Monday, May 19, 2025
Homeరాష్ట్రీయంఆదర్శ వివాహం ఎంతో గొప్పది

ఆదర్శ వివాహం ఎంతో గొప్పది

- Advertisement -

సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ-మహబూబాబాద్‌

సమాజంలో వివాహాలు వివిధ రకాలు అని, అందులో స్త్రీ,పురుషులు సమానంగా భావించి కట్న కానుకలు లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లాలో పీిఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య అధ్యక్షతన జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ నాగమణి దంపతుల కుమారుడు ఆకాష్‌, మహబూబాబాద్‌కు చెందిన బొమ్మ వెంకటేశ్వర్లు రోజా రమణిల కుమార్తె అమృత వర్షిని ఆదర్శ వివాహాన్ని బివి రాఘవులు దగ్గరుండి జరిపించారు. కమ్యూనిస్టు పద్ధతిలో దండలు మార్చుకొని వివాహ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసుకొని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో వివాహాలు చేసుకుంటారని అన్నారు. వివాహం చేసుకున్న దంపతులు కడసారి వరకు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. పురుషలతో సమానంగా అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. అయితే సమాజంలో బయటికి రావటంలో మహిళలు కొంత వెనుకబాటులో ఉన్నారని, బయట సమాజంలో 90 శాతం పురుషులు ఉంటే 10శాతం మాత్రమే మహిళలు కనిపిస్తున్నారని అన్నారు. భారతదేశంలో వాహనాలు నడపడంలో పురుషులు ముందుంటే స్త్రీలు వెనుక కూర్చుంటున్నారని అన్నారు. అదే చైనాలో చూస్తే సమాజంలో స్త్రీ పురుషులు సమాన భాగంలో వీధుల్లో కనిపిస్తున్నారని, అక్కడ మహిళలు వాహనాలు నడిపితే పురుషులు వెనక కూర్చోవడం కనిపిస్తోందని అన్నారు. దేశంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే దేశ జీడీపి పెరుగుతుందని అన్నారు. ఆదర్శ వివాహాలు సమాజంలో సమానత్వాన్ని పెంచుతాయని స్త్రీ పురుషుడు సమానమని భావాన్ని పెంపొందిస్తాయని ఇది దేశ అభ్యున్నతికి ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్‌, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళి నాయక్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రామచంద్రనాయక్‌, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, సీనియర్‌ ఐఏఎస్‌ వెంకటరత్నం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్‌, నున్నా నాగేశ్వరరావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రయ్య, సీపీఐ(ఎం) నాయకులు గాదె ప్రభాకర్‌రెడ్డి, జి రాములు, సూడి కృష్ణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుర్ణపు సోమయ్య, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు, ప్రముఖులు న్యాయవాదులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -