– ఫోన్‌ట్యాపింగ్ డివైజ్‌ల గురించి సిట్ ఆరా : పాత విషయాలే అడిగారు : నవీన్‌రావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ నవీన్‌రావును సిట్ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో తమ ఎదుట హాజరు కావాలని నవీన్‌రావుకు జారీ చేసిన నోటీసుల కారణంగా ఆయన జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వచ్చిన నవీన్‌రావును సిట్ అధిపతి, నగర పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారించింది. మధ్యాహ్నం లంచ్ విరామాన్ని మినహాయించి నవీన్‌రావును సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు సిట్ అధికారులు విచారించారు. ముఖ్యంగా ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని నడపడానికి అవసరమైన ట్యాపింగ్ డివైజ్‌లను వీరికి ఎవరు, ఎలా సమకూర్చారు? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మొదలైన ప్రశ్నలను నవీన్‌రావుకు సిట్ అధికారులు సంధించినట్టు తెలిసింది. అలాగే ఐ న్యూస్ ఛానెల్ సీఈఓ శ్రవణ్‌రావుకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం ఉంది? తదితర ప్రశ్నలను కూడా సిట్ అధికారులు వేసినట్టు తెలిసింది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని నడపడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఎవరైనా ఆదేశాలిచ్చారా? వారు మిమ్మల్ని ఏ మేరకు ప్రోత్సహించారు? తదితర ప్రశ్నలు కూడా నవీన్‌రావుకు వేసినట్టు సమాచారం. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధాలున్న ఎస్‌ఐబీ అధికారుల్లో మీకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఆ పరిచయాలు ఎలాంటివి? ఫోన్ ట్యాపింగ్ నడుస్తున్న వ్యవహారంపై మీకు మొదటి నుంచి సమాచారం ఉందా? తదితర కోణాల్లో కూడా సిట్ విచారించినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ కస్టడీలో రెండువారాల పాటు ఉంచుకొని విచారించిన సిట్ అధికారులు.. కొద్ది విరామం తర్వాత నవీన్‌రావును విచారించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దాదాపు ఎనిమిది గంటలపాటు నవీన్‌రావును విచారించిన అధికారులు.. ఆయన్ను ఇంటికి పంపించేశారు. విచారణ ముగిసిన అనంతరం వెలుపలికి వచ్చిన నవీన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. గత సెప్టెంబరు 24న తనను తొలుత విచారించిన సమయంలో అడిగిన ప్రశ్నలనే తిరిగి ఇప్పుడు అడిగారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధాలున్న వారితో తనకున్న సంబంధాలపైన్నే ఎక్కువగా ఆరా తీశారని వివరించారు. ఈ కేసుకు సంబంధించి తనను ఎన్నిమార్లు పిలిచినా వస్తానంటూ సిట్ అధికారులకు తెలిపినట్టు పేర్కొన్న ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్‌రావు సుదీర్ఘ విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



