-సీసీఐ అధికారుల కుమ్మక్కుతో దళారులకు లాభం..
-ట్రేడ్ లైసెన్సు లేకుండానే కొనుగోళ్లు..
-చోద్యం చూస్తున్న సంబంధిత శాఖ అధికారులు..
-తక్షణమే కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..
-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్..
నవతెలంగాణ – కాటారం
రుద్ర జిన్నింగ్ మిల్లు పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుద్రా జిన్నింగు మిల్లులో దళారులు,మిల్లు యాజమాన్యం, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేసే విధంగా కమిషన్ల కోసం తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దాదాపు 5 కిలోల నుంచి పది కిలోల తరుగు తీస్తూ ఆరుకాలం కష్టపడి,చెమటోడ్చి పండించిన పంటకు లాభం లేకుండా పోతుందని,మిల్లర్లు,దళారుల జేబులు మాత్రం నిండుతున్నాయని అన్నారు.
అక్రమాలకు సహకరిస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి అందజేసిన ఇప్పటివరకు ఇసుమంత కూడా విచారణ జరగలేదని దీన్ని బట్టి చూస్తే రైతుల పట్ల జిల్లా స్థాయి నుండి కింది స్థాయి అధికారుల వరకు ఎంత నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారో అర్థమవుతుందని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతన్నలకు కష్టం కలిగించకుండా రుద్ర జిన్నింగ్ మిల్లు పై,సీసీఐ అధికారులపై సమగ్ర విచారణ జరిపి దళారులతో సహా అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్, నాయకులు రాజేందర్, నవీన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.



