2025 సంవత్సరం ముగిసింది. నూతన సంవత్సరం ఆరంభమైంది. అంతర్జాతీయంగాను, జాతీయంగాను గతేడాది ఎన్నో అనుభవాలను, ప్రశ్నలను ప్రజలకు మిగిల్చింది. పలు పాఠాలను కూడా నేర్పింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అనాలోచితమైన భారీ సుంకాల విధింపుతో భారత్‌తో సహా వివిధ దేశాల వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) ఉనికి కూడ ప్రశ్నార్థకంగా మారింది. పాలస్తీనాలోని కీలక ప్రాంతాలపై అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ సైన్యం సాగించిన మారణహోమం నేటికీ అంతం కాలేదు. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఇంతటి స్థాయి అమానుషమైన మారణకాండ చరిత్రలో జరుగ లేదు. చిన్న పిల్లలతో సహా వేలాది మంది సామాన్య ప్రజలు ఇజ్రాయిల్ సాగించిన వికృత యుద్ధక్రీడకు బలయ్యారు. ఐక్యరాజ్యసమితి చేసిన అన్ని తీర్మానాలను, నిర్ణయాలను ఇజ్రాయిల్ తుంగలో తొక్కింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రపంచంలోని పలు దేశాలను రాజకీయంగా, ఆర్థికంగా బెదిరిస్తూ, అనేక దేశాలకు ఆయుధాలను ఒకపక్క అమ్ముతూ, మరో వైపు శాంతి వచనాలను ట్రంప్ వల్లె వేయడం హాస్యాస్పదంగా మారింది. పైగా 2025 నోబెల్ శాంతి బహుమతిని ఆయన ఆశించడం మరో వైపరీత్యం. మన దేశ పరిస్థితులను నిశితంగా పరిశీలిద్దాం. మన ప్రజాస్వామ్య వ్యవస్థ, విశిష్టమైన రాజ్యాంగ సూత్రాలు ప్రమాదంలో పడ్డాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక సుస్థిరత, రాజకీయ విలువలు వంటి పలు అంశాల్లో మన సమాజం పెను సవాళ్లను ఎదుర్కుంటోంది. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీడీపీ వృద్ధిరేటులో ప్రపంచంలో నాల్గవ స్థానానికి చేరుకున్నామని మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీన్ని సానుకూల అంశంగానే పరిగణిద్దాం. అయితే అదే సమయంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, వారి సగటు ఆదాయం వంటి అంశాల్లో ప్రపంచంలో మనం ఎంతో దూరంలో ఉన్నాం.
దేశంలో పదిశాతం మంది సంపన్నుల వద్ద మొత్తం సంపదలో 65 శాతం పోగుపడిందని ఇటీవలి నివేదికలు స్పష్టం చేశాయి. దేశ సంపద ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు కోట్ల మంది సామాన్యుల ఆదాయాల్లో మాత్రం వృద్ధి లేక ఆర్థిక అంతరాలు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. దేశ ప్రజల మౌలిక సమస్యలకు సరైన పరిష్కారాలు నేటికీ లభించలేదు. 2047నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముమ్మర ప్రచారం జరుగుతోంది. అందుకు తగిన నిర్దిష్ట ప్రణాళిక ఏదీ తయారు కాలేదు. దేశంలో ఉపాధి కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. యువతకు ఉద్యోగాలు లేవు. మహాత్మాగాంధీ పేరుతో తీసుకు వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు ఒక ప్రభుత్వ పధకంగా మార్చేశారు. ఈ చర్య గ్రామీణ పేదరికంపై దాడి చేయడమే. పైగా ఈ పధకం అమలు కయ్యే మొత్తం ఖర్చులో ఇప్పుడున్న పదిశాతం నుండి నలభైశాతం వరకు రాష్ట్రాలు భరించాలి. సాఫ్టువేర్ రంగంలో కూడా ఉద్యోగాలు పోతు న్నాయి. మన దేశ కరెన్సీ రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పతనమైంది. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉన్నాయి.
ఒకపక్క తీవ్రస్థాయిలో ఆర్ధిక అసమానతలు నెలకొనగా, మరోపక్క అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ల ఆస్తులు భారీగా పెరిగి పోయాయి. విద్యా, వైద్యరంగాల్లో దిగజారిన ప్రమాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కార్మికుల హక్కులకు ప్రాణం పోసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు కోసం నోటిఫికేషన్ తెచ్చారు. మహిళా కార్మికులు రాత్రి వేళల్లో పని చేసేలా చట్టాలను మార్చారు.అనేక ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఉన్నావో నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ శిక్షను సస్పెండ్ చేసి ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడం దేశాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ బెయిల్ రద్దయింది. సమాజంలో మహిళల అభ్యున్నతికి, వారి రక్షణకు ఇలా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక స్వావలంబనలో భాగంగా ఏర్పడ్డ పలు ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. బహుళ జాతి కంపెనీలు, దేశీయ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వారి ముందు మన ప్రభుత్వ ప్రభుత్వాలు అడ్డగోలుగా మోకరిల్లడం చూస్తున్నాం.
ప్రయివేటు విమానయాన సంస్థ ఇండిగో అసమర్ధత, నిస్సహా యత వేలాదిమంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ పెద్దలు ఒక ప్రక్క స్వదేశీ పల్లవి పాడుతుండగా, మరోపక్క బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ బీమా చట్టాల్లో తలపెట్టిన మార్పులను పార్లమెంటు ఆమోదించడం చూస్తే, ప్రజల్ని తీవ్ర గందర గోళంలోకి నెట్టి తాము అనుకున్న విధానాలను కచ్చితంగా అమలు చేయాలనే ప్రభుత్వ వ్యూహం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశంలో అనేక ప్రాంతాల్లో నెలకొన్న పర్యావరణ విధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా జీవ సమతుల్యత, ప్రజారోగ్యం, మానవ మనుగడకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రజల మౌలిక సమస్యలపై విశ్లేషణాత్మక చర్చలు జరిగాలి. వాటికి పరిష్కారాలు వెతకాలి.
ఇటువంటివి జరగాల్సిన కాలంలో మత ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టాలనే ఆలోచనలు, విషపూరిత ప్రచారం మరింత ఉధృతమవుతున్నాయి. దేశ చరిత్రపై ఎటువంటి అవగాహన లేకుండా, వందేమాతరం గీతంపై పార్లమెంటులో జరిగిన అనవసర చర్చలు, అవాస్తవ ప్రసంగాలు దీనికి ఒక తార్కాణం. దేశ విశాల, విస్తృత ప్రయోజనాల కోసం హానికరమైన ఈ ప్రయత్నాలకు నూతన సంవత్స రంలో అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది. దేశ సమైక్యత వెల్లివిరిసేలా అందరూ కృషి చేయాలి. కోట్లాది మంది ప్రజల న్యాయమైన ఆకాంక్షలకు ఆచరణ రూపమివ్వాలి. ఉపాధి రహిత అభివృద్ధి, ఆర్థిక వ్యత్యాసాల వంటి మౌలిక సమస్యలకు ఇప్పటికైనా సరైన సమాధానాలు, అంటే ఆచరణీ యమైన పరిష్కారాలు, ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించాలి. వాటి అమలు కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. కీలకమైన ఈ కృషిలో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అభ్యుదయవాదులు, సామాజిక వేత్తలు ముఖ్య భూమిక పోషించాలి.
వి.వి.కే.సురేష్ 9440345850



