మా మ్యాచ్‌లు శ్రీలంకలో పెట్టాలి
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై బంగ్లాదేశ్
ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంఛైజీ, బీసీసీఐ తొలగించటంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఘాటుగా స్పందించింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ చేసిన సూచనలపై ఇప్పటికే ఇంటా, బయటా తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించబోదని, శ్రీలంకలో అయితే ఆడేందుకు సిద్ధమని బీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం, ఆదివారం రెండు దఫాలుగా సమావేశమైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్లు.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 17 మంది డైరెక్టర్లు హాజరైన సమావేశంలో భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని ఐసీసీకి లేఖ రాసేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బీసీబీ నిర్ణయాన్ని ఆ దేశ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ సమర్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశాడు.
ఐసీసీకి లేఖ
ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ ఆడితే భద్రతా ఏర్పాట్లు చేయలేని స్థితిలో బీసీసీఐ ఉంది. ఒక్క ఆటగాడి భద్రతకు భరోసా ఇవ్వలేని తరుణంలో.. బంగ్లాదేశ్ జట్టు మొత్తం ఏ విధంగా ప్రపంచకప్ ఆడుతుంది. క్రికెటర్లు, పాత్రికేయులు, సహాయక సిబ్బంది, అధికారులతో పాటు అభిమానులకు భద్రత కల్పించలేని చోట మా జట్టు మైదానంలో అడుగుపెట్టదనే అంశాన్ని ఐసీసీకి రాసిన లేఖలో బీసీబీ పొందిపరిచినట్టు సమాచారం. ‘భారత్‌లో పర్యటించే బంగ్లాదేశ్ జట్టు, బృందం భద్రతపై నెలకొన్న అనుమానాలు, పెరుగుతున్న ఆందోళనలను సమగ్ర పరిశీలనతో అంచనా వేసి.. బంగ్లాదేశ్ ప్రభుత్వం సలహాను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించదు’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌కు ఆవల (శ్రీలంక) నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీబీ కోరింది. అతివాద మతపరమైన విధానాలతో భారత క్రికెట్ బోర్డు ముందుకెళ్తున్న వేళ.. ఆ దేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ ఆడబోదని బీసీసీఐ అధికారి ఒకరు తేల్చిచెప్పారు. అయితే, ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ సైతం భారత్‌లో ఆడలేమని సరికొత్త సమస్యకు తెరతీసింది. దీంతో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను పూర్తిగా మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అది టోర్నమెంట్ నిర్వహణ, టికెట్ల కొనుగోలు వంటి అంశాలను గందరగోళంలో పడేయటం ఖాయం.
ఎందుకు తప్పించారు?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ సూచనలతో కెకెఆర్ యాజమాన్యం తప్పించిన సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఏ కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పించారో లిఖితపూర్వకంగా తెలియజేయాలని బీసీసీఐకి బీసీబీ లేఖ రాసింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉంచాలని కోరిన బీసీసీఐ… వేలంలో అతడు రూ.9.2 కోట్లు దక్కించుకున్న తర్వాత ఎందుకు తప్పించిందో తెలియాలని లేఖలో రాసింది. ఐసీసీకి రాసిన లేఖలో భద్రత కారణాలను పేర్కొన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు… బీసీసీఐకి రాసిన లేఖలో ఆ కారణాలను పేర్కొనలేదు.
భారత్‌లో ఆడలేం
- Advertisement -
- Advertisement -



