– దేశంలోని 43.2 శాతం మంది కార్మికులకు చట్టాలు వర్తించవు
– రద్దు కానున్న కాంట్రాక్ట్ విధానం
– న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశమే లేదు
– ఉద్యమాల ద్వారానే వీటిని తిప్పికొట్టగలం : ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సి. శ్రీకుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లేబర్‌కోడ్‌లతో హక్కులకు పాతరేస్తున్నారని, పాలకులుగానీ, యాజమాన్యాలుగానీ కాంట్రాక్టు కార్మికులను నిర్లక్షం చేస్తే, కనీసం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశమే లేకుండా లేబర్ కోడ్‌లు ఉన్నాయని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సి. శ్రీకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా… కోడ్‌ల వల్ల కాంట్రాక్టు విధానమే రద్దు కాబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోడ్‌ల ఆధారంగా న్యాయస్థానాల్లో కూడా కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేశారు. నాలుగు కోడ్‌ల వల్ల జరిగే అన్యాయాలను, కార్మిక వ్యతిరేక చర్యల పట్ల క్షేత్రస్థాయి కార్మికులకు అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. నాలుగు కోడ్‌లు రద్దు చేసేదాక కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి’ అనే అంశంపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్ అధ్యక్షత వహించన ఈ కార్యక్రమంలో శ్రీకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. వాటి అమలు చేయడం వల్ల 43.2 శాతం కార్మికులకు ఎలాంటి చట్టాలు వర్తించబోవని తెలిపారు. ఇప్పటికే కేంద్రంలోని వివిధ శాఖల్లో 13 లక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. లేబర్ కోడ్‌లతో ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు లేవని విశదీకరించారు. రిజర్వేషన్లు పొందుతున్న బీసీ, ఎస్సీ వర్గాలకు తీవ్ర నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కార్పొరేట్ శక్తులు నడిపిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై కార్పొరేట్ శక్తుల పెత్తనం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు జరిగే నష్టాలు, సమస్యలపై బీజేపీ ఎంపీలకు కనీసం అవగాహన కూడా లేదని విమర్శించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ రద్దు అధికారాన్ని కూడా అందులో పొందుపర్చారని తెలిపారు. ప్రస్తుతం కార్మిక సంఘాలకు లేబర్ కోడ్‌లు పెద్ద సవాలుగా మారాయనీ, వాటిని రద్దు చేసే వరకు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ సీనియర్ నేత వీ.ఎస్ బోస్ మాట్లాడుతూ ఆర్థిక, పారిశ్రామిక అంశాల్లో అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఎండీ. యూసుఫ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు డాక్టర్. బీవీ విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా, ఉపాధ్యక్షులు వి.చంద్రయ్య, భూమయ్య, డిఫెన్స్ ఉద్యోగుల సంఘం నాయకులు ఏవీ రావు, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పి.ప్రేం పావని, రాష్ట్ర కార్యదర్శులు బి.వెంకటేశం, నండూరి కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
లేబర్‌కోడ్‌లతో హక్కులకు పాతరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



