Monday, December 29, 2025
E-PAPER
Homeదర్వాజఅరుదైన కవిత్వ సాధనం అధివాస్తవికత

అరుదైన కవిత్వ సాధనం అధివాస్తవికత

- Advertisement -

సాహిత్యంలో అధివాస్తవికత ఉద్యమం 1924లో పుట్టింది. ఆండ్రే బ్రెటన్‌ (Andre Breton) అనే ఫ్రెంచి రచయిత, కవి దీని వ్యవస్థాపకుడు. స్వప్నావస్థలో మెదిలే ఊహలను స్పృహతో నియంత్రించకుండా, ఉన్నదున్నట్టుగా వ్యక్తీకరించడం దీని లక్షణం. ఇంకా వివరంగా చెప్పాలంటే, స్వేచ్ఛాయుత సృజన మీద విధింపబడే తార్కిక యోచన, ప్రామాణిక నైతికత, సామాజిక కళా సంప్రదాయం, నిబంధన మొదలైన అన్ని ఆంక్షలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ముందస్తు ఆలోచన ద్వారా కళాప్రక్రియను అవరోధించడాన్ని నిషేధించడం దీని ముఖ్య ధ్యేయాలు. ఆంతర్యపు లోతు (deep mind) ను ఏ అంతరాయం లేకుండా పని చేయించే ఆటోమేటిక్‌ రచనా విధానాన్ని ఈ ఉద్యమవాదులు ఆశించారు. కలలను, నిద్ర – మెలకువల మధ్య ఉండే అవస్థలను, సహజ విభ్రమాలను, లేదా మాదక ద్రవ్యాల ప్రభావంతో కలిగే భ్రాంతులను తమ రచనలలో ఉపయోగించేందుకు ప్రయత్నించారు.

చైతన్య స్రవంతి శిల్పంలో మనసులో మెదిలే ఊహలను ఉన్నదున్నట్టుగా వ్యక్తీకరించటం ఉంటుందని ఆ వ్యాసంలో చెప్పుకున్నాం. అధివాస్తవికతలో కూడా అదే ప్రధాన లక్షణమని మళ్లీ ఇప్పుడు అంటున్నాం. మరి ఈ రెండింటి మధ్య గల భేదమేమిటి? మొదటిదానిలో, రాస్తున్న సమయంలో కవి/ రచయిత మనసులో మెదిలే జాగత ఊహలను కాయితం మీద పెట్టడం జరుగుతుంది. దీనికి భిన్నంగా, స్వాప్నిక తార్కికతను వ్యక్తీకరించటం అధివాస్తవికత లక్షణం. చైతన్య స్రవంతిని ఎక్కువ వరకు సాహిత్యంలో మాత్రమే చూస్తాం, అధివాస్తవికత ఇతర కళలకు కూడా పాకింది. రెండూ సాహిత్యంలో కనిపించేవే అయినా, మొదటిదాన్ని కవిత్వంలోకన్న వచనంలో తరచుగా దర్శిస్తాం.

అధివాస్తవికతకన్న కొంచెం ముందు – అంటే, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే – 1916 లో ట్రిస్టాన్‌ జారా అనే రొమేనియన్‌/ ఫ్రెంచ్‌ కవి, నాటక రచయిత, సాహిత్య విమర్శకుడు డాడాయిజం అనే సాహిత్యోద్యమాన్ని ప్రారంభించాడు. ఇది కళారంగంలో, బూర్జువా సమాజంలో నెలకొన్న కుహనా విలువల మీద, తార్కికత మీద, సమంజసత్వం మీద దాడి చేసింది. మన దిగంబర కవుల కవిత్వం లాగా డాడాయిజం పాఠకులను బలమైన షాక్‌ కు గురి చేసింది. కాబట్టి, దీన్ని అధివాస్తవికతకు మూలంగా లేదా పూర్వగామి (precursor) గా ఎంచాలి. కొంత భిన్నత్వంతో అధివాస్తవికతను, డాడాయిజంను పోలిన Nihilism ప్రధానంగా తాత్విక, నిరాశావాద ధోరణితో కూడుకున్నది. జీవితం అర్థం లేనిది, అసంబద్ధమైనది అని అభిప్రాయపడ్డారు దానికి చెందిన ఆల్బర్ట్‌ కామూ, జాక్‌ పాల్‌ సార్త్ర్‌ మొదలైన రచయితలు. కనుక దీన్ని ఆ రెండు సాహిత్యోద్యమాలకు ఒక విధమైన తోబుట్టువుగా భావించవచ్చునేమో. కానీ Nihilism (దీని సరైన ఉచ్చారణ నాయెలిజం) వీటికన్న ఒక శతాబ్దం ముందే వేళ్లూనుకున్నది.

