సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం : సీఐటీయూ
అఖిల భారత మహాసభలో తీర్మానం
అనంతల వట్టం ఆనందన్ నగర్(విశాఖ పట్నం ఏయూ కన్వేన్షన్ హాల్) నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్న
గాజా, పాలస్తీనాలో జరుగుతున్న మారణహౌమానికి వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల వీరోచిత పోరాటానికి మద్దతుగా కార్మిక వర్గం నిలబడాలంటూ సీఐ టీయూ 18వ అఖిల భారత మహాసభ పిలుపు నిచ్చింది. ఈ మేరకు రెండోరోజు గురువారం కొనసా గుతున్న ఆ మహాసభలో సీఐటీయూ నాయకురాలు మర్సికుట్టియమ్మ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అనంతరం మహారాష్ట్ర సీఐటీయూ నేత బలపర్చారు. మహాసభ ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు.
అమెరికా సామ్రాజ్యవాద అండదండలతో ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా ప్రజలపై, ముఖ్యంగా గాజాలో సాగిస్తున్న మారణహౌమ యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. విముక్తి, న్యాయం, స్వతంత్ర పాలస్తీనా దేశం కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటానికి తన దృఢమైన మద్దతును పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, శాశ్వత కాల్పుల విరమణ అమలు కాలేదు. ”మానవతా విరామాలు” అనే పేరుతో ఇజ్రాయెల్ తన సైనికశక్తిని పెంచుకోవడానికి సమయాన్ని వాడుకుంటూ, బాంబు దాడులు, బలవంతపు తరలింపులను కొనసాగిస్తోంది. 2025 మధ్య నాటికి 67వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు, వీరిలో మెజారిటీ మహిళలు, పిల్లలే. మొత్తం 1,79,000 మందికి పైగా మరణించడం లేదా గాయపడటం జరిగింది. గాజాలోని 70 శాతం ఇండ్లు, ఆస్పత్రులు, పాఠశా లలు ధ్వంసమయ్యాయి. ఆహారం, మందులు అందకుండా చేయడం అంతర్జా తీయ చట్టాల ఉల్లంఘన, మానవత్వానికి వ్యతిరేకమైన నేరం’.అని తెలిపారు.
ఈ మహాసభ ఇజ్రాయెల్ అక్రమ దిగ్బంధనాన్ని, ”గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా” వంటి మానవతా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఖండిస్తోందని తెలి పారు. నీరు, ఆహారాన్ని ఆయుధా లుగా వాడుతూ ప్రజలను చంపడం ఇజ్రాయెల్ క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు.
ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్టుగా, ఇజ్రాయెల్ ఆక్రమణ ఒక ”మారణ హౌమ ఆర్థిక వ్యవస్థగా” మారిందని తెలిపారు. గాజా ఒక ప్రయోగశాలగా మారిందనీ, అక్కడ కొత్త ఆయుధాలు, నిఘా సాంకేతికతలను పరీక్షించి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంటున్నారని ఈ మహాసభ గమనిస్తోందని పేర్కొన్నారు. భారతీయ కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇజ్రాయెల్‌తో సైనిక, సాంకేతిక సహకారం అందించడం పట్ల ఈ మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు. పాలస్తీనాకు చారిత్రాత్మకంగా భారత్ ఇస్తూ వస్తున్న మద్దతు నుండి ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తగ్గడాన్ని ఖండిస్తుందని తెలిపారు. తక్షణమే, నిబద్ధతతో కూడిన శాశ్వత కాల్పుల విరమణ జరగాలని మహాసభ డిమాండ్ చేసింది. గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలనీ, 1967 సరిహద్దుల ప్రకారం, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలనీ, ఇజ్రాయెల్‌తో ఉన్న అన్ని సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను భారత ప్రభుత్వం రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేక నినాదాలతో మహాసభ హాల్ దద్దరిల్లిపోయింది.
పాలస్తీనా ప్రజల వీరోచిత పోరాటానికి సంఘీభావం ప్రకటిద్దాం
- Advertisement -
- Advertisement -



