Monday, May 19, 2025
Homeరాష్ట్రీయంమా రాయబారులు మీరే

మా రాయబారులు మీరే

- Advertisement -

మళ్లీ మళ్లీ రాష్ట్రానికి రావాలి : పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మిస్‌వరల్డ్‌ పోటీదారుల సచివాలయ సందర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌వరల్డ్‌ పోటీదారులంతా తెలంగాణ రాష్ట్రానికి రాయబారులని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయాన్ని మిస్‌వరల్డ్‌ పోటీదారులు సందర్శించారు. ఇండియాతో సహా 10 దేశాల పోటీదారులు తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పార్చన చేశారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన తేనిటి విందును స్వీకరించారు. తెలంగాణా చరిత్ర, వారసత్వం, వంటకాలు, భిన్నమతాలు కలిసిమెలిసి జీవించే జీవనశైలి, పర్యాటక ప్రదేశాలను గురించి వివరించే వీడియోలను వీక్షించారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి నిర్వహించిన డ్రోన్‌ షోను ఎంజారు చేశారు. వారంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సచివాలయ పరిసరాల్లో కలియతిరిగారు. గుల్జార్‌ హౌజ్‌ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించి నివాళులర్పించారు. తేనిటి విందు సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకంగా హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీ తదితర రంగాలకు పెట్టింది పేరని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. పోటీదారులను తాము కేవలం పోటీదారులుగా భావించడం లేదనీ, తమ అతిథులుగా, రాయబారులుగా చూస్తున్నట్టు వెల్లడించారు. తిరిగి వెళ్లేటప్పుడు కేవలం ఇక్కడి జ్ఞాపకాలతో మాత్రమే కాకుండా తెలంగాణ హృదయంలోని ఒక భాగాన్ని తమతో తీసుకెళ్లాలని కోరారు. పర్యాటకం అనేది కేవలం ఉల్లాసం కోసం మాత్రమే కాదనీ, అవసరం ఉన్న ప్రజలకు సహాయపడేదనీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతున్నదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మిస్‌వరల్డ్‌ పోటీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సచివాలయం తెలంగాణ ఆకాంక్షలకు, ప్రగతికి చిహ్నమని తెలిపారు.
రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుందని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గుల్జార్‌ హౌజ్‌ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన 17 మందిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగానే కాకుండా మనుషులుగా మానవత్వంతో స్పందిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లకు స్వాగతం పలికారు. సచివాలయం పనితీరు, వివిధ శాఖలు, ఉద్యోగుల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తేనీటి విందులోని వంటకాల విశేషాలతో పాటు తెలంగాణ చరిత్ర, వారసత్వం, భవిష్యత్‌ ప్రణాళికలను ఐఏఎస్‌ అధికారులు దాసరి హరిచందన, కృష్ణ ఆదిత్య వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -