నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బంధుత్వాలు కలుపుతూ..ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే గుడ్డిగా నమ్మి ఓటేయద్దు.వారి గుణగణాలను పరిశీలించాలి. పాలనలో సామర్థ్యాన్ని అంచనా వేయాలి. లేకుంటే సీన్ రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ రోజు మందు, డబ్బులు పంపిణీ చేసిన వారిని గెలిపిస్తే రేపు వాళ్లు చేయాల్సిన పనులకు సైతం రేట్లు నిర్ణయిస్తారు. ఇంతకు చాలా రెట్లు అధికంగా వసూలు చేస్తారనే విషయం మరువొద్దు.పంచాయతీ ఎన్నికలనేవి పల్లె ప్రగతికి ప్రాతిపదిక. అందుకే తాత్కాలిక పలకరింపులు, డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికావొద్దు.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు వేసే ముందు ప్రధానంగా ఈ అంశాలు గమనించాలి.అభ్యర్థికి పల్లె కోసం పాటుపడే నిజమైన నిబద్ధత ఉందా లేదా అని బేరీజు వేసుకోవాలి. ఎన్నికల సమయంలోనే కాదు..సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం కలవారా..? అన్నది గమనించాలి.ఎప్పుడూ లేనిది, అసలు కన్నెత్తి చూడని వారు అకస్మాత్తుగా బంధుత్వం కలుపుతూ, అధికార కోసం ఆరాటపడే వారికి నమ్మి ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఓటు వజ్రాయుధం.దాన్ని విచక్షణతో, భవిష్య త్తును దృష్టిలో ఉంచుకుని వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు. మద్యం, డబ్బు కోసం ఆశపడితే ఆ అభ్యర్థి గెలిచాక సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయం మరిచిపోవద్దు.



