Wednesday, December 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికరెన్సీపైనా గాంధీ బొమ్మను తొలగిస్తారేమో?

కరెన్సీపైనా గాంధీ బొమ్మను తొలగిస్తారేమో?

- Advertisement -

గ్రామీణ భారతంలో కులమత లింగభేదాలకతీతంగా ప్రజల జీవన హక్కుల్లో ముఖ్యంగా గౌరవంగా పనిచేసేహక్కును బలోపేతం చేయడానికి నాటి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది. ఇందులో వామపక్షాల పాత్ర ఇందులో చాలా కీలకమైనది, క్రియాశీలకమైనది. దీనికోసం నాడు కేంద్ర బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులు అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామీణ ప్రాంత కూలీలకు కనీసం వంద పని దినాలు కల్పించడానికి ఈ చట్టం రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం వల్ల కూలీల వలస దాదాపుగా ఆగిపోయింది. గ్రామాల్లో రైతు కూలీలు గౌరవంగా బతకడం మొదలు పెట్టారు. ముఖ్యంగా దళిత గిరిజనుల వర్గాలకు చెందిన కూలీల కొనుగోలు శక్తి పెరిగి నాణ్యమైన ఆహారం పొందారు. సామాజిక ఆధిపత్యాన్ని నిలదీశారు. అసమానతల అంతరాలు తగ్గాయి. మొత్తమ్మీద ఈ చట్టం గ్రామీణ రైతు కూలీలకు ఒక వరం లాంటిది.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ చట్టాన్ని క్రమంగా నీరుగార్చడం మొదలుపెట్టింది. రానురానూ పనిదినాలు తక్కువ సంఖ్యలో కల్పిస్తూ లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య కూడా క్రమంగా తగ్గించింది. ఇక కూలీల నమోదు చెల్లింపులు కూడా ఆధార్‌ ఆధారంగా జరుగుతూ లబ్ధి దారుల సంఖ్యను ఒక పథకం ప్రకారం తగ్గిస్తూ వచ్చింది. జాబ్‌ కార్డుల తొలగింపు కూడా ఉపాధి లేమికి దారితీసింది. యంత్రాల వాడకం పెంచింది.పెరుగుతున్న ద్రవయోల్బణాన్ని, జీవన వ్యయాన్ని గమనంలోనికి తీసుకోకుండా వేతనం పెంపు చేయడంతో కూలీలకు అన్యాయం చేసింది. మొదటినుండ ‘నరేగా’చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నది. బడ్జెట్‌ కేటాయింపులు, పనిదినాల విషయంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల పేరుతో చట్టాన్ని నీరుగార్చుతూ వచ్చింది. ఇప్పుడు చట్టం పేరు మార్చి వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గర్‌ అండ్‌ అజీవక్‌ మిషన్‌ (గ్రామీణ్‌) విబి జి ఆర్‌ ఏ ఎం జి పేరుతో కొత్త బిల్లు పార్లమెంటులో ప్రతిపక్షాల సూచనలను వ్యతిరేకతను లెక్క చేయకుండా సభలను బుల్డోజ్‌ చేసి ఆమోదం చేసుకుంది. రాష్ట్రపతి ముర్ము కూడా వెంటనే దానికి తన ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రాలు ఈ పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయవలసి ఉంటుంది.

ముఖ్యంగా చట్టంలోని జాతిపిత గాంధీ పేరును తొలగించడం ఆయన్ను అవమానించడమే. అసలు చట్టాన్ని పథకంగా మార్చడంలోనే పెద్ద కుట్ర దాగి ఉంది. పథకం ఏనాడైనా ఎత్తేయవచ్చు లేదా రద్దు చేయ వచ్చు. అది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఉపాధికే ఎసరు పెట్టే ప్రయత్నం అన్నమాట. అసలు గాంధీ పేరును ఈ పథకం నుండి తొలగించడమే ఒక పెద్ద కుతంత్రంగా భావిం చవచ్చు. ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదేమో. ఆ మధ్య ఏబీపీ అనే ఒక విదేశీ ఛానల్‌తో మాట్లాడుతూ గాంధీకి అంతర్జాతీ యంగా రావలసిన కీర్తి ప్రతిష్టలు రాలేదని మోడీ పేర్కొన్నారు.అందుకు కొనసాగింపుగా గాంధీ సినిమా వల్లనే లేదా ఆ తరువాతనే ఆయనకు గుర్తింపు గౌరవం వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా తెంపరితనమే. గాంధీ సినిమా వల్ల అందులోని నటులకే కీర్తి ప్రతిష్ట వచ్చాయిగాని మహాత్ముడికి కొత్తగా వచ్చిన గుర్తింపు కానీ గౌరవం కానీ ఏమీ కాదు.అసలు మోడీకైనా, బీజేపీకైనా గాంధీ పేరు పట్ల ఎందుకంత విద్వేషం? నరేగా చట్టాన్ని పథకంగా మార్చుతూ గాంధీ పేరును తొలగించడం కేవలం చర్చను పక్కదారి పట్టించడానికే. పథకంలో పేదలకు నష్టం చేసే అంశాలను విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఎత్తిచూపుతున్నా బీజేపీ ప్రభుత్వానికి చలనం లేదు. అసలు ఈ పథకం అమలు కొనసాగింపు కూడా మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుంది.

ఆ మధ్య ఒకనాడు పార్ల మెంటులో ఈ చట్టం కేవలం గుంటలు తవ్వడానికే పనికొచ్చినట్లుందని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రామీణ కూలీలకు పట్టెడన్నం పెడుతూ కనీస గౌరవంతో బతుకుతున్న వారి జీవితాలలో చిచ్చుపెట్టే పథక రచన చేసింది కేంద్రం. దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. గాంధీని చంపిన గాడ్సేను పూజించేది బీజేపీ, దాని ఆరెస్సెస్‌ పరివారమే. ఇప్పుడు గాంధీని సైతం ఆ పథకం పేరులో నుండి తీసివేయడం కుట్రలో భాగమే. ఇంకా భవిష్యత్తులో కరెన్సీ నోట్ల మీద నుండి విశ్వవిద్యాలయాల పేర్ల నుండి కూడా మహాత్ముడి పేరును లేదా ఫొటోను తొలగించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా గాంధీని ప్రజల నుండి, జాతి నుండి కనుమరుగు చేసే కుటీల ప్రయత్నాలకు తెరదీసింది కేంద్రం. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించదగిన తరుణం.

కాంగ్రెస్‌ పార్టీ చేసిన చట్టం ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించి కొంతమేరకు వారి జీవితాల్లో వెలుగునిచ్చింది. బతుకుపై భరోసానిచ్చింది. బీజేపీ పనిదినాలు పెంచుతున్నట్లు పథకంలో చూపిస్తున్నదే కానీ వేతన పెంపు గురించి హామీ ఎక్కడా కన బడడం లేదు. ఎంజి నరేగా కాస్త విజి రాంజీగా మారింది. అందువల్ల పేద ప్రజలకు జరిగే లాభమేమిటో ప్రభుత్వం సమర్ధించుకోలేక పోతున్నది. పత్రికల్లో మాత్రం గ్రామీణ రైతు కూలీలకు ఎంతో లాభం జరగబోతున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇక భవిష్యత్తులో దేశంలో ఉచితాలు ఉండబోవంటూ కూడా ఆర్థికమంత్రి నిర్మలమ్మ హెచ్చరిస్తూనే ఉంది. ట్రంప్‌ సుంకాలతో ప్రజల జీవితాలు అతలాకుతలమ వుతున్నాయి. జీఎస్టీ సవరణ వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. ఒక పక్క ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలను భ్రష్టు పట్టిస్తూ ఇప్పుడు రక్షణ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలకు కూడా తెరదీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులకు ఎర్ర తివాచీ పరుస్తున్నది. ఈ దశాబ్దకాలంలో రెండు లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూత పడ్డా యని కేంద్రమే స్వయంగా పార్లమెంటులో ప్రకటించింది. నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడు తుండగా ఇప్పుడు గ్రామీణ పేదలపై కూడా మోడీ ప్రభుత్వం తన కక్ష తీర్చుకుంటున్నది. ఇక ‘వికసిత భారత్‌’ఎలా సాధ్యం? భవిష్యత్‌ భారత్‌ మరింత దుర్భరం కాబోతున్నది సుస్పష్టం.

శ్రీశ్రీ కుమార్‌ 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -