Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతరంగంమీరే ఆధ్యులు

మీరే ఆధ్యులు

- Advertisement -

ఏ విషయాన్నైనా పిల్లలు త్వరగా గ్రహిస్తారు. ఇక వాళ్లు నేర్చుకునే ప్రతి విషయానికీ ఆద్యులు తల్లిదండ్రులే. అది ప్రవర్తనైనా, అలవాటైనా.. పేరెంట్స్‌ ఎలా చేస్తే అలా ఫాలో అయిపోతుంటారు. ఇలా పిల్లలు నేర్చుకున్న విషయాలు వాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే తల్లిదండ్రులు తమ అలవాట్లు, ప్రవర్తన, నడవడిక.. వంటివన్నీ చక్కగా ఉండేలా జాగ్రత్తపడాలి.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవించాల్సిన రోజులొచ్చాయి. అలాగని ఈ ఒత్తిడికి కారణమైన అంశాల్నే తలచుకుంటూ కూర్చుంటే మానసిక ప్రశాంతత కోల్పోతారు. అందుకే ఒత్తిడిని జయించే మార్గల్ని అన్వేషిస్తున్నారు చాలామంది. అందుకోసం వ్యాయామాలు చేయడం, నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం.. ఇలా ఎవరి అభిరుచులకు తగినట్టుగా వాళ్లు ఆయా అలవాట్లను పాటిస్తుంటారు. నిజానికి ఇవి మిమ్మల్ని పాజిటివిటీ వైపు నడిపించడమే కాదు, మీ పిల్లల్నీ ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మీరు పాటించే రొటీన్‌ని పిల్లలు గమనిస్తుంటారు. దాంతో మానసిక సమస్యల్ని ఎలా అధిగమించాలో వాళ్లకు అర్థమవుతుంది. ఇదే వాళ్లను మానసికంగా దృఢం చేస్తుంది.

ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేసుకోలేక చాలా మంది మహిళలు సతమతమవుతుంటారు. ఈ ఒత్తిడితో కుటుంబ సభ్యులు, పిల్లలకూ తగిన సమయం కేటాయించలేకపోతారు. ఇది వారి చిన్న మనసులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా రాత్రి భోజనం అందరూ కలిసి చేయడం, వారాంతాల్లో పిల్లల్ని తీసుకొని సరదాగా బయటికి వెళ్లడం, పిల్లలకు సెలవులొచ్చినప్పుడు వెకేషన్‌కి ప్లాన్‌ చేసుకోవడం వంటివి చేస్తే ఇటు పెద్దలు రిలాక్స్‌ అవడంతో పాటు అటు పిల్లలూ సంతోషపడతారు. అంతే కాదు మన వాళ్ల కోసం తగిన సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో పిల్లలు కూడా తెలుసుకుంటారు. దీంతో బంధాల విలువేంటో వారికి అర్థమవుతుంది.

ఇంట్లో అన్ని పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఆఫీస్‌లోనూ ‘గుడ్‌ జాబ్‌’ అంటూ మన్ననలందుకుంటారు. కానీ తమ కోసం కాస్త సమయం కేటాయించుకోలేపోతారు. దీనివల్ల ఒకానొక సమయంలో జీవితంపై అసహనం ఏర్పడుతుంది. ఇలా పెద్దల హడావుడిని దగ్గర్నుంచి గమనించిన పిల్లల మనసుపైనా ఈ ప్రభావం పడుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా తమ కోసం ప్రత్యేకంగా కాస్త సమయం కేటాయించుకోవాలి. అందం, ఆరోగ్యం, అభిరుచులపై దృష్టి పెట్టాలి. ఎవరైతే వీటిని పాటిస్తారో వాళ్ల పిల్లలూ వీటిని గమనిస్తూ స్వీయ ప్రేమ ప్రాధాన్యం అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాదు భవిష్యత్తులో తమ ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూనే మంచి అలవాట్లను కొనసాగించడానికి మొగ్గు చూపుతారు.

ఇంట్లో భార్యాభర్తలిద్దరూ మెలిగే విధానం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఇద్దరూ తరచూ గొడవలు పడడం చేస్తే పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అదే ప్రేమగా మాట్లాడుకోవడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్ధగా వినడం, సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం వంటివి మిమ్మల్ని మరింత ప్రేమగా దగ్గరయ్యేలా చేస్తాయి. ఇలా మీరు హ్యాపీగా ఉంటే పిల్లలూ సంతోషంగా ఉంటారు. ఏ సమస్యైనా తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. తల్లిదండ్రులను చూసి గౌరవ మర్యాదలు, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి విషయాలు నేర్చుకుంటారు. ఇవి వారి భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -