ఐదు రోజుల సభకు సర్వం సన్నద్ధం
అరుణపతాకాలతో ముస్తాబైన విశాఖపట్నం ఫ్ల్లెక్సీలు, బ్యానర్లు, అమరుల చిత్ర పటాలు, చారిత్రక పోరాట ఘట్టాలతో అలంకరణ
దేశ వ్యాప్తంగా 1600 మంది ప్రతినిధుల రాక
స్ఫూర్తిదాయకంగా మహాసభ ప్రాంగణం
జనవరి 4న కార్మిక కవాతు, బహిరంగ సభ
కామ్రేడ్ ఏవీ ఆనందన్ నగర్ (విశాఖపట్నం)నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్న
సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలకు విశాఖపట్నం నగరం సిద్ధమైంది. బుధవారం నుంచి ఐదు రోజులపాటు ఈ అఖిలభారత మహాసభలు ఇక్కడ జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విశాఖ నగరాన్ని అరుణపతాకాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, అమరుల చిత్రపటాలు, చారిత్రక పోరాట ఘట్టాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. దేశం నలుమూలల నుంచి 1600 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. మహాసభలు జరిగే ప్రాంతానికి కామ్రేడ్ ఏవీ ఆనందన్ నగర్‌గా నామకరణం చేశారు. జనవరి 4వ తేదీ కార్మిక కవాతు, బహిరంగసభ జరగనున్నాయి. మహాసభలో పాల్గొనేందుకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులకు వాలంటీర్లు రెడ్‌సెల్యూట్‌లతో స్వాగతం పలుకుతున్నారు.
ఏర్పాట్లు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభలను నిర్వహించేందుకు అవకాశం రావటంతో సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆహ్వాన సంఘం నిర్ధేశించుకున్న పనులను కార్యకర్తలు, కార్మికులు రాత్రింబవళ్ళు శ్రమించి ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాసభల వేదికైన కామ్రేడ్ అనంతల వట్టం ఆనందన్ నగర్ (విశాఖపట్నం)లోని కామ్రేడ్ బాసుదేవ ఆచార్య, ఎంఎం లారెన్స్ హాల్ మహాసభకు సిద్ధమైంది. ప్రతినిధుల కోసం 38 హౌటళ్లు, 750 రూములను సిద్ధం చేశారు. మహాసభ ప్రారంభమయ్యే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్ లోపల ప్రత్యేక ఆకర్షణలతో ఎల్‌ఈడీ లైట్లు, బయట వెయ్యి మంది వీక్షించేందుకు వీలుగా స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. తొలి రోజు అత్యధికమంది హాజరుకానుండటంతో బయట టెంట్లను వేశారు. తొలి రోజు సభకు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఎస్‌ఈవీఏ వంటి 10 కార్మిక సంఘాల ప్రతిని ధులు సౌహార్ధ్ర సందేశాలు ఇవ్వన్నారు. దేశం వెలుపలి నుంచి వర్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాల్గొంటున్నారు. జనవరి 4న విశాఖ పోర్టు ఏరియాలోగల ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ (పాత) స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అలంకరణ అదుర్స్
సీఐటీయూ మహాసభల నేపథ్యంలో విశాఖ నగరాన్ని అరుణతోరణాలతో అలంకరించారు. దీంతో నగరమంతా ఎర్రవనంగా మారింది. ఆయా కూడళ్ళలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లు ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి. దేశంలోని లక్షలాధి మంది కార్మికులకు నాయకత్వం వహిస్తున్న ప్రతినిధులంతా అలంకరణ అదుర్స్ అంటూ కితాబునిచ్చి, ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పనుల నిర్వహణకు కమిటీలు
మహాసభ ఏర్పాట్ల కోసం 15 కమిటీలు వేశామని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కమిటీ, అకామడేషన్, ట్రాన్స్‌పోర్ట్, డెకరేషన్, ఫుడ్, హాల్, రైల్వే, ఎయిర్ పోర్టు రిసెప్షన్, మెడికల్ అసిస్టెన్స్ కమిటీ, సావనీర్ కమిటీలు వేశారు. రాష్ట్ర కేంద్రం విజయవాడ నుంచి విచ్చేసిన నాయకత్వం వాటన్నింటినీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యవేక్షిస్తోంది. ఆహ్వాన సంఘానికి చైర్మెన్‌గా సీహెచ్ నర్సింగ రావు, కోశాధికారిగా ఏవీ నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.
సీఐటీయూ పతాకావిష్కరణతో ప్రారంభం
మహాసభలను బుధవారం సీఐటీయూ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అమరవీరులకు నివాళులు, ఆహ్వాన సంఘం అధ్యక్షుల స్వాగతోపన్యాసం, ప్రారంభ ఉపన్యాసంతో మహసభలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ స్టేడియం ముందు(కొత్తరోడ్ ) వన్ టౌన్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె హేమలత అధ్యక్షతన జరిగే సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, కార్యదర్శి యలమరం కరీమ్, కోశాధికారి ఎం సాయిబాబు, సీఐటీయూ అఖిల భారత మాజీ ఉపాధ్యక్షులు ఎంఏ గపూర్, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ నాగేశ్వరావు, సీహెచ్ నర్సింగ రావు మాట్లాడుతారు. అలాగే భారీ ర్యాలీ, బహిరంగసభలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తిచేస్తున్నారు. ఆ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐటీయూ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.
ప్రతిష్టాత్మకంగా…
సీఐటీయూ అఖిలభారత మహాసభలు తొలిసారిగా విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లలో జిల్లాలో సీఐటీయూ నాయకత్వంతోపాటు అభ్యుదయ వర్గాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. మహాసభల గురించి సీఐటీయూ శ్రేణులు ఇప్పటికే వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాయి. ప్రజానాట్యమండలి కళాకారుల బృందం ఆ జిల్లా అంతటా ప్రదర్శనలు ఇచ్చింది. మహాసభల సన్నాహకాల్లో భాగంగా నాలుగు రోజుల ముందు నుంచే కార్మికోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజా కళా ఉత్సవాల పేరుతో మహాసభల ఆవరణలో ప్రతిరోజూ సాయంత్రం కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర కార్మికోత్సవాల సందర్భంగా వివిధ రాష్ట్రాల ప్రజా కళాకారులు, కవులుగా గుర్తింపు ఉన్న ప్రముఖులు, ప్రజానాట్యమండలి కళాకారులు, నాయకులు హాజరవుతున్నారు.
నేటి నుంచి సీఐటీయూ అఖిల భారత మహాసభలు
- Advertisement -
- Advertisement -



