జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో వింత పరిస్థితి
గ్రేటర్ నోయిడా : జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఆదివారం నుంచి గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్దా యూనివర్శిటీలో ఆరంభం కావాల్సి ఉండగా.. బాక్సింగ్ రింగ్‌లు సిద్ధంగా లేకపోవటంతో బౌట్స్ వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జాతీయ చాంపియన్‌షిప్స్ తొలి రోజు పురుషుల విభాగంలో 42, మహిళల విభాగంలో 38 బౌట్లు నిర్వహించాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు బౌట్లు ఆరంభం కావాలి. బౌట్స్ కోసం బాక్సర్లు వేదిక వద్దకు చేరుకోగా.. అక్కడ ఎటువంటి బాక్సింగ్ రింగ్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో బాక్సర్లు, కోచ్‌లు అయోమయానికి గురయ్యారు. సుమారు నాలుగు గంటల ఆలస్యం తర్వాత బాక్సింగ్ రింగ్‌లు సిద్ధం చేయగా.. సాయంత్రం 6.30 నుంచి బౌట్స్ నిర్వహించారు. నాలుగు గంటల ఆలస్యం, రెండు బాక్సింగ్ రింగ్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మహిళల విభాగంలో బౌట్స్‌ను ఓ రోజు వాయిదా వేసినట్టు సమాచారం.
బిఎఫ్‌ఐ అలసత్వం : గతంలో ఇదే వేదికపై జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ నిర్వహించగా.. అప్పుడు వర్షాల కారణంగా ఆలస్యంగా పోటీలు ఆరంభం అయ్యాయి. ఇప్పుడు ఎటువంటి వాతావరణ ప్రతికూలతలు లేకపోయినా.. పూర్తి నిర్లక్షం కారణంగా పోటీలు ఆలస్యం అయ్యాయి. బాక్సింగ్ రింగ్‌లు సిద్ధం చేయకపోవటంతో పది వెయిట్ విభాగాల్లో పోటీపడుతున్న సుమారు 600 మంది బాక్సర్లు అయోమయంలో పడ్డారు. వెయిట్ విభాగంలో పోటీపడే బాక్సర్లు కఠిన ఆహార నియమాలు పాటిస్తారు. దీంతో సహజంగానే ఎటువంటి ఆహారం తీసుకోకుండా బౌట్స్‌కు వస్తారు. బౌట్స్ ఆలస్యం కావటంతో బాక్సర్లకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈ విషయంపై భారత బాక్సింగ్ సమాఖ్య స్పందించాల్సి ఉంది.
బాక్సింగ్ రింగ్‌లు లేక బౌట్స్ వాయిదా
- Advertisement -
- Advertisement -



