‘కళ కళ కోసం కాదు..కళ ప్రజల కోసం’ అన్న నినాదంతో ప్రజానాట్యమండలి ఆవిర్భవించింది. అదీ దాదాపు ఎనభైయేండ్ల కిందట ముచ్చట. 1943 మే నెల చివరిలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభలు జరిగిన సందర్భంగానే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) ఏర్పడింది.పార్టీ మహాసభలతోపాటు ప్రజా కళాకారులకు దక్కిన అద్వితీయ ప్రాధాన్యమిది. అంతకుముందే 1936లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి దేశమంతటా ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలు పరుచుకు న్నాయి. దేవుని స్థానంలో మానవుడినే కేంద్రంగా నిలపడంతో ఆధునికభావాలు ఊపిరి పోసుకున్నాయి. మానవులందరూ సమానమేనని, కుల, మత, లింగ, జాతి, ప్రాంత, భాషా వైష మ్యాలు అస్సలే తగవని మానవీయ సంస్కరణలు ముందుకొచ్చాయి.
1917లో కామ్రేడ్ లెనిన్ సారథ్యంలో సోవియట్ రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్ప డింది. శ్రామిక రాజ్యం సాధ్యమైంది. ఆ తదుపరి రెండవ ప్రపంచయుద్ధంలో (1939-44) కామ్రేడ్ స్టాలిన్ నాయకత్వాన అక్కడి ఎర్రసైన్యం నరహంతక ఫాసిస్టు హిట్లర్ పాలనను ఢ అంటే ఢ అంటూ మట్టి కరిపించడం మనం దరకూ తెలిసిందే. రెండు కోట్లమంది సోవియట్‌ల బలిదానంతో యావత్ ప్రపంచం ఆ యుద్ధోన్మాదం నుండి బయటపడింది. అదే సమయంలో మనదేశంలో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని గడ గడలాడించే రీతిలో స్వాతంత్రోద్యమ పోరాటాలు వెల్లువెత్తాయి. భగత్‌సింగ్ నినాదం ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్థిల్లాలి) దేశమంతటా ప్రతిధ్యనించింది.
ఇక మన తెలంగాణాలో భూమికోసం, భుక్తికోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం, (1946-51) ప్రజ్వరిల్లింది.నాలుగువేలమంది అమరుల ప్రాణత్యాగంతో భారత విప్లవోద్యమానికి బాటలు పరిచింది. ఈ భౌతిక పరి ణామాలన్నింటా దోపిడీని ప్రతిఘటించే ‘మార్క్సిజం-లెనినిజం’ సైద్ధాంతిక భావజాలం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెన్ను దన్నుగా నిలిచిందనేది కాదనలేని సత్యం.
ప్రజాపోరాటాలు – ప్రజాకళలు తత్సంబందిత భావ జాలాలు పరస్పర ఆధారితాలు- పరస్పర ప్రేరితాలు. సిద్ధాంతా నికి కళ తోడైనప్పుడు మాత్రమే ప్రజలను పోరాటాలవైపు కదిలిం
చడం సులభ సాధ్యమవుతుంది. ‘కళ హృదయానుగత మైనది.’ ‘భావోద్వేగాల వారధి’. ‘కళాకారులు మానవ హృదయ నిర్మాతలు’ అన్న నానుడులు ప్రజా పోరాటాలనుండి పురుడు పోసు కున్నవే. లెనిన్ ఇంకొంచెం ముందుకెళ్లి ‘కళ ప్రజలది – ప్రజల నుండి ప్రజలకు’ అన్నాడు. అంటే నిజమైన కళ ప్రజలనుండే పుట్టి, ప్రజల కోసమే శ్రమించి, ప్రజల కోసమే జీవిస్తుంది అన్న సందేశం అంత ర్లీనంగా ఉంది. ఇక్కడో విషయం సుస్పష్టం. సకల దోపిడీల నుండి మొత్తం మాన వాళిని విముక్తి చేసే విప్లవ భావజాలంను ప్రజాకళలు అందిపుచ్చుకోవాలి. ప్రజలను ఆ విధంగా చైతన్య మొనర్చాలి.
పాలకవర్గాల కళలు దోపిడీ సహజమనో, మతమౌఢ్యం భక్తి భావజాలంతోనూ ఆశాస్త్రీయంగా నిద్రమత్తులో ముంచేవిగానో ఉండటం సర్వసాధారణం. లేదా మనిషిని ఆలోచనా రహితుని గానో, పశువుగా దిగజార్చేవిగానో ఉంటాయి. ఇందుకు భిన్నంగా ప్రజాకళలు శ్రామికవర్గ భావజాలంతో శాస్త్రీయంగా ప్రశ్నించే విధంగానూ, ప్రజలను మేల్కొల్పే విధంగానూ, పోరాట పథంలో నడిపించేవిగానూ ఉంటాయి. ప్రతినునిషి తాను ఎలా నడుచు కోవాలో, ఎలా ప్రవర్తించాలో ఎలా పనిచేయాలో అనేది ఆలోచ నలు నిర్ణయిస్తే, ఆ ఆలోచనలను ప్రభావితం చేసి రూపకల్పన గావించేది సైద్ధాంతిక భావజాలం.
