పరిమితికి మించి పేలుడు పదార్థాలున్నా పట్టించుకోలేదనీ, 90 మంది పనిచేయాల్సిన చోట 50 మందే పని చేశారని ఎత్తిచూపింది. అధికారుల నిర్లక్ష్యం కనబడుతోందనీ, ఇలాంటి వాళ్లపై వేటు వేస్తేనే పరిస్థితి దారికి వస్తుందని అభిప్రాయపడింది. ఇతర అధికారులకు కూడా సరైన సంకేతం పంపినట్టు అవుతుందని కూడా చెప్పింది. సిగాచీ ఘటనపై అధికారులు ఇచ్చిన జవాబులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 30న జరిగే విచారణ సమయంలో హైకోర్టు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులతో రావాలని ఆదేశించింది. ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌ ప్రకటించిన పరిహారం చెల్లింపు వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని సిగాచీ కంపెనీ కోరింది. ఇందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్‌ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో 54 మంది మృతి చెందారనీ, 28 మంది గాయపడ్డారని, ఎనిమిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని హైదరాబాద్‌ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్‌ సైంటిస్ట్‌ కె.బాబురావు దాఖలు చేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం మరోసారి విచారించింది. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు విచారణకు. డీఎస్పీ ప్రభాకర్‌, ఇన్‌స్పెక్టర్‌ విజరుకృష్ణ, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ గౌరీ శంకర్‌ కోర్టుకు హాజరయ్యారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో పాటు ఫ్యాక్టరీల శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్‌, విద్యుత్‌, పీసీబీ, కార్మిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల ఘటనా స్థలాన్ని పరిశీలించారని ప్రభుత్వం తరఫున ఏఏజీ టి.రజనీకాంత్‌రెడ్డి చెప్పారు. హైకోర్టు కల్పించుకుని అధికారుల తనిఖీలపై డీఎస్పీని ప్రశ్నించింది. గత డిసెంబర్‌లో పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు నిర్వహించినట్టు ఏఏజీ జవాబు చెప్పగా..ఇతర శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ప్రమాదకర రెడ్‌ జోన్‌లోని పరిశ్రమల్లో పదుల సంఖ్యలో శాఖలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్న నిబంధన అమలు కాలేదని అభిప్రాయపడింది. మార్గదర్శకాలు, చట్టాలు అనేకమున్నా అధికారులు వాటిని పాటించ లేదని తప్పుపట్టింది. ఈ కారణంగానే అమాయక కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌పై చార్జిషీట్‌ దాఖలు చేస్తారనీ, నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. కోర్టుకు సహకరించడానికి అమికస్‌ క్యూరీగా డొమినిక్‌ ఫెర్నాండేజ్‌ను నియమించింది. ఘటనకు సంబంధించిన వివరాలు, పత్రాలను ఆయనకు సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ, విచారణను డిసెంబర్‌ 30కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -