– ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది : మావోయిస్టులకు డీజీపీ పిలుపు
– మోతెలో జరిగింది ఎదురు కాల్పులే :జితేందర్ స్పష్టీకరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదనీ, ఆ బాటను వీడి మావోయిస్టులు లొంగిపోవాలనీ, వారికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలం మోతె గ్రామం వద్ద జరిగింది పూర్తిగా ఎదురుకాల్పుల ఘటనేనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసి, సమస్యలను పరిష్కరించుకునే హక్కు దేశంలో అన్ని వర్గాలకూ ఉన్నదనీ, మావోయిస్టులు సైతం ప్రజాస్వామ్య పంథాను ఎన్నుకొని ప్రజలకు అవసరమైన సేవలను చేయొచ్చని ఆయన హితవు పలికారు. మోతె గ్రామం వద్ద ఉదయం కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్న సాయుధ పోలీసులకు మావోయిస్టులు తారసపడగా ఒక్కసారిగా ఎదురు కాల్పుల ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన మావోయిస్టు దళ సభ్యులు మరణించారనీ, మరో ఇద్దరు సాయుధ పోలీసులకు తీవ్రంగా బుల్లెట్ గాయాలు తగిలాయని డీజీపీ చెప్పారు. మరణించిన మావోయిస్టులు ఎవరన్నది గుర్తించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే-47 ఆయుధాలు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక పిస్టల్, ఒక 303 రైఫిల్, లైవ్ బుల్లెట్‌లు, వాకీటాకీ హ్యాండ్‌సెట్స్ గల కిట్‌బ్యాగ్‌లు లభించాయని ఆయన తెలిపారు. గత కొంత కాలంగా కర్కగూడెం మండలంలోని మోతె ప్రాంతంలో ఈ దళం కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు లేని అజ్ఞాత ఉద్యమ పంథా నుంచి మావోయిస్టులు వెలుపలికి వస్తే.. వారికి తగిన ప్రోత్సాహాన్నిచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించటానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందనీ, అందుకు తగిన స్కీంలను ఇప్పటికే అమలు చేస్తున్నదని డీజీపీ తెలిపారు.దెబ్బ మీద దెబ్బ పడటంతో మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. తాజాగా ఆరుగురు మావోయిస్టులు మరణించగా, ఇటీవలనే సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత జగన్ అలియాస్ రణదేవ్ బాబాతో సహా తొమ్మిది మంది మావోయిస్టులో మృతి చెందారు.