పంచగవ్యపై పరిశోధనకు రూ. మూడున్నర కోట్లు
మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకం… విచారణలో బయటపడిన అక్రమాలు
భోపాల్ : గో ఆధారిత ఉత్పత్తులు క్యాన్సర్‌ను నయం చేస్తాయని నమ్మిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం దానిపై పరిశోధనలు చేసేందుకు అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గో మూత్రం, ఆవు పేడతో మందుల్ని తయారు చేసి వాటిని క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందుకోసం పరిశోధనలు చేపట్టేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు దశాబ్ద కాలం పాటు సాగిన ఈ పరిశోధనలో అనేక ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వ్యయంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంమీద ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది.
విచారణలో ఏం తేలిందంటే…
మార్కెట్ రేట్లతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరిగిందని విచారణలో తేలింది. 2011-2018 మధ్యకాలంలో ఆవు పేడ, ఆవు మూత్రం, నిల్వ పాత్రలు, ముడి పదార్థాలు, యంత్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం రూ.1.92 కోట్లు ఖర్చు చేశారు. మార్కెట్ రేటు ప్రకారం వీటన్నింటి ధర రూ.15-20 లక్షలకు మించదు. పరిశోధనల కోసం విశ్వవిద్యాలయ బృందం వివిధ నగరాలకు 23-24 విమాన ప్రయాణాలు చేసింది. అంతేకాక ఏడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓ వాహనాన్ని కొనుగోలు చేశారు. మంజూరైన మొత్తంలో ఇది లేదు.
ఇంధనం, వాహన మెయింటెనెన్స్ కోసం ఏడున్నర లక్షల రూపాయలు, కార్మికులకు చెల్లింపుల కోసం మూడున్నర లక్షల రూపాయలు, ఫర్నీచర్-ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు కోసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇవేవీ పరిశోధనకు అవసరం లేదు. రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి శిక్షణ ఇచ్చిందీ పరిశోధకులు చెప్పలేదు. కొనుగోలు చేసిన వాహనాలు కూడా కన్పించడం లేదని దర్యాప్తు అధికారులు తేల్చారు. పరిశోధనలో ఇన్ని అక్రమాలు, అవకతవకలు జరిగినప్పటికీ యూనివర్సిటీ అధికారులు మాత్రం అలాంటివేమీ లేవని చెప్పారు. కాగా కలెక్టర్ అందజేసే విచారణ నివేదిక ఆధారంగా డివిజనల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకుంటారు.
2011లో ప్రారంభమైన పరిశోధన
2011లో జబల్పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స చేసేందుకు ఆవు పేడ, ఆవు మూత్రం, పాల ఉత్పత్తులను కలిపి పంచగవ్యను తయారు చేయడంపై ఈ ప్రాజెక్ట్ దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమవుతాయని విశ్వవిద్యాలయ అధికారులు ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు అందడంతో దానిపై విచారణకు డివిజనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆడిట్ చేసి, పరిశోధనా ఫలితాలను పరిశీలించడానికి అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.



