రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా సే గంగా’ (కథలు) ‘విస్మృత యాత్రికుడు’ (నవల) డి.డి. కోశాంబి రాసిన ‘భారత చరిత్ర’ – పరిచయ వ్యాసాలు గార్డెన్ చైల్డ్ రాసిన ‘చరిత్రలో ఏం జరిగింది?’ వంటి పుస్తకాల్ని స్త్రీ దృక్కోణంలోంచి పరిశీలించినపుడు మానవ సమాజంలో వివిధ దశల్లో స్త్రీకి ఉంటూ వచ్చిన స్థానాన్ని కొంతవరకు బేరీజు వేసుకోవచ్చు. తరతరాలుగా ”ఆమె” పరిస్థితి ఏ మాత్రం మెరుగుకాలేదని ఆధారాలతో నిరూపించొచ్చు. రాహుల్ జీ సంస్కృత పండితుడు. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో బోధన చేశాడు. స్వాతంత్య్ర యోధుడిగా జైలు జీవితం గడిపాడు. ఆయన సంపాదించుకున్న అపారమైన అనుభవం, విజ్ఞానం భారతీయ సంస్కృతిపై అనేక పుస్తకాలు రాయడానికి దోహదం చేసింది. అలాగే మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథంగల వారందరూ డి.డి. కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు.
చారిత్రక పూర్వదశను గురించి రాసిన చరిత్రకారుల్లో గార్డెన్ చైల్డ్ హిమాలయం వంటి వాడని ఒక అభిప్రాయం ఉంది. ఇటు సాహిత్యం అటు చరిత్ర, సామాజిక శాస్త్రాలలో నిష్ణాతుల యిన వీరి రచనల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు చాలాలోతుగా నిర్మించబడ్డాయి. కలగా పులగంగా ఉన్న ఎన్నో అంశాల్ని ఒక దృష్టికోణంతో పరిశీలించినట్లయితే – స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం మనకు సాక్షాత్కరిస్తుంది! మాతృస్వామ్యంలో అధికారం అంతా తల్లిదే. ఆమె ఆజ్ఞ లేనిదే సమూహంలో ఏదీ అయేది కాదు. వేటాడడం, తోలు అచ్చాదనలు తయారు చేయడం, ప్రేమించడం అన్నీ ఆమె పర్లవేక్షణలోనే అయ్యేవి. అప్పుడు ఒకటి మాత్రం కష్టంగా ఉండేది. నాయకురాలి సంతానానికి తండ్రెవరో తెలిసేది కాదు. ఇది సాధారణ శకానికి ముందు (బిసి) ఆరువేల నాటి పరిస్థితి. మూడువేల బిసి.ఇ. నాటికి కూడా పరిస్థితి మారలేదు. అడిగిన వారికి ఏ స్త్రీ అయినా తలుపు తెరవకుండా ఉండేది కాదు. నగంగా నిలబడితేనె, మద్యం అగ్నికి ఆహుతి చేసేప్పుడు, వాయిద్యాలు మోగిస్తూ అడవిలోకి వెళ్లేప్పుడూ నాయకురాలే ముందుండేది. అడవిలో స్వేచ్ఛగా విహరించే లేళ్లలా, పక్షుల్లా స్త్రీ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేది.
సాధారణ శకం 2500 బిసి నాటికి పరిస్థితి కొంత మారింది. మట్టితో, రాళ్లతో, గోడలు లేచాయి. పశువుల్ని మచ్చిక చేసుకుని, వ్యవసాయం చేయడం మొదలైంది. సమూహాలు స్వేచ్ఛగా తిరగడం మాని, గ్రామాలుగా ఏర్పడడం మొదలయింది.తమ కోసం అని కాకుండా, తమ తరువాత తరాల కోసమని ఆహారం, ఆస్తి, సంపద నిలువ చేయడం మొదల య్యింది. దాంతో నాగరికత గొప్ప మలుపు తిరిగింది. మట్టితో రాళ్లతో గోడలు రావడం, క్రమంగా స్త్రీ వాటి మాటున ఉండిపోవడం జరిగింది. భద్రత కోసం, సహజసిద్ధమైన కొన్ని అవసరాల కోసం పురుషుడి మీద ఆధార పడాల్సి వచ్చింది. సమూహాల మధ్య యుద్ధాలు జరగడం మొదలైనప్పటి నుండి పురుషుడు అధికారంలోకి వచ్చాడు. సేనకు అధిపతిగా ఉండడం మహాపితరుని కర్తవ్యం – అనే భావన స్థిరపడింది. అంతకు ముందు లేని అబద్దం, మోసం, కుట్ర మొదలయినవన్నీ మనిషికి అలవడ్డాయి.
2000 బిసిఇ నాటికి పరిస్థితులు మరింతగా మారాయి. చెట్ల మీద పెరిగే ఒక రకపు ఉన్ని, గొర్రెల ఉన్ని – ఉపయోగించడంతో పాటు, నూలు బట్టలు వాడుకలోకి వచ్చాయి. పురుషుడు బలవంతుడై స్త్రీలను రాణివాసంలో బంధించి ఉంచాడు. అంటే, స్త్రీ వ్యక్తిత్వాన్ని హరించి, సొంత వస్తువుగా చేసుకున్న క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి. 1500 బిసిఇ నుండి 490 వరకు ఇలాంటి విషయాలెన్నో మనకు కనిపిస్తాయి. బలవంతుడు బలహీనున్ని అణగదొక్కడం సాధారణ శకానికి ముందు నుండే కనిపిస్తోంది. ఒకన్ని దెబ్బతీసి, బానిసగా కట్టి పడేసినప్పుడే వాడిమీదా, వాడి కుటుంబ సభ్యులందరి మీదా బలవంతుడికి అధికారం లభించింది. స్త్రీ తన పురుషుడు పెట్టే బాధల్నే కాకుండా, తనవాడికి యజమానైన బలవంతుడు పెట్టే బాధల్ని కూడా భారించాల్సి వచ్చింది. బలవంతులు దాసజనంలో భార్యాభర్తల సంబంధాన్ని మన్నించలేదు. స్త్రీని భర్తతో విడదీసి అమ్మారు. పిల్లలతో విడదీసి అమ్మారు. డబ్బున్న వాడు ఇద్దర్నీ, నలుగుర్నీ, పది మందిని మాత్రమే కాదు, చివరకు వంద మందిని కూడా పెళ్లి చేసుకోగలిగాడు. పెళ్లి లేకుండా కూడా అనుభవించగలిగాడు. జల క్రీడల్లో వారిని దిగంబరంగా పాల్గొనమన్నాడు.
అందమైన యువతుల్ని పాలరాతి విగ్రహాలుగా నిలబెట్టుకుని తన జీవిత సౌధాన్ని అలంకరించుకున్నాడు. ఒకే ఒకసారి బలవంతుడు – వీరుడు లేదా రాజు సృషించినందుకు శిక్షగా వందలాది స్త్రీలు సహగమనం పేరుతో అగ్నికి ఆహుతయ్యేవారు. సాధారణ శకం 630లో అక్షయ వటవృక్షం మీది నుంచి వితంతువులంతా యము నానదిలోకి దూకి ప్రాణం పోగొట్టుకోవాలని శాసనం ఉండేది. అది ప్రయాగలో అమలు జరుగుతూ ఉండేది. సతీసహగమనం పేరుతో వితంతువులని సజీవంగా దహనం చేయడాన్ని వారు పాపంగా భావించలేదు. మహా పుణ్యమనే భావించారు. రాహుల్ జీ సృజనాత్మక రచనలోని ఒక పాత్ర – ఇలా అంటుంది. ”హర్షుడి లాగా, మిగిలిన రాజర్షుల్లాగా లక్షమంది యువతులను అనుభవించడానికి పందెం కట్టగలిగేవాన్ని” అని! ఆ మాటలోని పూర్వాపరాలు ఆలోచించుకుంటే బౌద్ధమతం బాగా వ్యాప్తిలో ఉన్న సమయంలో కూడా స్త్రీకి ఎంత విలువనిచ్చారో తెలుస్తూ ఉంది. బ్రహ్మచర్యం అన్నారు గానీ, తరతమ భేదం లేకుండా స్త్రీలందరూ పొందుకు పనికొచ్చేవారు.
