వెనిజులా అధ్యక్షురాలిగా రోడ్రిగుయెజ్
అమెరికా చర్యను తప్పుపడుతున్న ప్రపంచ దేశాలు
ఖండించని మోడీ సర్కార్…నేడు భద్రతామండలి సమావేశం
క్యూబా, మెక్సికో, కొలంబియాకు ట్రంప్ బెదిరింపులు
న్యూయార్క్ కోర్టులో తన అరెస్టుపై మదురో పిటిషన్
వాషింగ్టన్/కారకాస్ : కారకాస్‌లో అమెరికా దళాలు నిర్బంధించిన వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్తుతం న్యూయార్క్ జైలులో ఉన్నారు. ఆయనను అమెరికా ప్రభుత్వం జైలు వంటి డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న (నాక్రో-టెర్రరిజం) ఆరోపణపై అక్కడ మదురోను విచారిస్తారు. మదురో దంపతులను సోమవారం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తారని తెలుస్తోంది. మదురో అమెరికా నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో వెనిజులా ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగుయెజ్‌ను తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిందిగా వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిపాలనను కొనసాగించడానికి, దేశ రక్షణను కాపాడడానికి రోడ్రిగుయెజ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. మదురోను తక్షణమే విడుదల చేయాలని రోడ్రిగుయెజ్ అమెరికాను డిమాండ్ చేశారు.
అమెరికా దళాల అధీనంలో ఉన్నప్పటికీ ఆయనే దేశానికి అధ్యక్షుడని స్పష్టం చేశారు. మదురో దంపతులు సజీవంగానే ఉన్నారనడానికి ఆధారాలు చూపాలని పట్టుప ట్టారు. మరోవైపు వెనిజులాను ప్రస్తుతానికి తామే పరిపాలిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తదుపరి లక్ష్యం క్యూబా, మెక్సికో, కొలంబియా కావచ్చునని ఆయన చెప్పారు. వెనిజులా ప్రతిపక్షాలపై కూడా ట్రంప్ మండిపడ్డారు. కాగా అమెరికా దాడిలో కారకాస్‌కు తూర్పున ఉన్న హగ్యురోట్‌లోని విమానాశ్రయం దెబ్బతింది. కాలిపోయిన యంత్రాలు, దెబ్బతిన్న విమానం, భవనంతో పాటు నేలపై కొన్ని శిథిలాలు కన్పిస్తున్నాయి. దాడి కారణంగా రాజధానిలో అనేక వాహనాలు పూర్తిగా తగలబడి పోయాయి. జనా వాసాలపై కూడా అమెరికా సైన్యం దాడి చేసిందని వెనిజులా ఆరోపించింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పై దాడి జరిగిందని, అందులో 40 మంది ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.
హ్యాపీ న్యూ ఇయర్ : అధికారులతో మదురో
అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధికారులు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను తీసుకొని ఏజెన్సీ కేంద్ర కార్యాలయంలోకి వెళుతున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చేతికి సంకెళ్లతో ఉన్న 63 సంవత్సరాల మదురో నల్లని హుడ్ ఉన్న స్వెట్‌షర్ట్ ధరించి ‘డీఈఏ ఎన్‌వైడీ’ అని రాసి ఉన్న నీలి రంగు తివాచీ పరచిన కారిడార్‌లో నడుస్తూ కన్పించారు. ఆయన ఆ గదిలో అధికారులకు శుభరాత్రి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పడం విన్పించింది. మదురోను ముందుగా సైనిక స్థావరానికి తీసికొని వెళ్లి ఆ తర్వాత న్యూయార్క్ నగరానికి తరలించారు. అక్కడి నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు చేర్చారు. అది ఓ జైలు లాంటిది. కాగా మదురో కుమారుడు నికొలస్ ఎర్నెస్టో మదురో గెయెర్రాపై కూడా అమెరికా ఆరోపణలు మోపింది.
ఎగతాళి చేస్తూ వీడియో
అరెస్టుకు కొన్ని నెలల ముందు మదురో విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. తనను గురించి సమాచారాన్ని అందజేసిన వారికి రివార్డును పెంచుతానంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై మదురో గత ఆగస్టులో స్పందిస్తూ ‘వచ్చి నన్ను పట్టుకోండి. నేను ఇక్కడ మిరాఫ్లోర్స్‌లో ఎదురు చూస్తుంటాను. పిరికివాడా…ఆలస్యం చేయవద్దు’ అని సవాలు విసిరారు. అమెరికా అధ్యక్ష భవనం ఆదివారం నాడు మదురోను ఎగతాళి చేస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ వీడియో పెట్టింది. అందులో అమెరికాను మదురో హెచ్చరిస్తున్న దృశ్యాలు, వెనిజులాపై జరిగిన దాడి దృశ్యాలను ఉంచింది. 61 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్‌లో ట్రంప్ ప్రెస్ బ్రీఫింగ్ దృశ్యాలు కూడా ఉన్నాయి.
తక్షణమే విడుదల చేయండి : ప్రపంచ దేశాల డిమాండ్
యుద్ధాలను ప్రారంభించబోనని, వాటిని ఆపుతానని గప్పాలు కొట్టిన ట్రంప్ తాజాగా వెనిజులాపై దురాక్ర మణ జరిపి దేశాధ్యక్షుడిని నిర్బం ధించడాన్ని అనేక దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. మదురో అక్రమ నిర్బంధంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నికొలస్ మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని చైనా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. కారకాస్‌పై జరిగిన దాడిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. ఇది వెనిజులా సార్వభౌ మాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందని మండిపడింది.
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా అమెరికా దాడులను నిరసించారు. దాడులపై పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మదురో నిర్బంధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని తెలిపారు. మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదురో పట్ల సానుకూలన లేని బ్రిటన్ కూడా అమెరికా చర్యను స్వాగతించ లేదు. కాగా ట్రంప్ చర్యను లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. ఈ చర్య గందరగోళానికి, హింసకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యను అమెరికా ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. అమెరికాలోని పలు నగరాలలో కూడా ట్రంప్ చర్యపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఖండించని భారత్
వెనిజులా పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మదురో నిర్బంధాన్ని ఖండించకపోవడం గమనార్హం. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతి, సుస్థిరత సాధించాలని సంబంధిత పక్షాలను కోరింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను సంప్రదిస్తోందని, వారికి అవసరమైన సాయం అందిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరపు ప్రయాణాలు మానుకోవాలని భారతీయు లకు సూచించింది.
మదురోపై అమెరికా అభియోగాలు
వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి ఫ్లోర్స్‌పై మోపిన కుట్ర అభియోగాలను అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఏకరువు పెట్టారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో డబ్బు సంపాదించి దాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు అందజే స్తున్నారని, కొకైన్‌ను దిగుమతి చేసుకున్నారని, మెషిన్‌గన్స్‌ను -విధ్వంసక పరికరాలను కలిగి ఉన్నారని, అమెరికాకు వ్యతిరే కంగా వాటిని సముపార్జించుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. అమెరికా న్యాయస్థానాలలో, అమెరికా భూభాగంపై మదురో, ఆయన భార్య విచారణను ఎదుర్కొంటారని చెప్పారు. కాగా అమెరికా, దాని పౌరులపై మదురో ప్రాణాంతక నార్కో-టెర్రరిజం ప్రచారాన్ని చేపట్టారని ట్రంప్ విమర్శించారు. మదురోను ‘చట్టవిరుద్ధమైన నియంత’గా అభివర్ణించారు. లొంగిపోవాల్సిందిగా దాడులకు ఓ వారం రోజుల ముందు మదురోకు చెప్పానని అన్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ మదురో గతంలోనే తోసిపుచ్చారు.
ట్రంప్ ఉగ్రదాడి
మదురో పట్టుబడిన కొన్ని గంటల తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోని చమురు మౌలిక సదుపాయాలను సరి దిద్దడానికి, ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో చమురును విక్రయించడానికి నాయకత్వ శూన్యతను ఉపయోగించుకోవాలనే తన ప్రణాళికలను ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయ మిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనిజులా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో డ్రగ్స్‌పేరుతో అమాయకులను హత్యలు చేసిన అమెరికా అధ్యక్షుడి ఉగ్రరూపం తేటతెల్లమైందని వెనిజులా ప్రజల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నేడు భద్రతామండలి సమావేశం
కొలంబియా నుంచి అత్యవసర అభ్యర్థన మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం ఉదయం వెనిజులాలో అమెరికా కార్యకలాపాలపై సమావేశం నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నది. ఇంకా బహిరంగపరచని పలు అంశాల గురించి సమావేశంలో చర్చించనున్నట్టు కౌన్సిల్ దౌత్యవేత్త తెలిపారు. అమెరికా చర్యలు ప్రమాదకరమైన ఉదాహరణను చూపుతున్నాయని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.
న్యూయార్క్ కోర్టుకు మదురో
మదురో, అతని భార్యను అమెరికా దళాలు అపహరించి న్యూయార్క్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆయన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై న్యూయార్క్ కోర్టులో హాజరు కానున్నారు.
అమెరికాలో నిరసనలు
అమెరికాలో అతిపెద్ద వెనిజులా సమాజానికి నిలయమైన ఫ్లోరిడాలోని డోరల్..లాస్ ఏంజిలిస్‌లోని ప్రజలు వెనిజులా జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.స్వేచ్ఛ..స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు. బాంబులు వద్దు అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలతో హౌరెత్తించారు.
అది యుద్ధ చర్యే : మమ్దానీ
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆదివారం దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించారు. మదురో నిర్బంధాన్ని ఆయన ఖండించారు. సార్వ భౌమత్వ దేశంపై ఏకపక్షంగా జరిపిన దాడిని యుద్ధచర్యగా అభివర్ణించారు. అధ్యక్షుడికి తన వ్యతిరేకతను తెలియ జేశానని ఆయన ఆ తర్వాత చెప్పారు. లాటిన్ అమెరికా దేశంలో అమె రికా జోక్యాన్ని ఆయన నిరసించారు. వెనిజులా పై జరిపిన దాడి అమెరికా, అంతర్జాతీయ చట్టాల ను ఉల్లంఘి స్తోందని చెప్పారు. ‘అధికార మార్పిడి కోసం చేసిన ఈ ప్రయత్నం విదేశాలలో ఉన్న వారిని మాత్రమే ప్రభావితం చేయదు. అది న్యూయార్క్ వాసులపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ నగరంలో వేలాదిమంది వెనిజులా ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు నా దృష్టి వారి భద్రత పైన, న్యూయార్క్ ప్రజల భద్రతపైన ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మార్గదర్శకాలు జారీచేస్తాం’ అని మమ్దానీ తెలిపారు.
ఎవరీ రోడ్రిగుయెజ్ ?
56 ఏండ్ల రోడ్రిగుయెజ్ సోషలిస్ట్ వెనిజులాలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తుల్లో ఒకరు. మదురోకు విధేయురాలు. మదురో నే తమ నాయకుండంటూ ఆమె అభివర్ణిస్తుంటారు. ఆర్థిక మంత్రిగా, చమురు శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా ఆంక్షలు, ద్రవ్యోల్బణంతో దేశం ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మదురో ఆమెను ‘పులి’గా అభివర్ణించారు. కారకాస్‌కు చెందిన రోడ్రిగుయెజ్ లిగా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, వామపక్ష గెరిల్లా నాయకుడు అయిన జార్జ్ ఆంటోనియో రోడ్రిగుయెజ్ కుమార్తె.
1969 మే 18వ తేదీన జన్మించిన రోడ్రిగుయెజ్ వెనిజులాలోని సెంట్రల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. గత దశాబ్ద కాలంగా ఆమె అనేక ప్రభుత్వ పదవులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చు కున్నారు. 2013-2014 మధ్య కాలంలో కమ్యూని కేషన్-ఇన్ఫర్మేషన్ మంత్రిగా, 2014-2017 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు. 2017లో ప్రభుత్వ అనుకూల కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ అధిపతిగా నియమితుల య్యారు. 2018లో ఆమెను మదురో దేశ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. 2024 ఆగస్టులో ఆమె చమురు శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆమె ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు. వెనిజులా చీఫ్ ఎకనమిక్ అథారిటీకి కూడా ఆమె నేతృత్వం వహించారు. వెనిజులా జాతీయ అసెంబ్లీకి నేతృత్వం వహించిన తన సోదరుడు జార్జ్ రోడ్రిగుయెజ్‌తో కలిసి పనిచేశారు.
కరెంటు లేదు.. ఆహారం, ఫోన్ల ఛార్జింగ్ కోసం బారులు
వెనిజులా ప్రజల కష్టాలు
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. వెనిజులాపై అమెరికా ఒక్కసారిగా మెరుపుదాడులకు పాల్పడింది ఈ దాడులతో ఆ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వైమానిక దాడుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినడంతో కారకాస్‌లోని అనేక ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లు మూతపడటంతో.. చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కారకాస్‌లోని భారతీయుడు సునీల్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరించారు ‘భారీ నష్టం జరిగింది. కారకాస్‌లోని విమానాశ్రయంపై కూడా అమెరికా దాడి చేసింది. నగరానికి 100 కి.మీల దూరంలో ఓ వైమానిక స్థావరం ఉంది. దేశంలోనే అతిపెద్దది. అది కూడా దెబ్బతింది. ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ స్థావరం వద్ద ఎక్కువ నష్టం జరిగింది. దాడి అనంతరం అన్ని సూపర్ మార్కెట్లు మూసేశారు. చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు పొడవైన క్యూలు కన్పిస్తున్నాయి.
ప్రతి చోటా 500- 600 మంది బారులు తీరారు. ఫార్మసీల వద్ద చాలా పెద్ద క్యూలు కన్పిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు కూడా రావడం లేదన్నారు. కరెంటు లేకపోవడంతో ఫోన్ల ఛార్జింగ్‌కు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ దీపాల వద్ద కరెంటు ఉండటంతో.. దాని నుంచి ప్రజలు ఫోన్‌లకు చార్జింగ్ పెట్టుకుంటున్నారని వెల్లడించారు. తన ఫోన్‌ను చార్జి చేసుకోవడం కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని మల్హోత్రా తెలిపారు. కరెంటు సమస్య ఎప్పుడు తీరుతుందనే దానిపై స్థానిక యంత్రాంగం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదన్నారు. ఇక, కారకాస్‌లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. దాని నుంచి ముఖ్యమైన సూచనలు చేస్తోంది.



