సంస్కరణలతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారమివ్వాలి
‘వీబీ-జీ రామ్ జీ’ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి : ప్రీబడ్జెట్ సమావేశంలో కేరళ ఆర్థికమంత్రి కె.ఎన్. బాలగోపాల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి జీఎస్టీ రక్షణ చట్రాన్ని రూపొందించాలని కేరళ ఆర్థికమంత్రి కె.ఎన్ బాలగోపాల్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ అశోక హౌటల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యతన ప్రీబడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.ఎన్. బాలగోపాల్ మాట్లాడుతూ… ”ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసిన కొత్త వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. పాత గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి. కొత్త చట్టం ప్రకారం ఈ పథకం ఖర్చులో నలభై శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. దీనివల్ల కేరళ వంటి రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల కేంద్ర వాటాను ప్రస్తుతమున్న అరవై శాతం నుంచి 75 శాతానికి పెంచాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్లో కేరళ ప్రతిపాదనలు
- రుణ పరిమితిలో రూ. 17,000 కోట్ల కోత, రాష్ట్ర దేశీయ ఉత్పత్తిని లెక్కించే పద్ధతిలో మార్పుల కారణంగా కలిగిన రూ. 4,250 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి రూ.21,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.
- ఎయిమ్స్ కోసం కేరళ దీర్ఘకాల డిమాండ్‌ను ఇంకా పరిగణించలేదు. వైద్య, విద్యా సౌకర్యాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎయిమ్స్‌ను కేటాయించాలి.
- శబరి రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి, కొల్లం-సెంకోట లైన్‌తో అనుసంధానించాలి. అలాగే దానిని విజింజం పోర్టుతో అనుసంధానించాలి. ఈ ప్రాజెక్టు ఖర్చులో యాభై శాతం భరిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చింది.
- జీడిపప్పు, కొబ్బరి, చేనేత వంటి సాంప్రదాయ పరిశ్రమలకు ప్రత్యేక రక్షణ పథకాలను కేటాయించాలి. ఇవన్నీ మహిళలు ఎక్కువగా పనిచేసే రంగాలు.
- అంగన్వాడీ, ఆశా వంటి పథకాల కార్మికులు, ఉద్యోగులకు గౌరవ వేతనం, సామాజిక భద్రతా పెన్షన్, మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చులకు అవసరమైన నిధులను పెంచాలి.
- మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను నివారించడానికి అవసరమైన విధానాలు, కార్యక్రమాల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించాలి.
- కేరళ ప్రవాసీ సంక్షేమ నిధి బోర్డుకు బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చే కార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక ప్యాకేజీని అందించాలి.
- కేంద్రం, రాష్ట్రం, వినియోగదారుల నుంచి సమాన సహకారంతో రూ. 1,000 కోట్ల రబ్బరు ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. కేరళ ప్రస్తుతం అందిస్తున్న రబ్బరు మద్దతు ధరను రూ.200 నుంచి రూ.250కి పెంచాలి.
- విజింజం పోర్టును భారత్‌మాల ప్రాజెక్ట్, ప్రతిపాదిత సరుకు రవాణా కారిడార్లతో అనుసంధానించడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలి. కేరళలో లాజిస్టిక్స్ పార్కులు, తీరప్రాంత నౌకా సేవల సౌకర్యాలను నిర్మించాలి. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సేవలు, ఆధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అనుమతించాలి. పబ్లిక్ వై-ఫైతో సహా గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
- తీరప్రాంతంలోని ఖనిజ సంపదను పరిగణనలోకి తీసుకుని, శాశ్వత అయస్కాంతాలను దేశీయంగా ఉత్పత్తి చేసే లక్ష్యంతో విజింజం, చావర, కొచ్చిలను అనుసంధానించడానికి అరుదైన కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. దీనికోసం రూ.1,000 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర జీడీపీలో 50 శాతం అదనపు రుణాన్ని మూలధన వ్యయం కోసం అనుమతించాలి. జాతీయ రహదారి కోసం భూసేకరణకు కూడా రుణాలను అనుమతించాలి. దీనిని మూలధన వ్యయంగా పరిగణించాలి. కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసిన 50 ఏండ్ల వడ్డీ లేని మూలధన రుణంలో 25 శాతం ఆస్తి పునరుత్పత్తి నిధికి కేటాయించాలి.
- రాష్ట్రాలు కలిగించే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి జీఎస్టీ రక్షణ చట్రాన్ని రూపొందించాలి. జీఎస్టీ సంస్కరణల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు పరిహార సెస్ ద్వారా పరిహారం అందించాలి. పన్ను ఎగవేతను నివారించడానికి ఈ-కామర్స్ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేయాలి. విజింజం పోర్టును రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానించాలి. పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ సెంటర్, సీఫుడ్ పార్క్, ఇతర పోర్టు సంబంధిత ప్రాజెక్టులను మంజూరు చేయాలి.
- ఎఫ్‌సీఐ నుంచి సరఫరా గొలుసు బాధ్యతలను తొలగించడంతో వరి నిల్వ కేంద్రాలను ఆధునీకరించడానికి రెండు వేల కోట్లు మంజూరు చేయాలి. వరి నిల్వ కోసం కేంద్ర వాటాను అరవై నుంచి 75 శాతానికి పెంచాలి. వివిధ తోటల పంట బోర్డులకు కేటాయింపులను పెంచాలి. టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాల రంగాలకు ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి. సముద్ర గోడలు నిర్మించడం, వరద పరిస్థితులను ఎదుర్కోవడం, మడ అడవులను రక్షించడం మొదలైన వాటి కోసం తీరప్రాంత నిధిని ఏర్పాటు చేయాలి.