భిక్షువులు, సన్యాసులు, ఉండే మఠాలన్నీ అసజమైన వ్యభిచార గృహాలయ్యాయి.” – అందుకే కాబోలు 430 బిసిఇ నుంచి యజమానులు దాసీ పుత్రుల్ని వదిలేసి, పుత్రికల్ని ప్రేమతో పెంచుతూ వచ్చారు. ఆ ప్రేమ వెనుక కారణాల్ని మనం చాలా సులభంగా అవగతం చేసుకోవచ్చు. జీవితమంతా నగంగా యువతులతో చేయగల వెకిలి చేష్టలన్నీ చేసిన తర్వాత రాజులు రాజర్షులయారు. భోగులు యోగులయ్యారు. రాణీవాసంలోని యువతులందరినీ బ్రాహ్మణులకు దానం చేసి ”మోక్షం” సంపాదించారు. సాధారణ శకం 1800(సిఇ) ప్రాంతంలో ఒక వైపు సంస్కరణవాదులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండగా, మరొక వైపు దొర స్వామ్యం’ జీతగాళ్ల పెళ్ళాల్ని బలవంతంగా అనుభవించడం జరుగుతూ వచ్చింది. ఆనాటి పరిస్థితులను వర్ణించే కథల్లో స్త్రీలను కించపరిచే జుగుప్సాకరమైన ఆజ్ఞలు ఉండేవని తెలుస్తూ ఉంది. అలాంటి ఆజ్ఞలు ఆ కాలంలో వినిపిస్తూనే ఉండేవి. నమ్మినబంట్లు చేసుకొస్తూనే ఉండేవారు.
అలాంటి సాంఘిక పరిస్థితుల్లో పార్లమెంటుకు ఓటు వేసే హక్కును, విశ్వవిద్యాలయాల్లో విద్యనార్జించే అర్హత స్త్రీకి ఊహించలేమని ఆనాటి మేధావులు కొందరు ఆవేదన వెలిబుచ్చారు. పందొమ్మిదో శతాబ్దంలో రామ్మోహన్రారు లాంటి సంఘ సంస్కర్తలు స్త్రీ జనోద్దరణకు పూనుకున్నారు. మహిళల స్థాయి పెంచడానికి, చట్టపరంగా వారికి కొన్ని హక్కులు సాధించి పెట్టడానికి, వారిని విజ్ఞావంతుల్ని చేయడానికి వారి కోసం ప్రత్యేకమైన పత్రికలు వెలువరించడానికి, వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో మంది పురుష సంఘసంస్కర్తలు కృషిచేశారు. కొంతకాలం తర్వాత విద్యావంతులైన మహిళలు దేశంలో తమ స్థితిగతుల్ని బేరీజు వేసుకుని తమ హక్కుల సాధనకు తామే నడుం బిగించారు. తమ సమస్యల్ని తామే గుర్తించుకుని, వాటికి పరిష్కారాలు తామే కనుగొనాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకున్నారు. ఫలితంగా 1904లో భారత మహిళాపరిషత్ ఏర్పాటైంది. ఇది 1887లో ప్రారంభమైన నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌కు ఒక శాఖగా రూపొందింది. బాలికల విద్యగురించి ఎక్కువ శ్రద్ధ చూపింది.
భారత మహిళా పరిషత్, ఇతర మహిళా సమస్యల గూర్చి కూడా తీవ్రంగా చర్చించింది. 1916లో ప్రొఫెసర్ డి.కె. కార్వే పూనాలో మొట్ట మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. దాదాపు అదే కాలంలో పండిత రమాబాయి ‘ద హై కాస్ట్ హిందూ వుమెన్’ (1888) ప్రకటించారు. స్వతహాగా సంస్కృత పండితురాలు కాబట్టి, వేదాల్ని చదివి, వాటి సారాంశాన్ని విశ్లేషించి చెప్పారు. పండిత రమాబాయి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ, తోటి మహిళల అభ్యున్నతికి తన జీవితం ధారపోశారు. చివరికి 1889లో శారదా సదన్ ప్రారంభించారు. వితంతువులకు వృత్తి విద్యలు నేర్పడం, పాఠశాలలు నిర్వహించడం, ఉపాధ్యాయులకు శిక్షణ నివ్వడం మొదలైన పనులన్నీ ‘శారదా సదన్’ సంస్థ ద్వారా నిర్వహించారు. ”బాల్యంలోనే వితంతువులైన వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే వారు, వారి జీవితాల్ని చక్కదిద్దు కోగలరు. మరొకరికి అండగా కూడా ఉండగలరు” అన్నది రమాబాయి ఉద్దేశం! 19వ శతాబ్దంలోనే మహిళలు పత్రికారంగంలో ప్రవేశించారు. ప్రత్యేకించి స్త్రీల పత్రికలు స్త్రీ – గొంతుకలకు వేదికలయ్యాయి.
1913లో భారతీయ సాహిత్యానికి నోబెల్ పురస్కారం సాధించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సోదరి స్వర్ణకుమారీదేవి దేశంలోనే తొలి సంపాదకురాలయ్యారు. ఆమె వెలువరించిన తొలి మహిళల పత్రిక ‘భారతి’ 1884లో వెలువడింది. దాని తర్వాత 1301లో ‘ఇండియన్ లేడీస్ మ్యాగజైన్’ నాటి మద్రాసు నుంచి వెలువడింది. శ్రీమతి కమలా సత్యానందన్ సంపాదకులుగా, మేనేజర్‌గా వ్యవహరించారు. అప్పటికే ఆమె యం.ఎ. పట్టభద్రురాలు. అసిస్టెంట్ ఎడిటర్‌గా కుమారి పి.సత్యానందన్ పనిచేశారు. ఆమె బి.ఎ. పట్టభద్రురాలు. ఈ పత్రిక 1918 వరకు క్రమం తప్పకుండా వెలువడింది. ఏవో కారణాల వల్ల, మధ్యలో కొన్ని సంవత్సరాలు ఆగి, 1927 నుండి పునర్దర్శనమిచ్చింది. పత్రికల వల్ల మధ్యతరగతి గృహిణుల్లో చాలా చైతన్యం వచ్చింది. స్త్రీవిద్య, వితంతు పునరావాసం వంటి వాటి ప్రాముఖ్యాన్ని గ్రహిస్తూ వచ్చారు. క్రమక్రమంగా క్లబ్బులు, సంస్థలు, ప్రారంభమ య్యాయి. వాటివల్ల మహిళలు తరచూ కలుసుకుని, చర్చించుకునే అవకాశం కలిగింది. దోరోతి జినారాజ దాస, మార్గరెట్ కజిన్స్, అనిబిసెంట్ మొదలైన వారు పూనుకుని ”ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్”ను నిర్వహించారు.
అసోసియేషన్‌కు ఒక పత్రిక ఉండడం చాలా అవసరమని గ్రహించి ‘శ్రీ ధర్మ’ పేరుతో పత్రిక ప్రచురించారు. ఈ పత్రిక మహిళల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. ఇందులో అన్నికులాల వారికి, మతాల వారికి సభ్యత్వం ఇచ్చారు. స్త్రీలకు ఓటుహక్కు- ఉండాల్సిన అవసరాన్ని స్త్రీ ధర్మ’ పత్రిక ద్వారా ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ నొక్కిచెప్పింది. ఇంకా ఈ అసోసియేషన్ తన ధ్యేయాల్ని ఈ విధంగా రూపొందించుకుని, ప్రచారం చేసుకుంది. 1. భారతమాతకు ప్రియమైన కూతుర్లం దరూ వారివారి బాధ్యతల్ని తెలుసుకోవాలి. 2. భార్యలుగా, తల్లులుగా బాధ్యతాయుతంగా నడుచుకుంటూనే కుటుంబ సభ్యులకు తగిన శిక్షణ ఇవ్వాలి. మరోవైపు భావిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దాలి. 3.పురుషులకు వలెనే స్త్రీలు కూడా ఓటు హక్కు సాధించుకోవాలి. గ్రామ పంచాయతీ స్థాయి నుండి పార్లమెంటు దాకా పోటీ చేయగల హక్కును సాధించుకోవాలి. 4. స్త్రీ విద్యకోసం ఎక్కువగా శ్రమిస్తూ, వివిధ మహిళా కమిటీలుగా ఏర్పడి, స్త్రీ జనాభ్యుదయానికి కావల్సిన ప్రణాళికలు రూపొందించుకుని, వాటికి కార్యరూపమివ్వాలి. మంచి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వారు కూడా ఈ ఆసోసియేషన్‌లో కార్యకర్తలై చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల త్వరితగతిన ప్రగతి సాధించగలిగారు.
(జనవరి 3 సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి)
(మిగతా భాగం వచ్చేవారం)
-సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
డాక్టర్ దేవరాజు మహారాజు



