Saturday, January 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅక్షర దీపం సావిత్రిబాయి పూలే

అక్షర దీపం సావిత్రిబాయి పూలే

- Advertisement -

విద్యనభ్యసించిన శూద్రుడి వంశమంతా ఏడు తరాలపాటు నరకానికి పోకతప్పదని బ్రాహ్మణ, మనువాదుల మతవిశ్వాసాలు బలవంతంగా రుద్దుతున్న కాలమది. నిరక్షరాస్యత,మూఢనమ్మకాలు అజ్ఞానం పట్టిపీడిస్తున్న అంధకార యుగమది. బ్రాహ్మణేతరులు చదువుకోవడం పాపంగా పరిగణించే కాలంలో, స్త్రీల జీవన విధానం దుర్భరంగా గడుస్తున్న సమయమది. స్త్రీలను కుటుంబాలకు చెందిన ఆస్తులుగా, భౌతిక, లైంగిక అవసరాలకు, ఆర్థిక ప్రయోజనాలకు ఒక యంత్రంగా మాత్రమే చూసే పరిస్థితులు. సామాజిక జీవనానికి స్త్రీకి ప్రాధాన్యత లేదు. బహుజన స్త్రీలకు మాత్రమే కాకుండా బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్యను నిషేధించిన పీష్వాల పాలన అంతమొందిన పద్దెనిమిదో శతాబ్దం. అల్ప సంఖ్యాక స్త్రీలు ముఖ్యంగా శూద్ర, అతి శూద్ర స్త్రీల జీవన స్థితిగతులను విద్యనేర్చుట ద్వారానే సాధ్యమని,స్త్రీ విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే.మన దేశపు చరిత్ర పుటల్లో పేరు సంపాదించుకునేలా వేసిన తొలి అడుగు ఆమె విద్య నేర్చుకోవడమే

1848 జనవరి1 మహారాష్ట్రలో పాఠశాల ప్రారంభమైంది. ఇది మనదేశంలో మొదటి బాలిక పాఠశాల. ఈ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా దేశంలోనే సావిత్రిబాయి చరిత్ర సృష్టించారు. మహర్షి కార్వే తొలి మహిళా విశ్వవిద్యాలయంకంటే ముందుగా బాలిక పాఠశాల నెలకొల్పిన ఘనత పూలే దంపతులకు దక్కింది. పూణేలోని పాఠశాల నెలకొల్పిన ప్రాంతంలో అగ్రవర్ణ వ్యక్తులు సావిత్రిపై అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండేవారు. తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడం బురదచల్లడం, రాళ్లతో కొట్టడం పేడనీళ్లు చల్లడం చేసేవారు. ఇంత దారుణాలు, అవహేళన చేస్తున్నా, ఓర్పు, సహనంతో బురదబట్టలతోనే పాఠశాలకు వెళ్లేవారు. తనతో పాటు అదనంగా తీసుకువచ్చిన జత దుస్తులను ధరించి, మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, బురద బట్టలను ధరించి రావడం అలవాటుగా మార్చుకున్నారు. బ్రాహ్మణ వర్గాల నుండి ఇలాంటి నిరసనలు, ఎన్నో ఎదురైనా సావిత్రిబాయి దంపతులు పాఠశాల నడపడం మాత్రం ఆపలేదు.

బాలికా విద్యపై, మొదట ఆసక్తిచూపని స్థితి నుండి, క్రమక్రమంగా బాలికా విద్య ఆవశ్యకతను ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రోత్సహించడం వలన ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇలా 1851లో మోరోవిఠల్‌, దియో రావుల సహకారంతో రెండవ బాలిక పాఠశాల స్థాపించారు. బాలిక విద్య కోసం కృషి చేస్తూనే 1852 మార్చి మూడవ తేదీన అస్పృశ్యుల కోసం బాలుర పాఠశాలల నెలకొల్పారు. ఈ పాఠశాల గురించి ”పూనే అబ్జర్వర్‌” అనే పత్రికలో ప్రచురణ అయ్యింది. సావిత్రిభాయి పీడిత ప్రజల ఆత్మాభిమానం స్వేచ్ఛాసమానత్వాలను మేల్కొల్పడానికి ఆమె కలం ద్వారా కూడా కృషిచేవారు. కవయిత్రిగా ”కావ్యపూలే” అనే గ్రంథం రాశారు. బాల్యవివాహాలు, అంటరానితనం, సతీ సహగమనం, శిరోముండనం లాంటి సాంఘిక దురాచారాల వల్ల, చాలామంది స్త్రీలు తీవ్ర వేదనకు గురయ్యేవారు. బాల్య వివాహాల వల్ల, వయస్సు మీరిన పురుషులు చనిపోయేవారు. దీంతో వితంతువులుగా మారిన స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. వీరిపై అనేక అఘాయిత్యాలు జరిగేవి. అలా గర్భందాల్చిన వితంతువులు నరకయాతన పడేవారు.

ఇలాంటి వారిని చేరదీసి ఒక ఆశ్రమం కల్పించారు సావిత్రి. దీనివల్ల అనేకమంది అచేతన పరిస్థితుల్లో ఉన్న వితంతువులు అకాలమరణం నుండి బయటపడ్డారు. వారందరిని తల్లిలా, చేరదీసి ఆదరించారు. వితంతువులకు శిరోముండనం చేసే కార్యక్రమం సాంఘిక దురాచారంగా ఉండేది. దీనికి వ్యతిరేకంగా శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యపరిచి, తిరుగుబాటు చేసేలా 1860లో సమ్మె నిర్వహించారు. మహిళల్లో చైతన్య నింపేందుకు అంటరానితనం నిర్మూలన, స్త్రీల సమస్యల పరిష్కారం కోసం 1852వ సంవత్సరంలో జనవరి 14న ”తిలగుండు సమారోహ్‌” అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఒకరికొకరు సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుకోవడమనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఏర్పాటుచేసిన సమావేశంలో వేలాదిమంది స్త్రీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్ల స్త్రీలల్లో సామాజిక చైతన్యం కలిగింది. బ్రాహ్మణ, ఆర్యుల మత సమాజ వ్యాప్తికి ప్రత్యామ్నాయంగా, శూద్రులు,అతి శూద్రుల కోసం సత్యం అనే ధర్మాన్ని కేంద్రంగా చేసుకొని ”సత్యశోధక్‌ సమాజ్‌” అనే సంస్థను జ్యోతిబాపూలే ప్రారంభించారు.

ఈ సంస్థ మహిళా విభాగానికి సావిత్రిబాయి నాయకత్వం వహించేవారు. పురోహితులు లేకుండా శుభకార్యాలు చేయడం, పునర్వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలను ఈ సంస్థ ద్వారా చేపట్టేది. ఈ కార్యక్ర మాలకు బ్రాహ్మణ హిందూ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండాఅల్పసంఖ్యాక వర్గాల్లో చైతన్యం ద్వారా వారి అభ్యున్నతికి నిరంతరం సావిత్రి పాటుపడ్డారు.1890లో భర్త జ్యోతిబాపూలే మరణించిన సందర్భంలో, ఆస్తి కోసం సోదరుని వరుసయ్యే వ్యక్తి అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రయత్నించగా, దత్తపుత్రుడు యశ్వంత్‌ వారిని అడ్డుకున్న సందర్భంలో, తన భర్త చితికి తానే నిప్పుపెట్టి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు సావిత్రి. భర్త చనిపోయిన భార్య వితంతువుగా శిరోముండనం, గాజులు మట్టెలు తీసేవేసే ఆచారానికి స్వస్తి పలికి తానే ఒక ఉదాహరణగా నిలిచారు. భర్త మరణం తరువాత సత్యశోధక సమాజ్‌ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తూ, 1893లో సాస్వార్డ్‌ అనే ప్రాంతంలో ఒక సభను నిర్వహించారు. అంతేగాక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించారు.

1876లో మహారాష్ట్రలో భయంకరమైన కరువు ఏర్పడిన సందర్భంలో ఆహారం లేక లక్షలాదిమంది మరణించారు. కరువు నుండి గట్టెక్కించేలా ప్రభుత్వానికి టెలిగ్రామ్‌, ఉత్తరాల ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంలో సావిత్రిబాయి తోడ్పాటు మరువలేనిది. 52 అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఒక మహాయజ్ఞం కంటే గొప్ప కార్యక్రమంగా భావించేవారు. కరువు నుండి మహారాష్ట్ర తేరుకొకముందే 1896లో పూణేలో ఫ్లేగువ్యాధి వ్యాపించింది. రోజుకు వేల సంఖ్యలో మరణించేవారు. ఈ వ్యాధిగ్రస్తుల కోసం స్వయంగా సావిత్రిబాయి మిషనరీలను ఏర్పాటు చేసి ఎంతో సేవచేశారు. దత్తపుత్రుడు యశ్వంతు ద్వారా కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తూ నిర్విరామంగా చేసిన సేవా కార్యక్రమాలు చేశారు. యశ్వంత్‌ డాక్టరు కావడం సేవా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేది. నిరంతర సేవా కార్యక్రమాల వల్ల చివరికి ఆమెకు ప్లేగు వ్యాధి ప్రబలింది. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించి, చివరికి 1897 మార్చి 10న సావిత్రిబాయి చనిపోయారు. ప్రేమ, అంకితభావం, మానవత్వంతో ప్రజల హృదయాలను గెలిచారు. అణగారిన దళితుల స్త్రీల అభ్యున్నతికై జీవితాంతం సేవలందించిన కరుణామయి సావిత్రిబాయిపూలే నేటిమహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం.
(నేడు సావిత్రిబాయి పూలే జయంతి)

గాదె వెంకన్న
9948409093

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -