Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'ఉపాధి హామీ' పేరు మార్చడం సరికాదు

‘ఉపాధి హామీ’ పేరు మార్చడం సరికాదు

- Advertisement -

ఇది రాజకీయ కుట్ర : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో నిరసన

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, మొయినాబాద్‌
ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం సరికాదని, మహాత్మా గాంధీ పేరు తొలగించి ఉపాధి చట్టం ఉసురు తీయొద్దని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఇది బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రగా అభిప్రాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ముందుగా గ్రామంలో ర్యాలీ తీసి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌కుమార్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం గాంధీజీకి మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చేసిన ఘోర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ పథకానికి నిధులు తగ్గించడం, బకాయిలు పెంచడం, పనిదినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తున్నదని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ ద్వేషంతో మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈ పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా తగ్గాయని, నిరుపేద కుటుంబాలకు జీవనాధారం కలిగిందని తెలిపారు. గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రెటరీ చల్లా వంశీచంద్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్‌, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీమ్‌భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -