తూర్పుగూడెం గ్రామానికి మరో చారిత్రక అధ్యాయం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామం మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. నాడు సీపీఐ(ఎం) తరఫున ప్రజాపాలనకు దిశానిర్దేశం చేసిన దూపటి వెంకటేష్, 2013–2018 కాలంలో సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి పునాదులు వేశారు. ప్రజాసేవే లక్ష్యంగా సాగిన ఆయన పాలన నేడు మరో రూపంలో కొనసాగుతోంది. అదే ప్రజాసేవ పరంపరను కొనసాగిస్తూ ఆయన భార్య దూపటి లక్ష్మి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తున్నారు.
పదవికోసం కాదు–ప్రజల కోసమే రాజకీయాలు అనే సిద్ధాంతంతో, ఉన్నత చదువులు పూర్తిచేసినప్పటికీ ఉద్యోగ మార్గాన్ని పక్కనపెట్టి గ్రామసేవను ఎంచుకున్నారు. దూపటి వెంకటేష్ తన పాలనా కాలంలో మౌలిక వసతుల అభివృద్ధి,గ్రామ సంక్షేమ కార్యక్రమాల అమలులో నిస్వార్థంగా,పారదర్శకంగా పని చేశారు. అదే ప్రజా విశ్వాసం నేడు దూపటి లక్ష్మికి బలంగా మారింది. పార్టీ అడ్డు కట్టలు లేని స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చిన దూపటి లక్ష్మి గ్రామస్తుల నమ్మకాన్ని గెలుచుకొని సర్పంచ్ పదవిని అధిరోహించడం ఆమె రాజకీయ ధైర్యానికి, ప్రజల మద్దతుకు నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామ అభివృద్ధి, పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు. తూర్పుగూడెం గ్రామంలో భర్త–భార్యలుగా ప్రజాసేవను కొనసాగిస్తున్న ఈ కుటుంబం నేటి తరానికి ఒక ప్రేరణగా నిలుస్తూ,గ్రామ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తోంది.



