నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సమావేశాల్లో MPTC, ZPTC ఎన్నికల్లో రిజర్వేషన్లు, PACS ఎన్నికలు, మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం. గత సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగస్టు 2025లో పంచాయతీ రాజ్ చట్టాల సవరణలకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది.అయితే రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించడాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ అక్టోబర్‌లో హైకోర్టు స్టే విధించింది.
ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు లేకుండా MPTC, ZPTC ఎన్నికలు జరపకూడదని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని తొలగించాలని ఒత్తిడి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానాలు, పార్లమెంటులో ప్రైవేట్ బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు వంటి చర్యలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మరి జనవరి 2 నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.



