Sunday, December 14, 2025
E-PAPER
Homeఅంతరంగంబుక్‌ఫెయిర్‌

బుక్‌ఫెయిర్‌

- Advertisement -

పుస్తకాలకూ మనకూ శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. పుస్తకాలు చదివే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. తెలివైన వారు ఎవరైనా సరే ఏదో ఒకటి చదువుతుంటారు. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన వారిలో ఉంటుంది. అలాంటి వారి కోసమే బుక్‌ ఫెయిర్‌ సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పుస్తక ప్రియులకు ఆహ్వానం పలుకుతుంది.
సాధారణంగా పిల్లలకు పాకే వయసు రాగానే తల్లిదండ్రులు ప్రత్యేక కార్యక్రమం జరుపుతారు. ఎదురుగా ఓ కత్తి, పుస్తకం, డబ్బు, ఆహారం లాంటివి ఉంచి వాటిలో ఏదో ఒకటి పట్టుకొమ్మని ప్రోత్సహిస్తారు. ఏది పట్టుకోవాలన్నది చిన్నారికే వదిలేస్తారు. కానీ మనసులో ఆ తల్లిదండ్రులు కోరుకునేది మాత్రం ఒకటే… పుస్తకం పట్టుకోవాలి అని. ఎందుకంటే చదువు వుంటే తమ పిల్లలు జీవితంలో ఏదైనా సాధించగలరని నమ్మకం. ఇక ఆ చిన్నారి పుస్తకమో, పెన్నో పట్టుకుంటే వారి ఆనందానికి అవధులు వుండవు. అది పుస్తకాలకూ, చదువుకూ ఉన్న విలువ. మనకు ఆస్తులున్నా, ఇళ్లు, పొలాలు ఎన్ని ఉన్నా గొప్పగా చెప్పుకోలేం. కానీ పుస్తకాలు ఉన్నాయని చెప్పుకోగలం. పుస్తకాల్ని కలిగివుండే వాళ్లను సమాజం గౌరవిస్తుంది. పుస్తకాలు చదివేవాళ్లను సమాజం అభిమానిస్తుంది. వారిని విజ్ఞాన వంతులుగా అందరూ భావిస్తారు.
అయితే ఈ రోజుల్లో పుస్తకం చేతిలో పట్టుకొని చదవడం బాగా తగ్గిపోయింది. మొబైల్‌ వచ్చాక వీడియోలు చూస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. అయినప్పటికీ పుస్తకం పుస్తకమే. స్వయంగా చదివిన దానికీ, వీడియోలో చూసిన దానికీ చాలా తేడా ఉంటుంది. స్వయంగా చదివేటప్పుడు మనకు నచ్చినట్టుగా నెమ్మదిగా చదువుతాం. మెదడు బాగా అర్థం చేసుకుంటుంది. ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, ప్రశ్నలు లేవనెత్తుతుంది. ముఖ్యంగా ఇదంతా మన కంట్రోల్‌లో జరుగుతుంది. అదే వీడియోలతో సబ్జెక్ట్‌ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ప్రక్రియ జరగదు. అందుకే మనకు సబ్జెక్ట్‌ బాగా రావాలంటే పుస్తకాలు చదివి అర్థం చేసుకొని, విశ్లేషించుకోవడం మంచి మార్గం.

90ల వరకు మొబైల్స్‌ లేవు కాబట్టి అప్పటి వాళ్లంతా పుస్తకాలు చదివేవాళ్లు. ఇప్పటి వాళ్లు కూడా చదువుతున్నారు. కానీ వారి ఫోకస్‌ని మొబైల్స్‌ దెబ్బతీస్తున్నాయి. దాని నుండి బయట పడితే మనకు మించిన విజేయులు వేరే ఉండరు. ఏది ఏమైనా ఆఫ్‌లైన్‌ అయినా ఆన్‌లైన్‌ అయినా పుస్తకాలు మాత్రం చదవాలి. ఆ పుస్తకం మిస్టరీ కావొచ్చు, ఫాంటసీ కావచ్చు, చందమామ కథలు కావొచ్చు, సైన్స్‌ ఫిక్షన్‌ కావొచ్చు. నచ్చినది చదవడంలో ఆనందమే వేరు.
అలాగే ప్రతీ ఊరిలో లైబ్రరీ ఉంటే ఎంతో బాగుంటుంది. వాటిలో పుస్తకాల్ని కూడా ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చుతూ అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున లైబ్రరీల్ని ప్రోత్సహిస్తే మనలో చదవాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇప్పటికే ఉన్న లైబ్రరీలను కూడా ఆధునీకరించి అందుబాటులో వచ్చేలా చేస్తే ఎంతో బాగుంటుంది. మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్‌కి ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలంటే బుక్‌ ఇవ్వడం సరైనది. ఎందుకంటే మీరు ఇచ్చే బుక్‌ వారితో ఎప్పటికీ ఉంటుంది. వీలు దొరికినప్పుడు దాన్ని చదువుతారు. అప్పుడు మీరు గుర్తొస్తారు. మీకు కాల్‌ చేసి మాట్లాడతారు. ఇలా బుక్స్‌ మనలో స్నేహభావాన్ని పెంచుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం డిసెంబర్‌ 19 నుండి ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరగబోతున్న హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ను సందర్శించండి. మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -