Thursday, January 8, 2026
E-PAPER
Homeకథకోడలు VS అత్త

కోడలు VS అత్త

- Advertisement -

”అత్తగార్ని వద్ధాశ్రమం నుండి తీసుకొచ్చేద్దామండీ..!”
ఈ ముక్క భార్య నోట అనూహ్యంగా రావడంతో ఉలిక్కిపడి, వేడి కాఫీ తాగుతున్న సూర్యం నోరు కాల్చుకున్నాడు. కాఫీ గ్లాసు టేబుల్‌ మీద పెట్టి ఒక్కసారిగా బాల్కనీలోకి పరుగు తీసి బయట అటూ, యిటూ నిశితంగా పరిశీలించి తిరిగి లోపలికి వచ్చాడు.
”ఏంటండీ..? నేను చెప్పినదానికి సమాధానం యివ్వకుండా, అలా బాల్కనీ వైపు పరిగెత్తారేంటీ?” కాసింత అసహనంగా అంది జగదీశ్వరి.
”నీ మాటలకి విస్తుపోయి సూర్యుడు ఎటు పొద్దుపొడిచాడోనని బయటకెళ్ళి చూసివస్తున్నా. అంతా సహజంగానే వుందే, కానీ నీ ఈ అసహజ ప్రవర్తన ఏంటి జగదా?” భార్య పై సెటైర్‌ వేసాడు సూర్యం.
”చాల్లేండి మీ వేళాకోళం. ఏం? నేనేం తప్పు మాట్లాడాను? అత్తగారిని మన దగ్గరికి తీసుకొచ్చేద్దామన్నా. అయినా నా నిర్ణయానికి మీరు ఎగిరి గెంతేస్తారని అనుకుంటే, ఇదేంటి?”
”అదికాదు జగదా.. అప్పుడు అమ్మని వద్ధాశ్రమానికి పంపింది నువ్వే. మళ్ళీ యిప్పుడు తీసుకొద్దామంటున్నావ్‌, దేనికి? ఆవిడ అక్కడ ప్రశాంతంగా వుండటం చూడలేక నీకు కళ్ళు కుట్టాయా?” అంటూ భార్యకి చురక అంటిస్తూనే, ఆమెలో ఈ హఠాత్తు మార్పుకు కారణమేమిటని ఆలోచించాడు.
”అవునండీ..అప్పుడు పంపిందీ నేనే.. యిప్పుడు తీసుకొద్దామంటున్నదీ నేనే. ఏం? అత్తగారు మనతో ఉండటం మీకిష్టం లేదా.. చెప్పండి?”
భార్య మాటలు పట్టించుకోకుండా ఆరునెలల క్రితం జరిగిన ముఖ్యమైన సంఘటన గుర్తుచేసుకున్నాడు సూర్యం.

”యిక అత్తగారిని భరించడం మన వల్లకాదండి. ఆవిడ తిండి ఖర్చూ, తీర్ధయాత్రల ఖర్చూ.. అడపాదడపా ఆరోగ్య సమస్యలకయ్యే మందుల ఖర్చులు మనం భరించలేం. మీ సంపాదనేదో మనకీ, మన పిల్లల చదువులకే సరిపోడంలేదు. మామగారు మిగిల్చిపోయిందేం లేదు. ఆయన తదనంతరం అత్తగారికొస్తున్న ఆ నాలుగైదువేల పెన్షన్‌ ఏ మూలకి సరిపోదు” సూర్యంతో అంది జగదీశ్వరి.
ఈ చర్చ మొదటిసారిగా జగదీశ్వరి- సూర్యం మధ్య జరగలేదు. గత కొన్ని నెలలుగా ఆమె యిదే విషయాన్ని ప్రస్తావించడం, సూర్యం కాదన్న మూలంగా ఇద్దరి మధ్యా ఘర్షణ జరగడం మామూలైపోయింది. చూస్తుంటే యిక ఆమెని ఆపడం కష్టమని గ్రహించాడు. అయినా ఊరుకోలేక భార్యతో పెద్ద గొడవే పెట్టుకున్నాడు. ఇద్దరి వాదోప వాదనలు వారి బెడ్‌ రూమ్ని దాటి హాల్లో వున్న సూర్యం తల్లి శాంతమ్మ చెవిని పడకపోలేదు. నేరుగా కాకపోయినా తన వెనక యిద్దరూ తన విషయంలో గొడవపడుతుండటం ఆమె ఇన్నాళ్ళూ గమనిస్తునేవుంది. ఈరోజు అది కాస్త శతి మించిందని గ్రహించింది.
కోడలి తత్వం ఎప్పుడో అర్ధం చేసుకున్న శాంతమ్మ, తమ యిద్దరి మధ్యా కొడుకు నలిగిపోతున్నాడని గ్రహించి ఇంట్లో అశాంతికి ముగింపు పలకకపోతే, ఆ ప్రభావం పిల్లలమీద పడుతుందని ఓ నిర్ణయానికి వచ్చింది.
ఆ మర్నాడు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ సమయంలో అంతా కూర్చుని టిఫిన్‌ చేస్తుండగా శాంతమ్మ కొడుకు నుద్దేశించి-
”సూర్యా..! నాకు కొన్నాళ్ళు ఏదైనా ఆశ్రమంలో వుండే వద్ధులకి సేవచెయ్యాలని వుందిరా” అంటూ కొడుకు వైపు చూసింది. ఈ మాటలు అక్కడే వున్న జగదీశ్వరి ఆసక్తిగా వింటోంది.
”ఏంటీ..? ఎప్పుడూ ఏ గుడిలో భగవంతుని సేవకో లేకా మన దగ్గర బంధువర్గంలో చేయూతకో వెళ్ళడం నీకు అలవాటు. ఈ సారి వద్ధులకి సేవ చెయ్యాలనుందా? సరే.. ఎన్ని రోజులూ? ఓ వారం పదిరోజులేగా వెళ్ళు..” అన్నాడు సూర్యం తల్లితో.
”వారంమో పదిరోజులో కాదురా.. కొన్నాళ్ళపాటూ ఏ వద్ధాశ్రమంలోనో వారితో పాటే వుండి నాకు సత్తువున్నంత కాలం వారికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను” జీరబోయిన గొంతుతో అంది శాంతమ్మ.
ఈ మాటకి సూర్యం ఉలిక్కి పడితే, అటు ఒక్కసారిగా జగదీశ్వరి మొహంలో దాచుకోలేని ఆనందం ప్రస్పుటించింది.
అమ్మగానీ నిన్న రాత్రి గొడవని మనసులో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందా? కోడలితోనో, తనతోనో చెప్పించుకోకముందే తన మర్యాద కాపాడుకునేందుకు వెళతానంటోందా? తల్లికి ఎలా సర్దిచెప్పాలో తెలియక మనసులోనే సంఘర్షణని ఎదుర్కొన్నాడు సూర్యం.
”అమ్మా! మా మధ్య నిన్న జరిగిన ఘర్షణ మూలంగా నువ్వీ నిర్ణయం తీసుకుంటే, వెంటనే విరమించుకో. ప్రతి కుటుంబంలో యిలాంటి గొడవలు మామూలే. అవేం మనసులో పెట్టుకోకుండా, నీ మానాన నువ్వుండు” అన్నాడు తల్లితో సూర్యం.
”అత్తగారు స్వయంగా సేవచేసుకుందుకు వెళ్తానంటుంటే వద్దంటారేం? కొన్నాళ్ళేగా..? వెళ్ళమనండి” ముందు అత్తగారు యింటినుండి కదిలితే అదే పదివేలన్నట్టు మాటవరసకైనా ఆపకుండా నిర్మొహమాటంగా అంది జగదీశ్వరి.
”అవున్రా యిప్పుడైతే నా ఒంట్లో అంతో యింతో శక్తి వుంది. నేను యింకా పెద్దదాన్నైతే వేరొకరికి సేవచేసే శక్తి నాకు ఎక్కడుంటుంది? కాదనకు” అంది శాంతమ్మ.
కొన్నాళ్ళు తన తల్లి దూరంగా వుంటే జగదీశ్వరిలో మార్పు రావొచ్చేమో? అప్పుడు అమ్మకి నచ్చ చెప్పి మళ్ళీ తీసుకురావొచ్చు. అలా చేస్తే యిటు భార్య కోరికా తీరుతుంది, అటు తల్లికి పుణ్యంతోపాటూ ప్రశాంతతా దక్కుతుంది. అందుకే మనసు అంగీకరించకపోయినా కష్టం మీద ”సరే.. నీ యిష్టం” అన్నాడు సూర్యం.
తనకోరిక యింత తేలిగ్గా గోలా, ఘోషా లేకుండా యింత తొందరగా నెరవేరుతుందని కలలో కూడా ఊహించని జగదీశ్వరి మనసులోనే ఉబ్బితబిబ్బైంది.
ఆ తరువాత తానెంచుకున్న ఓ వద్ధాశ్రమంలో శాంతమ్మ చేరిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోయింది. శాంతమ్మ వెళ్ళిపోతుంటే మనవడూ-మనవరాలు ఏడుస్తూ ఆపే ప్రయత్నం చేసారు. ఆ దశ్యాన్ని చూసి సూర్యం బలవంతాన్న వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నాడు. పిల్లల బంధం కన్నా వారి భవిష్యత్తు ముఖ్యం కనుక ఆమె ధడనిర్ణయంతో ముందుకు కదిలింది.
తన భార్య మూలంగా తల్లి వెళ్ళిపోయిందన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి సూర్యంకి చాలా రోజులే పట్టింది. భార్య చేసిన పనికి ఆమెతో చాలా రోజులు మౌనపోరాటం చేసి చివరికి ఓడిపోయాడు.

”ఏమండీ! నే చెప్పింది విన్నారా? అత్తగారిని ఉన్నపాళంగా యిక్కడికి తీసుకొచ్చేయండి” అని రెట్టించి అన్న భార్య మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు సూర్యం.
”ఏంటీ?.. మనం రమ్మనగానే అమ్మ వస్తుందా? నాకు నమ్మకంలేదు. వద్ధాశ్రమానికి వెళ్ళడం వధాశ్రమే అవుతుంది”
”కాదండీ.. అత్తగారు వెళ్ళి చాలా రోజులైంది. పిల్లలు కూడా రమ్మంటున్నారని చెప్పండి, ఆమె రాకపోరు”
ఉ..! సెంటిమెంటుని తన అవసరానికి వాడుకోవడం తన భార్యకి తెలిసినట్టు మరెవరికీ తెలీకపోవచ్చు. కానీ ఏమూలో తల్లి రాకని కోరుకుంటుంది సూర్యం మనసు కూడా. అందుకే కాదనలేకపోయాడు.
”సరే.. చూద్దాం!” అన్నాడు సూర్యం.
భర్త ఒప్పుకునే సరికి జగదీశ్వరి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమెకి తెలుసు తన భర్త పిలిస్తే అత్తగారు కాదనరని. అత్తగారిపై కలిగిన ఆకస్మిక ప్రేమకి మూల కారణం గుర్తుకురావడంతో అనుకోకుండా వారం వెనక్కి వెళ్ళింది జగదీశ్వరి.
ఆ రోజు ఉదయం పిల్లలకి, భర్తకి కేరేజీలు కట్టి తమ విధులకి పంపింది. ఎన్నో రోజులుగా పిల్లలుంటున్న రూమ్‌ని శుభ్రం చెయ్యాలని అనుకుంటున్నా కుదరక యిక లాభంలేదని ఆరోజు ఎలాగైనా కప్‌బోర్డ్స్‌తో సహా మొత్తం దులిపి నీట్‌గా చెయ్యాలని నిశ్చయించుకుంది.
రూమ్‌ లోకి అడుగుపెడుతూ చుట్టూ కలియచూసింది జగదీశ్వరి. చాలా పెద్దదైన ఆ రూమ్‌ మొత్తం పరిశీలిస్తూ ఆమె ఆలోచిస్తోంది. నిజానికి ఆ రూమ్‌ అంతకు ముందు తన అత్తా- మామల బెడ్‌ రూమ్‌. మామగారు పోయాకా అత్తగారు వుండేవారు. ఆ రూమ్‌లో రెండు కప్‌ బోర్డులూ, ఓ బీరువా వున్నాయి. ఆ బీరువా మామగారిది. ఆయన పోయాకా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదు. కప్‌బోర్డ్‌ తెరచి ఒకొక్క వస్తువు తీసి దులిపి సర్దుతుండగా అరలో ఓ మూలకి కొంచెం పెద్దదైన తాళం చెవి జగదీశ్వరి కంట్లో పడింది. ఎందుకో ఆ తాళం చెవి ఆ బీరువాదేమో అన్న అనుమానం రావడంతో వెంటనే ఆమెలో ఒక్కసారిగా దాన్ని తెరవాలన్న ఉత్సుకత మొదలైంది. కాస్త మొరాయించినా ఆ తాళం చెవితో బీరువా తెరుచుకుంది. తలుపులు తీసి చూస్తే దాన్నిండా మామగారి బట్టలు, కొన్ని ఫైల్స్‌! ఆయన సాధించిన మెమొంటోలు వున్నాయి. ఎలాగో బీరువా తెరిచింది కదా అని అందులో వస్తువుల్ని బయటకి తీసి దులిపి శుభ్రం చేయదలచి ఒక్కొక్క వస్తువూ బయట పడేసింది. ఖాళీ అయిన బీరువాలో ఓ షెల్ఫ్‌ కవర్‌ పక్కకి జరిగి దాని క్రింద ఏదో కనబడేసరికి జగదీశ్వరి భకిటి ముడిపడింది.
”జగదా.. ఏంటి ఆలోచనలో పడ్డావ్‌..? రేపే అమ్మని కలుస్తాను. మంచి పనికి ఆలస్యం దేనికి? ఏమంటావు?” భార్య చెయ్యి పట్టుకుని కదుపుతూ అన్నాడు సూర్యం.
భర్త తన చెయ్యి పట్టుకుని మరీ కదిపి మాట్లాడేసరికి జగదీశ్వరి ఆలోచనలకి అడ్డుకట్టపడ్డాయి.
”ఆ.. ఆ.. శుభస్య శీఘ్రం..” అంది భర్త మాటలకి ఉత్సాహంతో వంత పాడుతూ.

శాంతమ్మ రావడంతో యింట్లో పండగ వాతావరణం నెలకొంది. మనవడూ, మనవరాలు ఆమె చెంత చేరి ఒక్క నిమిషం వదలకుండా కబుర్లతో సందడి చేసారు. జగదీశ్వరి కలుపుగోలుగా మాట్లాడుతూ అత్తగారి సలహాలు తీసుకుంటూ రకరకాల పిండివంటలతో హడావిడి చేసింది.
ఆ రోజు సాయంత్రం తల్లితో పాటు మొత్తం సూర్యం కుటుంబం గుడికి వెళ్ళారు. గుడిలో దేవుడికి సూర్యం దండం పెట్టుకుంటూ, ‘తండ్రీ.. నా భార్య ఏదో బలమైన కారణం లేకుండా నా తల్లిని తిరిగి ఆదరించదని నాకు తెలుసు. కానీ ఆమెకి సద్బుద్ధిని ప్రసాదించి ఆమెలో మార్పుకలిగించు స్వామీ!’ అని మనసులో కోరుకున్నాడు. దర్శనానంతరం పిల్లలు ఆలయ ప్రాంగణంలో యిటు అటు పరుగెడుతుంటే వారిని ఆపేందుకు శాంతమ్మ ఉత్సాహంతో వడివడిగా నడుస్తూ పట్టుకోవలనే ప్రయత్నం చేస్తోంది. పిల్లల్ని ఆడిస్తూ శాంతమ్మా ఆనందంగా గడపటం సూర్యం చూస్తూ తనూ ఆనందించాడు.
ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రకుపక్రమిస్తూ మామ్మ చెరోవేపు చేరి ఎన్నో కథలూ, కబుర్లు చెప్పించుకున్నారు.
యిటు సూర్యం- జగదీశ్వరీ తమ గదిలో చేరి సేదతీరారు. సూర్యం ఆలోచనలు భార్య అనుహ్య నిర్ణయానకి కారణం వెతుకుతోంది. అప్పుడు అందుకుంది జగదీశ్వరి-
”ఏవండీ.. మీతో ఓ విషయం మాట్లాడాలి! యిప్పుడు నేను చెప్పబోయేది తెలుసుకుని మీరు ఎగిరి గెంతేస్తారు. ఒక విధంగా మనకి మంచిరోజులు వచ్చేయనుకోండి. కాకపోతే.. అందుకు అత్తగారి సహకారం కావాలి!” అంది జగదీశ్వరి మెల్లగా అసలు విషయంలోకొస్తూ.
”ఊ.. నేనప్పుడే అనుకున్నాను, ఏ లాభంలేకపోతే నువ్వు మా అమ్మని రానీయవని, అందులో నీకు నీవుగా. అయితే యిప్పుడు మా అమ్మ మూలంగా మనకొచ్చే లాభమేంటో?”
”అదీ.. ఏంటంటే.. మనకెవ్వరికి తెలియని ఓ ముఖ్యమైన విషయం మొన్ననే నాకు తెలిసింది” అంటూ ఆరోజు పిల్లల రూమ్‌ క్లీన్‌ చేస్తుండగా మామగారి బీరువాలో వెలుగు చూసిన రహస్యం చెప్పుకొచ్చింది జగదీశ్వరి.

జగదీశ్వరి కుతూహలం కొద్ది ఆ షెల్ఫ్‌ కవర్‌ కింద కనబడ్డ ఓ పెద్ద ప్లాస్టిక్‌ కవర్‌ తీసి అందులో కాగితాలని పరిశీలనగా చూసింది. అది ఎల్‌ఐసి బాండ్‌! పాతిక లక్షల రూపాయలకి మామగారి పేరుమీద తీసుకున్న పాలసి! చేతిలోని బాండ్‌తో జగదీశ్వరి తీవ్రంగా ఆలోచింస్తుంది. దాని మేట్యూరిటి డేట్‌ చూసింది. రెండు సంవత్సరాల క్రితమే గడువు పూర్తి అయింది. చూస్తే అది ఒరిజినల్‌ బాండ్‌! అంటే క్లైమ్‌ చేయలేదు. చూస్తుంటే ఈ బాండ్‌ విషయం మామగారు ఎప్పుడూ తన భార్యకీ, యిటు కొడుకుకి చెప్పకుండానే కాలం చేసినట్టు వుంది. మామగారు పోతేపోయారు, యిప్పుడు ఆయన ఏకైక వారసుడిగా తన భర్తకి ఈ మొత్తం పైకం దక్కనుంది. ఆ తలంపుతో బాండ్‌ పట్టుకున్న ఆమె చేయి కొంచెం వణికింది. ఒక్కసారిగా ఆమె మనసు ఆనందంతో తాండవంచేసింది. ఇంత డబ్బు అనూహ్యంగా వున్నట్టుండి దక్కబోయే సరికి ఆమె నోటమాటరాలేదు. ఒక్కసారిగా ఆమెలో కోరికల గుర్రాలు కదం తొక్కాయి. తాను చూస్తున్నది నిజమో కాదో అని మళ్ళీ ఆ బాండ్‌ని నిశితంగా పరిశీలించింది. అప్పుడు అందులో కనబడిన చిన్న మెలిక చూసి వులిక్కి పడింది. అందులో నామినిగా అత్తగారి పేరు రాసుంది. అంతే కాదు ఆమె పుట్టిన తేదీ, ఆధార్‌ కార్‌ నెంబర్‌ తో సహా మొత్తం వివరాలు సుస్పష్టంగా భవిష్యత్తులో క్లైమ్‌ చేసుకుందికి ఎటువంటి అడ్డంకులూ లేకుండా రాసున్నాయి. దాంతో తన మామగారు ఏం తక్కువైనవాడు కాదనుకుంది. డబ్బు మొత్తం తన భార్యకి మాత్రమే దక్కేటట్టు జాగ్రత్తలు తీసుకుని మరీ పోయాడని మనసులోనే విసుక్కుంది. అంతలోనే డబ్బు నేరుగా తన భర్తకి దొరక్కపోతేనేం, అత్తగారికైతే దక్కుతుందిగా. కాకపోతే తాను తాత్కాలికంగా రాజీ పడితే అత్తగారి నుండి ఆ డబ్బు తన వశం కాకపోదు. వెంటనే ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది.

”ఏవండీ.. నే చెప్పింది విన్నారా? త్వరలోనే మనింట ఆ మహాలక్ష్మీ అడుగిడబోతోంది. కాకపోతే అత్తగారు సహకరిస్తే చాలు. అందుకు మీరే మిగతా కథ నడిపించాలి”
భార్య చెప్పింది విని సూర్యం ముక్కున వేలేసుకున్నాడు. తన తండ్రి ముందు జాగ్రత్తగా ఎలాంటి కోడలు వస్తుందోనని ఊహించి తన తల్లికి భవిష్యత్తులో ఆర్ధిక యిబ్బందులు తలెత్తకుండా ఎంత మంచి పని చేసాడూ? తండ్రి అనుమానించినట్టే నీచంగా ఆలోచించే జగదీశ్వరిలాంటి కోడలు తమ యింట అడుగుపెట్టింది.
”నీ మాటని జవదాటలేకే కదా అమ్మని వద్ధాశ్రమానికి పంపింది. యిప్పడు మాత్రం నీ మాట కాదనగలనా?” అన్నాడు సూర్యం ఏం జరిగితే అదే జరుగుతుందనే నిశ్చయానికొచ్చి.
”ఆ..ఈ విషయం యిప్పుడే అత్తగారికి చెప్పకండి. మనం రేపే ఎల్‌ఐసి ఆఫీస్‌కి వెళ్ళి అన్ని ఫార్మాల్టీస్‌ ఎలా పూర్తి చెయ్యాలో ముందుగా వివరాలు తెలుసుకుని అప్పుడు అత్తగారికి ఈ విషయం చెబ్దాం” —
మర్నాడే సూర్యం-జగదీశ్వరీ ఎల్‌ఐస్‌ ఆఫీసుకి వెళ్ళి బ్రాంచ్‌ మేనేజర్ని కలసి తమ వద్దనున్న బాండ్‌ చూపించి క్లైమ్‌ చెయ్యాలనుకుంటున్నామని చెప్పారు.
సూర్యం వద్దనున్న బాండ్‌ తీసుకుని పరిశీలించి, కంప్యూటర్లో డీటైల్స్‌ కోసం చెక్‌ చేసాడు.
”సూర్యంగారూ! యిక్కడ చూపిస్తున్న డీటైల్స్‌ ప్రకారం, ఈ బాండ్‌ ఎప్పుడో మీ నాన్నగారే స్వయాన క్లైమ్‌ చేసారు” అన్నాడు మేనేజర్‌ ట్విస్ట్‌ యిస్తూ. ఈ సమాధానంకి జగదీశ్వరికి మతిపోయింది.
”అదేంటి సార్‌? మా నాన్నగారు క్లైమ్‌ చేస్తే ఒరిజనల్‌ బాండ్‌ యింకా మా దగ్గరే ఎలా వుంటుంది. సరిగ్గా చూడండి” అన్నాడు సూర్యం.
”ఊ.. కరక్టే.. కానీ ఇక్కడున్న డీటైల్స్‌ ప్రకారం మీ నాన్నగారు ఒరిజినల్‌ బాండ్‌ మిస్‌ ప్లేస్‌ అయిందంటు లీగల్‌ అఫిడవిట్‌ ఫైల్‌ చేసారు. బాండ్‌ పోతే మా రూల్స్‌ ప్రకారం పాటించవలసిన అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తిచేయడంతో ఆయన క్లైమ్‌ ప్రోసెస్‌ చేసి సెటిల్‌ చేసాం. బహూశా అప్పుడు పోయిన ఆ బాండ్‌ యిప్పుడు మీకు దొరికినట్టుంది”
”అయితే ఆ మనీ ఏ ఎకౌంట్‌ కి ట్రాన్స్‌ఫÛర్‌ చేసారో కాస్త చెప్తారా” అడిగాడు సూర్యం మేనేజర్ని. డీటైల్స్‌ చెక్‌ చేసి ఏ అకౌంట్లో జమైందో చెప్పాడు మేనేజర్‌.
మేనేజర్‌ చెప్పింది విని జగదీశ్వరికి మతిపోతే, సూర్యం అయోమయంలో పడ్డాడు.

”అమ్మా..! ఈ బాండ్‌ విషయం నీకేమైనా తెలుసా?” ఎల్‌ఐసి ఆఫీస్‌ నుండి తిన్నగా యింటికి వస్తూ సూటిగా అడిగాడు తల్లిని సూర్యం, భార్య ప్రోద్బలంతో.
”ఏ బాండ్రా?” అంటూ ప్రశ్నించింది ఆశ్చర్యంగా శాంతమ్మ. సూర్యం చేతిలో వున్న బాండ్‌ తీసి చూపించాడు.
ఒక్క నిమషం ఆ బాండ్‌ ని పరిశీలించిన శాంతమ్మ ”ఓ..ఈ బాండా.. నీకెక్కడ దొరికిందిరా యిప్పుడు? మీ నాన్న బ్రతికున్నరోజుల్లో ఓ వారం రోజులు బహూశా దీనికోసమేనేమో, ఏమిటి వెతుకుతున్నారో చెప్పకుండా యిల్లూ వాకిలి వెతికారు. యిప్పుడు నీకెలా దొరికింది?” సమాధానమిచ్చింది శాంతమ్మ.
”అదీ.. గత వారం నేను మీ రూమ్‌ క్లీన్‌ చేస్తుండగా దొరికింది. అంటే మీకు ఈ బాండ్‌ గురించి ఎప్పుడో తెలుసన్నమాట” మధ్యలో కలగచేసుకుని నిలదీసినట్టే ప్రశ్నించింది జగదీశ్వరి. కోడలు యిలా ప్రశ్నించేసరికి అవాక్కైయింది శాంతమ్మ. బాగా ఆలోచిస్తే బంధాలూ, ఆప్యాయతల ఆసరాతో డబ్బుకోసం తనని యిప్పుడు రప్పించడానికి కోడలు వేసిన ఎత్తుగా అర్థచేసుకుంది.
”నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేకున్నా చెబుతున్నా, నేనాశ్రమంలో వుండగా గత నెలే ఈ బాండ్‌ విషయం తెలిసింది. అంతవరకు ఈ విషయం నాకూ తెలీదు” అంది నెలక్రితం జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ శాంతమ్మ.

”శాంతమ్మ గారూ.. నేను స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్ని మాట్లాడుతునా. మీరొక సారి మా బ్రాంచికొస్తే మీతో కొంచెం మాట్లాడాలి” అంటూ ఫోన్‌ పెట్టేసాడు. ఎందుకోసమో అనుకుని బ్యాంక్‌కి వెళ్ళిన శాంతమ్మతో మేనేజర్‌ యిలా అన్నాడు.
”మీ ఆయన నాకు బాగా పరిచయం. అతడు బ్రతికున్న రోజుల్లో తన తదనంతరం తన భార్యకి ఆర్ధికంగా ఏలోటూ రాకుండా వుండాలని మీ యిద్దరి పేరా జాయింట్‌ ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి తన ఎల్‌ఐసి మెట్యూరిటీ అమౌంట్‌ పాతిక లక్షలు ఈ అకౌంట్లో చాలా రోజుల క్రితమే జమచేసారు. అంత మొత్తం ఎక్కువ రోజులు వుంటే మీకు వడ్డీ నష్టమే కాక, రేపొద్దున్న టాక్స్‌ ప్రోబ్లమ్స్‌ కూడా వస్తాయి. మీ భర్త ఆశయం ప్రకారం ఈ పెద్ద మొత్తాన్ని వేరే మా బ్యాంక్‌ స్కీమ్స్‌లో పెడితే మీ డబ్బుకి పన్ను మినహాయింపే కాక అధిక వడ్డీ వస్తుంది” అంటూ అసలు విషయం చెప్పాడు.
ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. చాలా రోజుల క్రితం తన భర్త ఓ బ్యాంక్‌ అప్లికేషన్‌ మీద తన సంతకాలు, యితర వివరాలు తీసుకున్నది ఈ జాయింట్‌ ఎకౌంట్‌ ఓపినింగ్‌ కోసమేనని యిప్పుడర్ధమైంది. తన భర్త ముందు చూపుకి మనసులోనే జోహార్లు అర్పించింది.

మర్నాడు ఉదయం శాంతమ్మ తన బ్యాగ్‌ సర్దుకుంటుంటే, పిల్లలు ‘మామ్మా! అప్పుడే వెళ్ళిపోతున్నావా?’ అంటూ ఆపే ప్రయత్నం చేయబోయారు. వారికి మళ్ళీ వస్తానంటూ సర్ది చెప్పింది.
బ్యాగ్‌ సర్దుకుని హాల్లో కొచ్చిన శాంతమ్మ- ”సూర్యం! ఓ ఆటో రిక్షా తీసుకురారా” అంది వెళ్తున్నాననే మాట చెప్పకనే చెబుతూ. అత్తగార్ని ఎలా ఆపాలో తెలీలేదు జగదీశ్వరికి. తన భార్య చేసిన పనికి సిగ్గు పడుతూ సూర్యం, తల్లిని ఆపే ధైర్యం చేయలేదు. అప్పుడు మాట్లాడింది శాంతమ్మ-
”జగదీశ్వరీ! డబ్బు కోసం ప్రేమ నటించి నన్ను రప్పించే ప్రయత్నం మరెప్పుడూ చెయ్యొద్దు. నా డబ్బుతో, నువ్వూ, నీ పిల్లలు సుఖంగా వుండొచ్చని ఆలోచించావే కానీ, ఒక్క అడుగు ముందుకేసి, నీ భర్తని కన్నతల్లి కూడా నీ కుటుంబంలో భాగమే అని ఆలోచిస్తే ఎంత బాగుండేది? డబ్బుకి మాత్రం విలువిచ్చే చోట బంధాలు నిలబడవు. యిరుకు మనసుల మధ్య నేను యిమడలేను. నిజానికి సూర్యానికే మొత్తం డబ్బు యిచ్చేద్దామని నిన్నటిదాకా అనుకున్నాను. కానీ నీచమైన నీ బుద్థితో నా మనసు విరిచేసావు. నీ అసలు రంగు చూసాకా యిప్పటికిప్పుడు నేనో నిర్ణయానికి వచ్చాను. నాలా పిల్లల నిరాదరణకి గురై వీధినపడిన అనేక మంది వయసుమళ్ళిన వారి సంరక్షణకి నా ధనం మొత్తం అంకితం! అంటూ ముందుకి కదిలింది శాంతమ్మ.

కారంపూడి వెంకట రామదాస్‌, 9393232939

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -