కొత్త ఏడాది మొదలైందంటే చాలు డైరీ గుర్తొస్తుంది. నిజానికి డైరీ అనేది ప్రతి ఒక్కరికీ ఓ రహస్య నేస్తం. ఎంతో సన్నిహితంగా ఉండే వారికి సైతం చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని నిర్భయంగా డైరీలో రాసుకోవచ్చు. ఒకప్పుడు డైరీ రాయడం అంటే చాలామంది ఇష్టపడేవారు. తమకు సంబంధించిన ప్రతి విషయం డైరీలో రాసుకునేవారు. ఇప్పుడంత డిజిటల్ యుగం. తమ దైనందిన జీవితంలో ప్రతి అంశం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి డైరీ రాయడం అనేది కేవలం రాసుకున్న విషయాలు మళ్లీ ఒకసారి చూసుకోవడానికి మాత్రమే కాదు. దీని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల కొన్ని అనుభవాలు, వాటివల్ల ఎదుర్కున్న ఫలితాలతో కొన్ని సర్దుబాట్లు చేసుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మన అనుభవాలను గుర్తు పెట్టుకోవాలంటే డైరీ రాయడం మంచి అలవాటు. నిద్రలో మనం చాలా విషయాల్ని మర్చిపోతుంటాం. అయితే డైరీ రాసే అలవాటు ఉన్నవారు నిద్రలో ఉన్నా సరే వారి జ్ఞాపకశక్తి బలంగా ఉంటుందట. అయితే డైరీ చాలామంది రాత్రివేళ పడుకునే ముందు రాస్తుంటారు. నిజానికి సాయంత్రం పూట డైరీ రాయడం మంచి సమయమట. డైరీ రాయడం వల్ల ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుంది. ఒకరోజు డైరీ రాసినపుడు ఉన్న భావోద్వేగాలు తరువాత రోజు ఉండవు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వాటి తాలుకూ ఎమోషన్స్ మన మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో మన డైరీలోని రాతలు మన కళ్లకు కడతాయి. కొన్ని విషయాల్లో మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి కూడా సాయపడుతుంది.
చాలామంది జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోతుంటారు. డైరీ గతం మర్చిపోకుండా ఉంచుతుంది. అలాగే డైరీ రాసే అలవాటు ఉన్నవారిలో భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉంటాయి. మీరు చేసిన తప్పులు, ఒప్పులు నోట్ చేసుకోవడం ద్వారా మీలోని నిజాయితీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మనసు ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలిగే ధైర్యాన్నిస్తుంది. సెల్ ఫోన్లతో గంటలు గంటలు సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కనుక కాసేపు వాటిని పక్కన పెట్టి డైరీ రాయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని జ్ఞాపకాలను భద్రంగా దాచుకునే అవకాశం డైరీ రాయడం వల్లే సాధ్యమవుతుంది.
అలాగే ప్రతి రోజు డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. కాబట్టి ఒత్తిడితో బాధపడేవారు డైరీ రాయడం చాలా మంచిది. ప్రతి రోజు మన ఆలోచనలను కాగితంపై పెట్టడం వల్ల మానసిక స్పష్టత ఉంటుంది. గందరగోళం తగ్గుతుంది. మనలోని భయం, కోపం వంటి భావాలు తగ్గించుకోవచ్చు. సంతోషమైన జీవితాన్ని గడపొచ్చు. అంతేకాదు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల మనలో సానుకూల శక్తి పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం కూడా ఎక్కువ అవుతుంది.
అందరికీ పంచుకోలేని భావాలను మనం డైరీలో రాసుకుంటాం. కనుక ఇలా ప్రతిరోజు మన భావాలను బయటపెట్టుకున్నామనే భావన మనకు కలుగుతుంది. మనలోని సృజనాత్మకతను పెంచుకునేందుకు కూడా డైరీ రాయడం ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పటికే మీకు డైరీ రాసే అలవాటు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ లేదంటే ఇప్పుడే మొదలుపెట్టండి. డైరీతో స్నేహం చేయండి.
డైరీ రాస్తున్నారా..?
- Advertisement -
- Advertisement -



