Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెనిజులాపై అమెరికా దాడి అమానుషం

వెనిజులాపై అమెరికా దాడి అమానుషం

- Advertisement -

ప్రపంచ పోలీసులా ట్రంప్‌ వ్యవహారం
కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ విధానాలు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-నారాయణపేట
సార్వభౌమాధికారం కలిగిన వెనిజులా దేశంపై దౌర్జన్యంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షులు మదురో దంపతులను అరెస్టు చేయడం అమానుషమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఉక్రెయిన్‌- రష్యా, పాలస్తీనా-ఇజ్రాయిల్‌ తదితర యుద్ధాలకు అమెరికా కారణమవుతోందని, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది అమెరికాయేనని ఆవేదన వ్యక్తం చేశారు. వెనిజులా అధ్యక్షున్ని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. వెనిజులా చమురు కోసమే ట్రంప్‌ దాడి చేశారని తెలిపారు.

ప్రపంచంలో నిరుద్యోగం, దారిద్రం, ఆకలి చావులు ఒకవైపు పెరిగిపోతుండగా.. మరోవైపు ప్రపంచ సంపద అంతా కొద్దిమంది బడా కార్పొరేట్‌ శక్తుల్లో కేంద్రీకరించబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానాలు శాంతి, సౌభాగ్యాలను కాపాడలేవని, అశాంతి, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తాయని వివరించారు. అందుకే శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో ప్రజలు పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తున్న ఘటనలు చూస్తున్నామని తెలిపారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత వారసత్వం కలిగిన భారతదేశానికి ప్రధానిగా ఉన్న మోడీ.. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ విధానాలను ఖండించకపోవడం సరికాదన్నారు.

మోడీ బడా కార్పొరేట్‌ అనుకూల విధానాలు అవలంబిస్తూ.. కార్మిక, కర్షక, కూలీల వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చుతూ నాలుగు కార్మిక కోడ్‌లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్‌ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, కూలీల వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) సమరశీల పోరాటాలు చేస్తుందన్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.

లౌకిక రాజ్యమన్నా, సోషలిజం అన్నా నచ్చడం లేదని, అందుకే భారత రాజ్యాంగంలో లౌకిక, సోషలిస్ట్‌ పదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అంతకుముందు నవతెలంగాణ దిన పత్రిక 2026 క్యాలెండర్‌ను జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. కార్మికులు, అణగారిన ప్రజల కోసం, కర్షకుల కోసం పాటుపడే పత్రిక నవ తెలంగాణ అని అన్నారు. నిజాలను నిర్భయంగా తెలిపే పత్రిక అని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మద్దతుతో గెలిచిన నలుగురు సర్పంచ్‌లను సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్‌, అంజిలయ్య గౌడ్‌, బలరామ్‌, పుంజనూర్‌ ఆంజనేయులు, నాయకులు కె.కాశప్ప, బి.జోషి, ఎన్‌.నరహరి, ఎం.బాలప్ప, అశోక్‌, మహ్మద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -