Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదర్శ ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే

ఆదర్శ ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే

- Advertisement -

– 150 ఏండ్ల క్రితమే చదువు ప్రాధాన్యతను గుర్తించిన మహనీయురాలు
– మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో పలువురు వక్తలు
– తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

నిజమైన సరస్వతి సావిత్రిబాయి ఫూలే అని, 150 ఏండ్ల క్రితమే చదువు ప్రాధాన్యత గుర్తించి నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయంగా నిలిచారని పలువురు విద్యావేత్తలు కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కమిటీ నాయకులు సుజావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ఇప్పటికీ మహిళలకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదని, మెజారిటీ మహిళలు నిరక్షరాశ్యులుగా, నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా మహిళా ఉపాధ్యాయులంతా ఉద్యోగం కోసమే కాకుండా పిల్లల చదువులపై దృష్టి పెట్టి మనస్ఫూర్తిగా చదువులు చెప్పాలని తెలిపారు. ప్రముఖ మోటివేటర్‌, వెంటర్‌, రైటర్‌ ఆకెళ్ళ రాఘవేంద్ర, హిప్నో సైకాలజిస్ట్‌ పద్మ కమలాకర్‌ మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే తన భర్త అడుగుజాడల్లో నడవడమే కాక భర్త చనిపోయిన తర్వాత కూడా భర్త స్థాపించిన సత్యశోధక్‌ సంస్థను నడిపారని అన్నారు. మహిళలకు చదువు చెప్పడానికి అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఆధిపత్య వర్గాల నుంచి దాడులు ఎదురైనా నిర్భయంగా తన లక్ష్యన్ని సాధించారని కొనియాడారు. భావితరాలను అభివృద్ధి వైపు నడపాలంటే నిజాయితీ, నిబద్ధతతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ బాలోత్సవం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్‌. సోమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ బాలోత్సవం భావితరాల అభివృద్ధికి ఒక ప్రత్యేక లక్ష్యంతో, ఆశయంతో పనిచేస్తుందని అన్నారు. సభ అనంతరం మమత ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహానీయుల ఏకపాత్రాభినయం, పర్యావరణ పరిరక్షణ, అమ్మాయిల చదువు ఇంటికి వెలుగు అంశాలపై స్కిట్స్‌, అభ్యుదయ, దేశభక్తి గేయాలపై నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల మహిళ ఉపాధ్యాయులను గుర్తించి ప్రత్యేక సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లాల్‌ బహదూర్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు అంకమ్మ, కవి, రచయిత్రి రాణి రుక్మిణి, కమిటీ సభ్యులు పీఎన్‌కే బ్రాహ్మణి, మహేష్‌ దుర్గే, వివిధ పాఠశాలలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -