డీజీపీ ఎదుట దేవా సహా 20 మంది మావోయిస్టుల లొంగుబాటు
మిగిలింది రాష్ట్రానికి చెందిన 17 మందే : రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టులకు వెన్నెముక అయిన పీపుల్స్ లిబరేషన్ ఘెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) పని పరిసమాప్తమైందనీ, త్వరలోనే మిగిలినవారిని కూడా కట్టడి చేస్తామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు 56 మంది కాకుండా కేవలం 17 మంది మాత్రమే మిగిలారని లొంగిపోయిన మావోయిస్టులను బట్టి తేలిందన్నారు. కగార్ ఆపరేషన్ దశలో 46 అతిపెద్ద ఆయుధాలతో 20 మంది మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోవడం గొప్ప విజయమని ఆయన ప్రకటించారు. శనివారం డీజీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులతో పాటు వారి వెంట తీసుకొచ్చిన ఆయుధాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండెంట్ బడ్సే సూఖా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్‌తో పాటు రాష్ట్ర కమిటీకి చెందిన కె. రాజిరెడ్డి, ఆయన భార్య ఈశ్వరీతో పాటు 17 మంది పీఎల్‌జీఏ సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు.
హిడ్మాకు అతి సన్నిహితుడు దేవా
ఇటీవలనే ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు అతి సన్నిహితుడైన దేవా పీఎల్‌జీఏ బెటాలియన్ రూపకల్పన ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఆపరేషన్ నిర్వహణలో సిద్ధహస్తులని డీజీపీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని హిడ్మా గ్రామానికి చెందిన దేవా… 2002లో మావోయిస్టుల్లో చేరి దండకారణ్యంలో పీఎల్‌జీఏ బెటాలియన్ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నాడని ఆయన వివరించారు. రాజిరెడ్డి రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారనీ, ఆయన భార్య ఈశ్వరీ ఈ కమిటీ సభ్యురాలిగా ఉన్నారని తెలిపారు. మిగతా 17 మంది సైతం పీఎల్‌జీఏలో వివిధ స్థాయిలలో కొనసాగుతున్నారని అన్నారు.
దేవాపై రూ.70 లక్షల రివార్డు ఉన్నదనీ, మిగతా లొంగిపోయిన వారందరి పై కలిపి రూ. 1,81,90,000 నగదు రివార్డు ఉన్నదని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. వీరి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడా స్వాధీనం కాని రీతిలో రెండు ఎల్‌ఎంజీలు, 8 ఏకే 47లు, పది ఎస్‌ఎల్‌ఆర్‌లు, 11 ఇన్సాస్‌లు, ఒక అమెరికన్ బోల్టో ఆయుధం, మరో ఇజ్రాయిల్ ఆయుధం, హెలికాప్టర్లను కూల్చివేసే ఆయుధం కలిపి మొత్తం 46 ఆయుధాలను ఈ మావోయిస్టులు స్వాధీనపరిచారని తెలిపారు. ఈ ఆయుధాలకు సంబంధించిన మందుగుండు సామగ్రి, బుల్లెట్లను, భారీ ఎత్తున స్వాధీనపర్చుకున్నామని ఆయన వివరించారు. మావోయిస్టు పీఎల్‌జీఏలో దాదాపు 400కు పైగా సుశిక్షితులైన కమాండెంట్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 60 మంది మాత్రమే మిగిలారనీ, వీరు కూడా సమయం మించకముందే లొంగిపోతే వారి ప్రాణాలకు ముప్పు ఉండదని ఆయన చెప్పారు.
మావోయిస్టులకు వెన్నెముక వంటి పీఎల్‌జీఏల కథ సమాప్తమైందని డీజీపీ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు 56 మంది ఉన్నారని అనుకున్నామనీ, అయితే లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇచ్చిన సమాచారాన్ని బట్టి కేవలం 17 మందే మిగిలారని లెక్క తేలుతున్నదని అన్నారు. మిగతావారు ఆయా సమయాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించి ఉండొచ్చని ఆ నేతలు భావిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం లొంగిపోయిన వారు కూడా అనారోగ్యం, పార్టీలో లుకలుకలు, సిద్ధాంతా విభేదాలు, పెరిగిన పోలీసు సాయుధబలగాల పట్టుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు కారణంగా లొంగిపోతున్నట్టు తెలిపారని ఆయన వివరించారు. ప్రస్తుతం లొంగిపోయినవారు ఒక్కొక్కరికి తక్షణ పరిహారంగా రూ.25 వేల చెక్కులను అందజేస్తున్నామనీ, ప్రభుత్వపరంగా ఇతర సహాయ, సహకారాలు కూడా వారి జీవనోపాధికి అందజేస్తామని డీజీపీ తెలిపారు.
సాయుధ పోరాటం చేయలేకే లొంగిపోయాం : రాజిరెడ్డి
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యమాన్ని నిర్మించుకోలేకపోవడం, మరోవైపు పోలీసు బలగాలకు దీటుగా సాయుధ పోరాటాన్ని నిర్వహించలేకపోవడం కారణంగా తాము లొంగిపోతున్నామని మావోయిస్టు నాయకుడు రాజిరెడ్డి చెప్పారు. అదే సమయంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా తాము లొంగిపోవడానికి కారణమైందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అదనపు డీజీ మహేశ్‌భగవత్, ఎస్‌ఐబీ ఐజీ సుమతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.



