యువ నవ ఉత్తేజానికి ఉత్సవం
రెండేండ్లలో 75వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం : ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌లో ఎలాన్, ఎన్ విజన్‌ను ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-కంది
ఎలాన్, ఎన్ విజన్-2026 ఫెస్టివల్.. సాంకేతికత, సంస్కృతి, యువ నవోత్తేజానికి ఒక ఉత్సవం అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న టెక్నో-సాంస్కృతిక ఉత్సవం ‘ఎలాన్, ఎన్ విజన్ 2026’ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది ప్రధాన థీమ్ అయిన ‘ది లాస్ట్ రోనిను ప్రేరణతో నిర్వహిస్తున్న ఎలాన్, ఎన్ విజన్-2026.. ఐఐటీ హైదరాబాద్ ఆత్మస్వరూపాన్ని, స్వతంత్రత, అద్భుత సాధన పట్ల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భారతదేశ భవిష్యత్ ఆవిష్కర్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. కొత్తదారులను సృష్టిస్తూ, సృజనాత్మకత, లక్ష్యంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కేవలం రెండు సంవత్సరాల్లో దాదాపు 75 వేల ఉద్యోగాలు గ్రూప్ 1, 2, 3 ద్వారా కల్పించామని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు భర్తీ చేస్తూ.. ప్రయివేట్ రంగంలో కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకున్నవన్నీ నెరవేరుస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటన తప్పకుండా చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులు మంచిగా చదువుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలం గడిపి, ఇప్పుడు నిరుద్యోగ యువత గురించి మాటాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. వారు పని చెయ్యరు, చేసేవారిని చేయనివ్వరని ఆరోపించారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని స్పష్టంచేశారు.
ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఎలాన్, ఎన్ విజన్-2026.. సాంకేతికత, సృజనాత్మకత, సంస్కృతి కలసి బాధ్యతాయుతమైన ఆవిష్కర్తలను తీర్చిదిద్దే వేదిక అని అన్నారు. తరగతి గదులను మించి ఆలోచించేందుకు, విభాగాల మధ్య సహకారం పెంపొందించేందుకు, ఆలోచనలను సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా మార్చేందుకు ఈ ఫెస్టివల్ విద్యార్థులకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. జనవరి 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఫెస్ట్‌లో దేశవ్యాప్తంగా 30,000కు పైగా విద్యార్థులు, ఆవిష్కర్తలు, కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఉన్నత ప్రమాణాల సాంకేతిక పోటీలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలోచనాత్మక చర్చలు చోటు చేసుకుంటూ, ఐఐటీహెచ్ ఉత్సాహభరిత విద్యార్థి పర్యావరణ వ్యవస్థను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఎలాన్, ఎన్ విజన్-2026
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



