Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత

ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత

- Advertisement -

పూణే : ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ (82) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పూణేలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు సిద్ధార్థ్‌ గాడ్గిల్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పూణేలోని వైకుంఠ శ్మశానవాటికలో జరగనున్నాయి. మాధవ్‌ గాడ్గిల్‌ పశ్చిమ కనుమల పర్యావరణ ప్రాముఖ్యతకు విశేష కృషి చేశారు. ప్రపంచ జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ అయిన పశ్చిమ కనుమలలో ఆయన చేసిన కృషికి గాను 2024లో ఐక్యరాజ్యసమితి ఆయనకు అత్యున్నత పర్యావరణ గౌరవమైన వార్షిక ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డును బహూకరించింది.కాగా, ఆయన పర్యావరణానికి సంబంధించి విలువైన సిఫారసులను అందించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం చేకూర్చకుండా కఠినమైన ఆంక్షలను తన నివేదికలో సిఫారసు చేశారు.

వాటిల్లో కొత్త రోడ్లు లేదా భవన నిర్మాణాల కట్టడాలకు అనుమతించరాదని, నిటారుగా ఉన్నవాలులో అభివృద్ధి చేయరాదని, రాతి తవ్వకాలపై నిషేధం విధించాలని తెలిపారు. మాధవ్‌ గాడ్గిల్‌ మృతికి పర్యావరణశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సంతాపం తెలిపారు. ‘మాధవ్‌ గాడ్గిల్‌ ఒక అత్యున్నతస్థాయి విద్యావేత్త, అవిశ్రాంత క్ష్షేత్ర పరిశోధకుడు, మార్గదర్శక సంస్థ నిర్మాత, గొప్ప సంభాషణకర్త, ప్రజల నెట్‌వర్క్‌లు, ఉద్యమాలను దృఢంగా నమ్మిన వ్యక్తి, ఐదు దశాబ్దాలకు పైగా చాలామందికి స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి, గురువు. ఆధునిక శాస్త్రంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ఆయన జీవవైవిధ్య పరిరక్షణలో ఛాంపియన్‌గా నిలిచారు’ అని జైరాం రమేశ్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మాధవ్‌ స్ఫూర్తిదాయకవ్యక్తిగా నిలిచిపోతారని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -