రాష్ట్రంలో 54 మంది.. జిల్లాలో ఐదుగురు
రాజన్న సిరిసిల్ల జిల్లా మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారా..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మావోయిస్టులు ఇతర ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర కమిటీ లో పనిచేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 54 మంది మావోయిస్టులు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. అనేకమంది మావోయిస్టులు వివిధ క్యాడర్ లో ఉంటూ లొంగిపోతుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ఎందుకు లొంగుబాటు ఆలోచనలో లేరనే చర్చ పోలీసుల్లో కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గండి లచ్చపేటకు చెందిన చిన్నన్న అలియాస్ ఉప్పలయ్య 30 ఏళ్ల క్రితమే అప్పటి పీపుల్స్ వార్ లో చేరి కనిపించకుండా పోయాడు. అతను పార్టీకి దూరంగా ఉంటూ పూణేలో వ్యాపారం చేసుకుంటున్నట్లు పోలీసులు అనుకుంటున్నారు. అలాగే అదే సమయంలో కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన బండి చంద్రయ్య విప్లవ పార్టీలోకి వెళ్లాడు.
ఇప్పటివరకు అతను జిల్లాకు రాకపోవడంతో అతను కేంద్ర కమిటీలో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపెళ్లికి చెందిన శ్రీనివాస్ మావోయిస్టు పార్టీలోనే ఉన్నట్లు సమాచారం. కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన జ్యోతి కొద్ది రోజుల క్రితం లొంగిపోయింది. 2002లో గంభీరావుపేట మండల కేంద్రంలోని బరిగలగూడెంకు చెందిన మహేష్ పీపుల్స్ వార్ లోకి వెళ్ళాడు. చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన బత్తుల కాంతయ్య నలభై ఏళ్ల క్రితం గ్రామాన్ని వీడి పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్ళాడు. అలాగే కోనరావుపేట మండలం శివంగలపల్లి కి చెందిన తొట్ల లక్ష్మి కి చందుర్తి మండలం అనంతపల్లి కి చెందిన లింగయ్య తో వివాహం జరిగింది .అత్తగారింటికి వెళ్లిన లక్ష్మి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పార్టీలో చేరింది .ఇటీవలనే లక్ష్మీ భర్త లింగయ్య మరణించినప్పటికీ ఆమె భర్త కడచూపుకు నోచుకోలేదు. వారు కేంద్ర కమిటీలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
లొంగిపోయే ఆలోచనలో ఉన్నారా…
ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం ఓవైపు మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తుండగా మరోవైపు వందలాదిమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల చెందిన మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోతున్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన 54 మంది మావోయిస్టులు కేంద్రంలోని వివిధ క్యాడర్ లో పనిచేస్తున్నప్పటికీ ఎందుకు లొంగిపోవడం లేదనీ తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి చంద్రయ్య, బరిగెల మహేష్, శ్రీనివాస్, చిన్నన్న, బత్తుల కాంతయ్య, తొట్ల లక్ష్మీ లు లొంగిపోయే ఆలోచనలో ఉన్నారా… లేదా అనేది పోలీసులకు ప్రశ్నగా మిగిలింది. వీరిలో ఒకరిద్దరు మావోయిస్టులు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ముందు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.



