తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆటపై చిన్ననాటి నుంచే ఇష్టాన్ని పెంచుకున్న ఆ కుర్రాడు క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే. 7 ఏండ్ల వయసు నంచే క్రికెట్‌పై ఆసక్తితో కఠోర శ్రమ మొక్కవోని దీక్షతో హైదరాబాద్ జట్టుకు అండర్-14 స్థాయి నుంచే ఆడుతున్న.. ఆ యువ సంచలనం..ఇటీవల అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మిని వేలంలో బేస్ ప్రైజ్‌కు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేశారు. దీంతో ఐపీఎల్ 19వ సిజన్‌లో ఐపీఎల్‌లో మెరవనున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడడమే తన ధ్యేేయం అంటున్నాడు ఈ వెన్నంపల్లి యువకుడు..
ఏడేండ్ల వయసులో మొదలైన కరీంనగర్ కుర్రోడి ప్రయాణం ఏండ్ల తరబడి కఠోర సాధన ప్రతి మ్యాచ్‌కు కొత్త మెలికలతో ప్రత్యర్థులను మైదానంలో బ్యాటింగ్.. బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ప్రతి మ్యాచ్‌ను ఒక కొత్త పాఠంగా మలుచుకుంటూ అడుగడుగునా కష్టాలు ఎదుర్కొని తన సత్తా చాటాడు. దాని ప్రతిఫలమే నేడు ఐపీఎల్ మైదానంలో వెలిగిపోతున్నాడు. భారత్‌కు ఆడటమే లక్ష్యంగా క్రీజ్‌లో అడుగుపెట్టిన కరీంనగర్ కుర్రాడు పేరాల అమన్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి నుంచి ఐపీఎల్ వరకు సాగిన అతడి ప్రయాణం నేటి యువతకు ఓ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇటీవల అబుదాబిలో ముగిసిన ఐపీఎల్‌లో అంతర్జాతీయ క్రికెటర్లతో పోటీ పడుతూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాం-చైజీ రూ.30 లక్షల కనీస ధరతో అమన్‌రావును దక్కించుకోవడం కరీంనగర్ క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. భవిష్యత్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించడమే తన కల అని అమన్ రావు ధీమాగా చెబుతున్నాడు.
నాన్నే స్ఫూర్తిగా
అమన్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం. ప్రస్తుతం కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. నాన్న మధుకర్ రావు కూడా కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టు తరఫున జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. తాత గోపాల్‌రావు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. తండ్రి మధుకర్ రావు, పెద్దనాన్న మనోహర్ రావు నుంచి వచ్చిన క్రీడా వారసత్వమే అమన్‌కు బలంగా మారింది. క్రీజ్‌లో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లు ఆ కుర్రోడి బ్యాటుకు బెంబేలెత్తాల్సిందేనన్న పేరు తెచ్చుకున్నాడు. 7 ఏండ్ల వయసులోనే బ్యాట్ పట్టిన అమన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. చిన్నప్పటి నుంచి నాన్న మధుకర్ రావు, పెద్దనాన్న మనోహర్రావు అమన్‌కు స్ఫూర్తి. చదువునూ నిర్లక్ష్యం చేయకుండా ప్రస్తుతం ఎంబీఏ కొనసాగిస్తున్నాడు.
అండర్-14 నుంచే హైదరాబాద్ జట్టులో ఎనిమిదేళ్ల వయసు నుంచే క్రికెట్ పై ఆసక్తితో, ఏండ్ల తరబడి కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో ముందుకుసాగాడు. అండర్-11 నుంచి, అండర్-14, అండర్-15, అండర్-16, అండర్-19 ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

238 పరుగులతో వెలుగులోకి
2018లో బీసీసీఐ నిర్వహించిన విజరు మర్చంట్ ట్రోఫీలో కేరళపై అజేయంగా 238 పరుగులు సాధించి దేశవ్యాప్తంగా క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అమన్ ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏ 2019లో హైదరాబాద్ అండర్-16 జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించింది.
మైదానంలో అడుగు పెట్టాడంటే బ్యాటుతో మెరుపులే.. కూచ్ బెహార్, వినూ మన్కడ్ ట్రోఫీల్లో హైదరాబాద్ అండర్-19 తరఫున నిలకడగా రాణించాడు.
2022-23 సీజన్‌లో కూచ్ బెహార్ ట్రోఫీలో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 409 పరుగులు. అందులో మూడు పతకాలు.
2023-24 సీజన్‌లో సీకే నాయుడు ట్రోఫీలో 79 సగటుతో 709 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పేరు సాధించాడు.
బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే 67 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తాజా సీజన్‌లోనూ అదే జోరు కొనసాగడంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు.
టీ 20 ఫార్మాట్ అమన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడే శైలి అతడి ప్రత్యేకత. కెరీర్ ఆరంభం నుంచీ ఓపెనర్‌గా రాణిస్తున్న అమన్ టీ 20 ల్లో 162 స్ట్రైక్‌రేట్ సాధించడం విశేషం.
”అమన్‌కు ఐపీఎల్ అవకాశం రావడం మా కుటుంబానికి పండుగ వంటిది. ఎనిమిదో తరగతి నుంచే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఎంతో శ్రమించి క్రికెట్లో మెలికలు నేర్చుకొని శ్రమిస్తున్నాడు. చదువులు-ఆట రెండింటినీ సమతూకంగా కొనసాగిస్తున్నాడు. ఇది అతడి కష్టానికి దక్కిన ఫలితం.” అంటారు మధుకర్ రావు
”నాన్న మధుకర్ రావు, అమ్మ సమీరా, పెద్దనాన్న, మనోహర్ రావు స్ఫూర్తితో చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఇష్టం పెరిగింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం నా బలం. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇది నన్ను నేను నిరూపించుకునే వేదిక.. భవిష్యత్‌లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం” అంటాడు అమర్‌రావు.
– పాశం భాస్కర్ రెడ్డి
8499999197