అధివాస్తవికత కేవలం సాహిత్య రంగంలోనే కాకుండా చిత్రకళ, శిల్పకళ మొదలైన ఇతర రంగాలలోకి కూడా చొచ్చుకుపోయింది. అధివాస్తవికతకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఎందరో ఆధునిక కవులలో, రచయితలలో కనిపిస్తుంది. వీరు స్వేచ్ఛాయుతమైన రచన, భిన్నమైన వాక్య నిర్మాణం, తర్కరాహిత్యం, క్రమరాహిత్యం, పీడకలల వంటి వ్యాఖ్యానం, దిగ్భ్రాంతికరమైన, చిత్రవిచిత్రమైన, విడివడినట్టుగా కనిపించే పదచిత్రాలను పక్కపక్కన పెట్టడం మొదలైనవాటితో ప్రయోగాలు చేశారు. ఫ్రాంక్‌ ఓ హారా, కెన్నెత్‌ కోక్‌, బాబ్‌ డిలన్‌, ఫ్రాంజ్‌ కాఫ్కా మొదలైన ఎందరో ఆధునికుల రచనలలో దీన్ని మనం గమనించవచ్చు. డిలన్‌ థామస్‌ పేరు కూడా చెప్పుకోతగిందే. చిత్రకళా రంగంలో సాల్వడార్‌ డాలీ అధివాస్తవికతకు పెట్టింది పేరు. మరుభూమి నేపథ్యంతో కరుగుతున్న గడియారాలు (melting clocks) అనే డాలీ పెయింటింగ్‌ ఎంతో ప్రసిద్ధమైనది.

ఆంగ్ల వచన రచనలలోంచి అధివాస్తవికతకు ఉదాహరణ అనతగిన వర్జీనియా వుల్ఫ్‌ వాక్యాన్ని తెలుగులో చదవండి: ”సూర్యుడు ఉదయించాడు, ప్రపంచం ఎల్లలు లేని ఆటలగదిలో తళతళ మెరుస్తున్న ఆటబొమ్మలా కనిపించింది.” ఇటాలో కాల్వినో రాసిన Invisible Cities నుంచి మరొక వాక్యం ఇలా ఉంది: ”నగరం కొన్నిసార్లు ఎంత తేలికగా ఉన్నట్టు స్ఫురిస్తుందంటే, మనం మార్దవంగా పలికిన ఒక పేరు తాలూకు ధ్వనిని వదుల్తూ అది గాలిలో తేలిపోతున్నదేమో అన్నట్టుగా.”
ఇంగ్లిష్‌ కవిత్వంలో అధివాస్తవికతకు ఉదాహరణలు కింద ఇస్తున్నాను.

A heap of broken images, / where the sun beats,
And the dead tree gives no shelter (T.S. Eliot, The Waste Land)
Things as they are
Are changed upon the blue guitar (Wallace Stevens, The Man with the Blue Guitar)

తెలుగు కవిత్వంలో అధివాస్తవికతను ఎక్కువగా పొందుపరచిన కవులలో మో ముఖ్యుడు. ఆయన రాసిన ఈ పంక్తులను పరిశీలించండి.
నీలి వాయువులో ఆయువు/ మునిగిపోయిన లాంతరు
మళ్లీ తెప్పోత్సవం అపుడు/ నదిలోకి జారిపోయిన మదిలోంచి
తడవని లాంతరులా/ దీపారాధనకి ఒచ్చేస్తానోచ్‌.
శ్రీశ్రీ రాసిన అధివాస్తవిక కవితా పంక్తులు కొన్ని:
ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి.
అగ్నిసరస్సున వికసించిన వజ్రం! ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ధ్వనించే మదంగనాదం!
ముక్తాయింపుగా చెప్పదల్చుకున్న నా మాటలు ఇలా ఉన్నై: అధివాస్తవికత అంటే తప్పించుకోవలసిన వాస్తవం కాదు, అందులోని ఒక రహస్య ద్వారం. ఆ ద్వారం విశాలమైన మనశ్చిత్రాలకు దారి తీస్తుంది.

ఎలనాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -