Wednesday, January 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్క్రమం తప్పకుండా...?

క్రమం తప్పకుండా…?

- Advertisement -

నేటి జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది మహిళలు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వల్ల బరువు పెరగడం, సంతాన లేమి, రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు చుట్టుముడతాయి. అందుకే దీన్నుంచి విముక్తి పొందేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం… ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. అయితే ఈ సమస్యకు ‘సీడ్‌ సైక్లింగ్‌’ ప్రక్రియ కూడా పరిష్కారం చూపుతుందని స్త్రీ వైద్య నిపుణులు అంటున్నారు. దీన్ని పాటించడం వల్ల ఈ సమస్య ఒక్కటే కాదు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని అంటున్నారు. మరి అసలు సీడ్‌ సైక్లింగ్‌ అంటే ఏమిటో, దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం…

నెలసరి క్రమంగా రాకపోవడానికి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఓ కారణం. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్ల స్థాయిలు తగ్గినప్పుడు పిరియడ్స్‌ క్రమం తప్పుతాయి. అందుకే ఈ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి నెలసరి క్రమంగా వచ్చేలా చేయడంలో నువ్వులు, అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రుతుచక్రాన్ని బట్టి వీటిని రెండు దశలుగా తీసుకోవడమే ‘సీడ్‌ సైక్లింగ్‌’ అంటారు.

రెండు దశల్లో…
రుతుచక్రం అందరిలో ఒకేలా ఉండదు. కొందరికి 28 రోజులకు పిరియడ్స్‌ వస్తే, మరికొందరికి 35 రోజులకు వస్తుంటుంది. ఇలాంటి ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య పరిష్కారానికి ఈ నాలుగు రకాల గింజల్ని రెండు దశలుగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మొదటి దశను ఫాలిక్యులర్‌ అంటారు. నెలసరి ప్రారంభమైన రోజు మొదలు అండం విడుదలయ్యే రోజు వరకు అంటే పద్నాలుగు లేదా పదహారవ రోజు వరకు ఈ దశగా పరిగణిస్తారు. ఈ సమయంలో రోజూ టేబుల్‌స్పూను చొప్పున అవిసె, గుమ్మడి గింజల్ని కలిపి తీసుకోవాలి. రెండవది ల్యుటీల్‌ దశ. అండం విడుదలయ్యే రోజు మొదలు తిరిగి నెలసరి ప్రారంభమయ్యే రోజు వరకు అంటే 15వ రోజు నుండి 28 లేదా 30వ రోజు వరకు ఈ దశగా పిలుస్తారు. ఈ రోజుల్లో రోజూ టేబుల్‌ స్పూను చొప్పున పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు కలిపి తీసుకోవాలి.

రెండు టేబుల్‌ స్పూన్లు
28 రోజులకు రుతుచక్రం ఉన్న వారు పై విధంగా దశల్ని విభజించుకొని గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ నెలసరి ఎప్పుడొస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని వారు మాత్రం ప్రతి రెండు వారాలకోసారి ఈ సీడ్‌ మిశ్రమాన్ని మార్చాల్సి ఉంటుంది. అంటే మొదటి రెండు వారాల్ని ఫాలిక్యులర్‌ దశగా భావించి రోజూ టేబుల్‌స్పూను అవిసె, గుమ్మడి గింజల్ని తీసుకోవడం, తదుపరి రెండు వారాల్ని ల్యుటీన్‌ దశగా పరిగణిస్తూ టేబుల్‌స్పూను చొప్పున పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

హార్మోన్ల క్రమబద్ధీకరణకు
ఈ గింజల్ని నేరుగానైనా తినొచ్చు. లేదంటే కూరల్లో వేసుకోవడం, సలాడ్స్‌పై చల్లుకోవడం, పండ్ల రసాల్లో భాగం చేసుకోవడం.. ఇలా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈ సీడ్‌ సైక్లింగ్‌ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లోని విటమిన్లు, ఖనిజాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. దీనివల్ల ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ స్థాయిలు బ్యాలన్స్‌ అవుతాయి. నెలసరి సక్రమంగా రావాలంటే ఈ సమతుల్యతే కావాలంటున్నారు నిపుణులు. కాబట్టి సీడ్‌ సైక్లింగ్‌ హార్మోన్ల సమతుల్యతను కాపాడి క్రమం తప్పిన రుతుచక్రాన్ని సరిచేస్తుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.

అదుపులో ఉంచుకోవచ్చు
జీవక్రియల పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపడంలోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. టెస్టోస్టిరాన్‌, ఆండ్రోజెన్‌… వంటి హార్మోన్ల అసమతుల్యత పీసీఓఎస్‌కు దారితీస్తుంది. అయితే సీడ్‌ సైక్లింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ హార్మోన్లూ బ్యాలన్స్‌ అవుతాయంటున్నారు. ఫలితంగా పీసీఓఎస్‌నూ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా అవాంఛిత రోమాలు, అధిక బరువు వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చం టున్నారు. సీడ్‌ సైక్లిం గ్‌ ద్వారా శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టి రాన్‌ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయిలూ బ్యాలన్స్‌ అవుతాయి. దీనివల్ల సహజంగా గర్భం ధరించే అవకాశాలు మెరుగుపడతాయి.

మెనోపాజ్‌ సమస్యలకు…
సీడ్‌ సైక్లింగ్‌ ప్రక్రియ మెనోపాజ్‌ వల్ల ఏర్పడే సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఇది ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయిల్ని క్రమబద్ధీకరించి ఈ సమయంలో వేధించే వేడి ఆవిర్లు, మూడ్‌స్వింగ్స్‌, చర్మం పొడిబారడం వంటి సమస్యలను నివారించడంలో సహకరిస్తుంది. ఈ నాలుగు రకాల గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒమేగా 3,6 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు, జింక్‌, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. ఫలితంగా శారీరక శక్తి పెరుగుతుంది. అలాగే పలు చర్మ సమస్యలకూ చెక్‌ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఇది అందరికీ ప్రయోజనాలను చేకూర్చకపోవచ్చు. అయితే పాటించే ముందు ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చెకప్‌ చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -