ఆంక్షలు, నిర్బంధాల మధ్య ఆశాల పోరాటం
48 గంటల పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన
ఎట్టకేలకు దిగివచ్చిన డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీ
తమ పరిధిలో సమస్యల పరిష్కారంపై సర్క్యూలర్ జారీకి హామీ
రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనంపై.. ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కనీస వేతనం లేదు. వెట్టిచాకిరీ తప్పట్లేదు. అంతలా పని చేస్తున్నా అధికారుల నుంచి వేధింపులు మాత్రం ఆడగం లేదు. పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఎలాంటి మార్పు లేదు.” దాంతో ఆశాలు పోరుబాట పట్టారు. కనీస వేతనం రూ.18వేలు ఫిక్స్‌డ్‌గా చెల్లించాలని, ఆశాలకు జాబ్ చార్ట్ ఇవ్వాలని, పారితోషికానికి సంబంధం లేని పనులు తమతో చేయించొద్దని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. బుధవారం ఉదయం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ చేపట్టి ప్రదర్శనగా ధర్నా చౌక్ వరకు చేరుకొని అక్కడే బైటాయించారు. రాత్రయినా వారు అక్కడే బైటాయించడంతో పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తామని భయపెట్టారు.
అయినా సీఐటీయూ నాయకులు, ఆశాలు బెదరలేదు. చలిని సైతం లెక్క చేయకుండా ధర్నా చేపట్టారు. అక్కడే వంటవార్పు చేసుకొని భోజనాలు చేసి బస చేశారు. అర్ధరాత్రి వేళ పోలీసుల నిర్బంధం పెరిగింది. గురువారం చలో కలెక్టరేట్‌కు పిలుపు ఉండగా.. పోలీసులు ఆశాలను బలవంతంగా సీఐటీయూ కార్యాలయానికి తరలించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే సీఐటీయూ నాయకుల ఇండ్లకు వచ్చిన పోలీసులు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టొద్దని నోటీసులు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేశారు. మిగతా మండలాల నుంచి ఉదయం 8 గంటల వరకు వందలాదిగా ఆశాలు తరలివచ్చారు. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు అడ్డగించి అధికారులను ఇక్కడికే పిలిపిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయం బయట బైటాయించారు.
ఆశాల వద్దకు వచ్చిన డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీ
ఆశాల ఆందోళన నేపథ్యంలో స్పందించిన డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీ ఉదయం 10 గంటల సమయంలో సీఐటీయూ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్.. ఆశాల సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, గతంలో పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీబీ టెస్టు కోసం పేషెంట్‌ల స్ప్రూటం (తెమడ) డబ్బాలను ఆశాలతో మోపించొద్దని డీఎంఅండ్‌హెచ్‌వో ఇచ్చిన ఆదేశాలను కిందిస్థాయి అధికారులు ఉల్లంఘిస్తూ ఆశాలతోనే మోపిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
వీటితో పాటు అధికారుల వేధింపులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ.. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. రెండు రోజుల్లో సర్క్యూలర్ జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో సీఐటీయూ నాయకులు, ఆశాలు శాంతించారు. ఆశాల పోరాటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. రమేశ్‌బాబు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, ఇందిరా, రేణుక, సీహెచ్ నర్సు, బాలమణి, దివ్య, విజయ, లావణ్య, శాంతి, రేణుక, రేఖ, కళావతి, వందలాది మంది ఆశావర్కర్లు పాల్గొన్నారు.



