మీరు ఎంచుకున్న కెరీర్ మీకు ఎక్సైట్‌మెంట్‌గా వుండాలి. నిత్యం మిమ్మల్ని ఉర్రూతలూగించే అమితోత్సాహాన్ని మీలో నింపేదయి వుండాలి. అట్లాంటి కెరీర్లోనే మీరు మీ ప్రతిభా సామర్ధ్యాలను, మీ ఆసక్తిని సరిసమానంగా ఉపయోగించి అత్యుత్తమ శ్రేణిలో రాణించగల్గుతారు. అయితే ఈ కెరీర్ ట్రాక్ విద్యార్థి దశలోనే కనుగొని దిశా నిర్దేశం చేసుకోవాలి.
బాల్యదశలో వుండగానే మన కెరీర్ ఏమిటో నిర్ధారణ అయిపోతుందని జోడీ గోథర్డ్, కార్డెల్ ఫిలిప్స్ అనే జంట శాస్త్ర వేత్తలు అంటారు. ఆ మాటకొస్తే వయోజన స్థితిలో మనిషి వ్యవహరించే పలు ప్రవర్తనల్లో అతని బాల్యదశపు ఛాయలు కనబడకపోవన్నది మనస్తత్వ శాస్త్రానికి కొత్తేమీకాదు. సామాజిక, మానసిక శాస్త్ర నిపుణులు అందుకనే ప్రతి వ్యక్తి బాల్యం ఎట్లా గడిచింది అనే అంశం మీద ఎక్కువ దష్టి పెడుతూ వుంటారు. మానసిక, శారీరక, మనోదైహిక రుగ్మత కారణాల శోధనలో సైతం బాల్యదశపు జీవితాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటూ వుంటాం. బాల్యదశపు ప్రాబల్యం, ఒక వ్యక్తి తన కెరీర్‌ను ఎంపిక చేసుకోవడంపై కూడా బలమైన ప్రభావాన్ని కలిగి వుంటుంది. పాశ్చాత్య దేశాల్లో కెరీర్ డెవలప్మెంట్, కెరీర్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో శిక్షణ ఇచ్చే పలువురు మనస్తత్వవేత్తలు, సైకలాజికల్ కౌన్సెలర్లు ఈ విషయంగా అనేక పరిశీలనలను జరిపి నిర్ధారణకు వచ్చారు. తమ వద్దకు వచ్చిన క్లైంట్ల వైయుక్తిక జీవిత విశేషాలను క్షణ్ణంగా పరిశీలించిన పిమ్మట, వారు ప్రస్తుతం చేస్తూ వున్న కెరీర్ స్వభావం, దానికి వారి ప్రతిస్పందన, వారెదుర్కొంటున్న సవాళ్ళు వీటన్నిటినీ నిశితంగా గమనించినపుడు, ప్రస్తుతపు వారి వైఖరి, ప్రవర్తనా లోపాలు ఇవన్నీ బాల్యదశలో వారు ఏర్పరచుకున్న మూర్తిమత్వ ప్రాథమిక పోకడలకు ప్రత్యక్ష సంబంధాన్ని కల్గివున్నాయని పరిశోధనల్లో తేలింది. అంచేత ఒక వ్యక్తి తన బాల్యంలో కన్పరచిన ఇష్టాయిష్టాలను గమనిస్తే విశ్లేషించగల్గితే ఆ వ్యక్తి ప్రస్తుతం కెరీర్లో ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో, ఏ కారణం చేత కొన్ని సవాళ్ళను అధిగమించలేకపోతున్నాడో తేటతెల్లమవుతుందని శాస్త్రజ్ఞుల అంచనా అట్లాగే ఒక వ్యక్తి తన కెరీర్లో అత్యుత్తమ ప్రతిభా సామర్థ్యాలను కన్పరచటం వెనుక కూడా బాల్య దశపు ఆసక్తి ప్రస్ఫుటితమవుతుందని కెరీర్ కౌన్సెలర్లు అంటున్నారు.
లింగవివక్ష :
సాధారణంగా మన సమాజంలో ఆడపిల్లలను ఒక రకంగాను, మగపిల్లలను ఒక రకంగాను పెంచడం జరుగుతుంది. ఎక్కడో అరుదుగా రాణి రుద్రమదేవి లాంటి కేసుల్లో తప్ప, ఆడపిల్లను మగరాయుడిలా పెంచడం జరగదు. ఈ వివక్ష పసిపిల్లలు ఆడుకునే ఆటల్లో చాలా స్పష్టంగా మనకు కన్పిస్తుంది. మగపిల్లలకు తల్లిదండ్రులు, గన్నులు, బ్యాటులు కొనిస్తారు. ఆడపిల్లలకు లక్క పిడతలు కొనిస్తారు. చిన్నప్పుడు సాహసోపేతమైన ఆటలు ఆడేవాళ్ళు పెద్దయ్యాక సాహసోపేతమైన కెరీర్లను ఎంచుకుంటారని లేదా తాము ఉద్యోగాలు సంపాదించుకున్న రంగాల్లో సాహసోపేతమైన చర్యలలో పాలు పంచు కుంటారని మన పరీశీలనల్లో తేలింది. బాల్యదశలో ఆడుకునే ఆటలు, వారి వారి ప్రతిభా సామర్ధ్యాలు బయటకు విడుదల అయ్యే మార్గాలను సూచనప్రాయంగా తెలియచేస్తాయి. లక్కపిడితలతో, వంటలూ వార్పులు ఆటలు ఆడుకునే బాలికలు, పెద్దయ్యాక రుచికరమైన భోజనాన్ని వండి వడ్డించటంలో దిట్టలవుతారు. జీవితాన్ని ఎట్లా నిర్మించుకోవాలన్న ఆలోచన చేసినపుడు, ఏ వ్యక్తి అయినా తన బాల్యదశపు పోకడలను, చిన్న వయసునాటి ఆసక్తులను దాటి వెళ్ళలేడనేది ప్రస్ఫుటంగా కన్పిస్తున్న విషయం.
వివిధ పాత్రలు :
బాల్యంలో ఆడుకునే ఆటల్లో మనం పోషించే పాత్రలు సైతం మన కెరీర్‌ను నిర్ధారిస్తాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఎంచుకునే ఆటలేకాదు, ఆయా ఆటల్లో పిల్లలు పోషించే పాత్రలు, ఆయా పాత్రల పోషణకు వారికి లభించిన ప్రశంసలు ఇవ్వన్నీ వారిలో, ఆయా పాత్రలనే ఆదర్శ పాత్రలుగా, ఆరాధించదగ్గ పాత్రలుగా స్వీకరించేతత్వం అలవడ్తుంది. తత్ఫలితంగా పెద్దయ్యాక ఆ కోవకు చెందిన పాత్రలనే పోషించటానికి ఇష్టపడతారు. ఆయా పాత్రల పోకడ లీలగానన్నా ద్యోతకమయ్యే ఉద్యోగ పాత్రలు కానీ, వ్యాపార పాత్రలు గానీ ఎంచుకోగల్గినపుడు వారిలో ప్రతిభా సామర్ధ్యాలు మరింతగా ఇనుమడించి, వారి వారి కెరీర్లలో అపూర్వ విజయాలను అందుకోటానికి దోహదపడుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