ప్రపంచీకరణ ముసుగులో నేడు సంభవిస్తున్న యుద్ధాలు, ద్రవ్య పెట్టుబడి రూపంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం వెనుక సామ్రాజ్యవాద అమానవీయ మార్కెట్ దోపిడీ ఉందన్న సత్యాన్ని మనం మరువకూడదు. అదే సందర్భ ంలో దోపిడీ రూపాలు మారుతున్న కొద్దీ, ప్రతిఘటనా రూపాలు కూడా మారుతూ ఉండాలి చర్యకు ప్రతిచర్య లేకపోతే మానవ జాతి నిస్తేజంగా అణచివేతలో కూరుకుపోతుంది. తిరిగి అంధ యుగంలోకి పోతుంది. ఫాసిస్టు ఉన్మాదులు కోరుకునేది అదే. ‘పాలకులు వేరు పాలితులు వేరు. పాలితులు అంటే ప్రజలు. పాలకులకు ప్రజలు బానిసలుగా ఉండాలి లేదా బానిస మన స్తత్వంతో జీవించాలి. ఏ మనిషి, స్వేచ్ఛగా ఉండకూడదు. దేనిని ప్రశ్నించకూడదు’ అనేది దోపిడీ పాలకుల భావజాలం. ప్రజా కళలు దీన్ని నిర్ద్వంద్వంగా బద్దలు కొట్టాలి.
18వ శతాబ్దంలోనే ఫ్రెంచి విప్లవం ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం త్రి నినాదాలు సమ కూర్చింది. ప్రజా కళాకారుడు త్రికరణ శుద్ధిగా ఈ మూడింటిని కోరుకుంటాడు. మానవాళిని విముక్తి చేసేందుకు అహరహం పాటు పడతాడు. అందుకోసం బలిదానాలకు సైతం వెను కాడడు.సప్ధర్ హష్మీ చూపిన మార్గమదే. ‘జానా హైతో మర్నా సీఖో/ కదం కదం పర్ లడనా సీఖో’ నినాదం ప్రతి పోరాట గుండె ప్రాణనాదం.
ప్రస్తుతం సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ డిజిటల్ మార్కెట్ మాయాజాలంలో మనిషిని ఊపిరాడనీయకుండా పరుగులు పెట్టిస్తుంది. ఇదోరకం పరాయీకరణ. (ఎలియనేషన్) సాటి మనిషి పట్ల మనిషిగా ప్రవర్తించాలన్న ఇంగిత జ్ఞానం కోల్పో యేలా చేస్తుంది. ప్రకృతి నుండి సమాజం నుండి చివరకు తన నుండి తానే వేరుపడుతూ యంత్రంగా మారుతున్నాడు. ఎందు కు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో యువతకు తెలియుని స్థితి దాపురించింది. కుల, మత మౌఢ్య భావజాలంతో జాతి ఉన్మాదంతో రెచ్చిపోయే కుక్కల్లాగా కాట్లాడుకుంటున్న వారిని పాలకుల్లో కూడా చూస్తున్నాము.
యుద్ధాలు, ఆకలి, విధ్వంసం, ఉగ్రవాదం, పేదరికం, వివక్ష, హింస- ఇవన్నీ సామ్రాజ్యవాద దోపిడీ సృష్టించే విష పరిణా మాలే. ఈ నరహంతక పాలకులను ప్రతిఘటించి ప్రజలు తమంత తాము విముక్తి పోరాటపథంలో పయినించాలంటే వారికి దారిదీపంలా వెలుగు చూపించేవి ప్రజాకళలు మాత్రమే. అందుకే సఫ్టర్ హష్మీ ప్రజాకళాకారులకు ద్విముఖ కర్తవ్యాలు అప్పగించాడు. 1.పాప్రంచిక పరిణామాల పట్ల అవగాహన అధ్యయనం తప్పనిసరి. వర్గ స్పృహ లేకుండా వర్గ చైతన్యం పొం దలేము. పెంపొందించలేము. 2.ఆ వర్గ స్పృహతో ప్రజా కళా రూపాలు సృష్టించడం అంటే ఉత్పత్తి చేయడం. అదీ మారు తున్న ప్రజల అభిరుచులకనుగుణంగా విలువలతో సాగాలి. ఆ రూపాలు సవ్యంగా, నాణ్యంగా నిలబడాలి. అప్పుడే ప్రజలు వాటిని అవాహన చేసుకుంటారు. ఈ రెండింటి మేలుకలయికే ప్రజాకళలను పోరాటపథంలో నిలుపుతాయి. హష్మీ అందించిన ఆధునిక వీధి నాటిక ప్రక్రియ అలాగే రూపొందింది.
ప్రజానాట్యమండలి – హష్మీ మరణానంతరం ప్రతి రాజ కీయ సందర్భంలోనూ ఆ విధంగా వర్క్‌షాపులు పెట్టి వీది నాటి క ప్రక్రియను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకుపోయింది. ‘దేశం కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్’ అన్న నినాదాలతో 1987లో భారత జ్ఞానవిజ్ఞాన సమితి తెలుగునాట కళాజాతాల ఒరవడికి శ్రీకారం చుట్టింది. వీధినాటిక-కళాజాతాల ముమ్మర ప్రదర్శనలతో ప్రజా చైతన్య భావజాలం ఒక ఉద్యమం గా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగింది. ఎక్కడికక్కడ వందల వేల సంఖ్యలో ప్రదర్శనలతో పాటు ప్రజాకళాకారులూ పుట్టుకొచ్చారు. ఇదంతా, ఇటీవల జరిగిన చరిత్ర. ఆ తడి ఇంకా ఆరిపోలేదు. ప్రజలవేదనతో మమేకం కావడం, శోధనతో నిత్యం వర్క్‌షాపులు నిర్వహించుకుని కళారూపాలు సృష్టించుకోవడం, శిక్షణా శిబిరాల ద్వారా సాధనను పరిపుష్టం చేసుకోవడం, చివరకు ప్రజల్లో ప్రదర్శనలిచ్చి ప్రజాపోరాటాల్లో, ఉద్యమాల్లో మమేకం కావడం.
కామ్రేడ్ లెనిన్ చెప్పిన అంశం ‘కళ ప్రజలది. ప్రజల నుండి ప్రజలకు’ అంటే ఇదే. మధ్యలో ప్రజల్లో వర్గ చైతన్యం కల్పించే బాధ్యత సృజనశీలురైన ప్రజాకళాకారులది. కళారూపాలది. ప్రజా కళాకారుడు నిత్య విద్యార్థిలా తన వర్గచైతన్యాన్ని నిరంతరం పెంచుకుంటాపోతేనే ప్రజలకు దాన్ని అందించగలడు. వస్తువులో, రూపంలో ఈ అధ్యయనం ఆచరణ నిరంతరం కొనసాగించాల్సిందే. మానవుడ్ని కనపడని దోపిడీ సంకెళ్లతో బంధించి జీవచ్ఛవంగా మార్చే భావజాలానికి, మానవుడిని స్వేచ్ఛగా విముక్తి చేసి సమసమాజం వైపు నడిపించే భావ జాలానికి మధ్యన జరిగే ఘర్షణే వర్గ చైతన్యం. వర్గ స్పృహ – వర్గ కసి లేకుండా వర్గ చైతన్యం ఉద్భవించదు. అది లేనప్పుడు మనిషి ముక్కచక్కలవుతాడు. కులం, మతం, భాషా, ప్రాంతం, జాతి, లింగం, వివక్ష భావాలు, ఉన్మాదం తలెకెక్కుతాయి.
ప్రజా కళాకారుడు వీటిని అధిగమించాలి. దోపిడీ, ఉన్మాద, వివక్ష భావాలు అంతకంతకు ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తాయి. మత్తు, మాదకద్రవ్యాలతో నిర్వీర్యంచేస్తాయి. హింస, అశ్లీల భావా లతో పశువుగా దిగజారుస్తాయి. భక్తి మౌఢ్యం గుప్పెట్లో బంధి స్తాయి. వీటిలో కొట్టుకుపోయేవాడు ప్రజా కళాకారుడెలా అవు తాడు? జాతిని ఎలా జాగృతం చేస్తాడు. ‘జాతిని జాగృతం చేసిన వాడే నిజమైన కళాకారుడు’ అని గోర్కీ చెప్పాడు కదా! అంటే ముందుగా కళాకారుడే జాగృతం కావాలి. అందరికంటే ముందు గా మేల్కొనాలి. అందుకే నాటికైనా, నేటికైనా, ఏనాటికైనా ప్రజా కళా కారులకు కళారూపాలకు వర్గచైతన్యమే దిక్సూచి. వర్గ చైత న్యంకై వర్క్‌షాపులు, విస్తృత ప్రదర్శనల నిర్వహణ శిరోధార్యం కావాలి. ఆ విధంగా ప్రజాపోరాటబాటలో మమేకం కాగలం.
(జనవరి 02 హష్మీ 37వ వర్థంతి)
కె.శాంతారావు 9959745723



