Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే కడియం బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే కడియం బేషరతుగా క్షమాపణ చెప్పాలి

- Advertisement -

సీపీఐ(ఎం) లింగాల ఘనపురం మండల కార్యదర్శి కరుణాకర్‌, అతని కుటుంబంపై దాడికి యత్నించిన.. బీఆర్‌ఎస్‌ శ్రేణులను అరెస్టు చేయాలి
సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : జనగామలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


నవతెలంగాణ-జనగామ
సీపీఐ(ఎం) శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం కిష్టాజిగూడెంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసే సీపీఐ(ఎం)పై, ఆ పార్టీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదన్నారు. అధికారం శాశ్వతం కాదని గౌరవాన్ని కాపాడుకునే విధంగా భాష ఉండాలని తెలిపారు. అదేవిధంగా సీపీఐ(ఎం) లింగాల ఘణపురం మండలం సిరిపురం గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి ఇంటి పైకి వచ్చి కుటుంబంపై దాడి చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోతారన్న భయంతో దాడికి యత్నించారని అన్నారు. దాడితో మనస్తాపం చెందిన మండల కార్యదర్శి భార్య బొడ్డు ఉపేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. దాడికి ప్రయత్నించిన కళ్యాణ్‌, సంజీవ, చిటకూరు మల్లేష్‌, చిటకూరు అశ్విని, బండ అశోక్‌, బర్ల ఐలయ్య తదితరులపై ఫిర్యాదు చేసినా లింగాల గణపురం ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా బీఆర్‌ఎస్‌కు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలతో అనునిత్యం అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) సర్పంచ్‌, వార్డు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి వెంటనే చర్యలు తీసుకొని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకొని స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపేంద్రను జాన్‌ వెస్లీతోపాటు సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అహల్య, సాంబరాజు యాదగిరి, బోట్ల శేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జనగాం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్‌, లింగాల గణపురం మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్‌, గ్రామ కార్యదర్శి కృష్ణమూర్తి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -