ఐక్య ఉద్యమాలకు కార్మికవర్గం సిద్ధం కావాలి
మోడీ జమానాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె చరిత్ర సృష్టించాలి : విశాఖలో సీిఐటీయూ బహిరంగసభలో కార్మిక నేతల పిలుపు
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై తీవ్ర దాడి చేస్తున్న తరుణంలో రానున్నదంతా పోరాట కాలమేననీ, దానికి కార్మికవర్గం సిద్ధం కావాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు. కార్మిక హక్కుల కోసం పోరాడటమంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ పోరాడటమేనని ఉద్బోధించారు. ప్రభుత్వరంగం పరిరక్షణ, లేబర్‌కోడ్‌ల ఉపసంహరణ, రైతుల సమస్య లు, ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ డిమాండ్‌లతో జరుగుతున్న ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి కార్మిక సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ (అనతల వట్టం ఆనందన్ నగర్)లో దిగ్విజయంగా జరిగాయి. మహాసభ చివరి రోజు ఆదివారంనాడు నగరంలో భారీ కార్మిక కవాతు, ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ యూనియన్ అఖిల భారత ఉపాధ్యక్షులు డాక్టర్ కె.హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
ప్రమాదంలో కార్మికుల మనుగడ : ఎలమారం కరీం
మహాసభలో నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం మాట్లాడుతూ.. ‘కార్మికులు పోరాటబాట పట్టే పరిస్థితులను పాలకులే సృష్టిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాల్లో ఆ పార్టీ, మిత్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసే విధానాలు అమలు చేస్తున్నాయి. వాటిని కార్మికవర్గం ఐక్యంగా ప్రతిఘటించకపోతే కార్మికుల జీవన మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు అనివార్యం. భవిష్యత్తంతా ఉద్యమకాలం. కార్మికులు తమ హక్కుల కోసమే పోరాడుతున్నామనుకోరాదు. కార్మివర్గం చేసే పోరాటం ప్రజాస్వామ్య, లౌకికత్వ పరిరక్షణ పోరాటంగా అర్థం చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం 2019లో తొలిగా వేతన కోడ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు నేను రాజ్యసభలో ఉన్నాను. వామపక్షాలు, ఇతర లౌకిక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఏ పార్టీ వైఖరేంటో ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో సభలో చర్చ, ఓటింగ్‌కు పట్టుబట్టాం.
లేబర్ కోడ్‌లను కాంగ్రెస్ వ్యతిరేకించలేదు. టీడీపీ మద్దతిచ్చింది. తమిళనాడు శ్రీపెరంబదూర్‌లో శాంసంగ్‌లో ట్రేడ్ యూనియన్ పెట్టుకొనే హక్కును యాజమాన్యం వ్యతిరేకిస్తే అక్కడి డీఎంకే సర్కార్ మారు మాట్లాడకుండా మద్దతిచ్చి కార్మికులకు వ్యతిరేకంగా పని చేసింది. వైజాగ్ స్టీల్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగేందుకు కార్మికులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం చరిత్ర సృష్టించింది. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని ప్రయివేటీకరిం చేందుకు అంగీకరించదు. కేంద్ర ప్రభుత్వం హిందూస్థాన్ పేపర్ లిమిటెడ్‌ను ప్రయివేటీకరి స్తుంటే అడ్డుకొని తానే నడిపి చూపించింది. అటువంటి ప్రత్యామ్నాయ విధానం లెఫ్ట్ సారధ్యంలోని కేరళ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. దేశంలో 45 కోట్ల మంది కార్మికులుంటే వారిలో ఒకటి రెండు కోట్ల మంది మాత్రమే పర్మినెంట్ వర్కర్స్. మిగిలిన వారందరికీ కనీస ఉద్యోగ, పని భద్రత లేదు. వారి సమస్యలపై పోరాడాలి. ఫిబ్రవరి 12 సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయాలి’ అని పిలుపునిచ్చారు.
వెనకడుగే లేదు : సుదీప్ దత్తా
కార్మిక వర్గ సమస్యలపై పోరాటాలకు సీఐటీయూది ముందడుగేననీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సుదీప్ దత్తా చెప్పారు. ఐదు రోజుల మహాసభలో ప్రస్తుతం దేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేందుకు భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకున్నామని వివరించారు. ‘మైనింగ్‌లో, పొలాల్లో, రవాణాలో, ఫ్యాక్టరీల్లో, నిర్మాణరంగంలో ఎక్కడైనా కార్మికుడు పని చేస్తేనే ఏ ఉత్పత్తయినా జరుగుతుంది. సంపద సృష్టించేది కార్మికవర్గం. సమాజాన్ని నడిపించేది కార్మికులు. కానీ కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా సంక్షోభంలో ఉంది. కేవలం కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభాలు కురిపించే వారిగానే కార్మికులను చూస్తున్నారు.
కేంద్రం, పాలకవర్గ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కార్మికులను తమ శత్రువులుగా పరిగణిస్తున్నాయి. ఆ సిద్ధాంతాన్ని ఓడించేందుకు కార్మికవర్గం బలమైన పోరాటం చేసేందుకు ముందుకు రావాలి. వైజాగ్ స్టీల్ కార్మికులు అలుపరగకుండా చేస్తున్న పోరాటం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ స్ఫూర్తితో ప్రభుత్వరంగ పరిరక్షణకు కార్మికవర్గం ఉద్యమించాలి. ఫిబ్రవరి 12 సమ్మె రోజు దేశం మొత్తాన్నీ కార్మికర్గం స్తంభింపజేసి కార్మిక సత్తాను మోడీ ప్రభుత్వానికి రుచి చూపించాలి. ప్రజల, కార్మికుల కోసం సుందరయ్య, బసవపున్నయ్య త్యాగాలు చేసిన నేల ఇది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఊతం ఇచ్చిన గడ్డ. మన పూర్వీకుల, అమరులు అందించిన పోరాట కర్తవ్యాన్ని భుజానికెత్తుకొని పోరాడాలి’ అని సుదీప్ దత్తా పిలుపునిచ్చారు.
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇంక్విలాబ్ జిందాబాద్’ అని సభికులతో నినాదాలు చేయించి ఉత్సాహపరిచారు. బహిరంగ సభ వేదికపై సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు తపన్‌సేన్, కోశాధికారి ఎం సాయిబాబు, పూర్వ ఉపాధ్యక్షులు ఎంఎ గఫూర్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు సీహెచ్ నర్సింగరావు, ఎ.వి నాగేశ్వరరావు, బేబిరాణి ప్రసంగించారు. సభా వేదికపై సీఐటీయూ మాజీ అధ్యక్షులు ఏకే. పద్మనాభన్, ఆఫీస్‌బేరర్లు ఆశీనులయ్యారు. తొలుత సీఐటీయూ విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ వక్తలను వేదికమీదికి ఆహ్వానించారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. కళా రూపాలు ప్రదర్శించారు.



