తెలంగాణ సాహిత్య అకాడమీ గత మూడేండ్లుగా విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తూ…సాహితీకారులకు, యువతకు చేరువ అవుతుంది. ముఖ్యంగా కార్యశాలలు నిర్వహిస్తూ సాహిత్యసజనకు దిశానిర్దేశం చేస్తుంది. సాహిత్యవారం కార్యక్రమం ద్వారా ప్రతినెల రెండు శనివారాలు సాహితీవేత్తల పుస్తకాలు ఆవిష్కరణ అకాడమీ ద్వారా నిర్వహించడం చేస్తుంది. ఈ కార్యక్రమాలు రూపకల్పన, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారితో నవతెలంగాణ దర్వాజ ముఖాముఖి.
నమస్తే సార్. మీరు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు దాటిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు?
ధన్యవాదాలు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మహాకవి దాశరథి శత జయంతి సందర్భంగా 2024 జూలై నుండి 2025 జూలై వరకు సంవత్సరం పొడుగునా దాశరథి సాహిత్య సమాలోచన సదస్సులు నిర్వహించాం. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, నిజాం కళాశాల, సీటీ కళాశాల, తారా డిగ్రీ కళాశాల సంగారెడ్డి, ఖమ్మం డిగ్రీ కళాశాల, ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వంటి కళాశాలలో తెలుగు శాఖల విభాగంతో కలిసి దాశరథి సాహిత్య సర్వస్వాన్ని విద్యార్థినీ విద్యార్థులకు పరిచయం చేశాం. ఇవి కాకుండా 48 వారాల పాటు ప్రతి శనివారం జూమ్ వేదికగా అంతర్జాల సదస్సులు నిర్వహించాం. ప్రముఖ సాహితీవేత్తలతో దాశరథి సాహిత్యంపైన వ్యాసాలు రాయించి ‘దాశరథి శత జయంతి ప్రత్యేక సంచిక’ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆవిష్కరింపచేశాం. స్వర నీరాజనం పేరిట దాశరథి సినీ గీతాల సంగీత విభావరిని రవీంద్ర భారతిలో నిర్వహించాం.
2025లో జానపద బ్రహ్మ బిరుదురాజు రామరాజు శత జయంతి సందర్భంగా వారి జానపద పరిశోధనలపైన కూడా పలు డిగ్రీ కళాశాలలో సదస్సులు నిర్వహించి ప్రత్యేక సంచిక వెలువరించాము. వీటితోపాటు కాళోజీ జయంతి, దాశరథి – సినారె జయంతి సప్తాహం సందర్భంగా కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రసంగాలు, మన రాష్ట్ర పండుగ బతుకమ్మ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించాం. మరి ముఖ్యంగా 200 మందితో కవిత్వ, కథ కార్యశాలలు నిర్వహించాం. పిల్లల రాసిన కథలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చాం.
అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా 12.01.2025లో యువకవి సమ్మేళనం, సాహిత్య సమాలోచనలు జరిగాయి. ‘పునాస’ త్రైమాసిక పత్రికను క్రమం తప్పకుండా నిర్ణీత సమాయానికి తీసుకవస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం, బాలల దినోత్సవం, కాళోజీ, దాశరథి అవార్డుల కార్యక్రమాలు తెలంగాణ సాహిత్య అకాడమి ఘనంగా నిర్వహిస్తున్నది.
తెలంగాణ త్రైమాస పత్రిక పునాస గత రెండేండ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నది కదా. ఈ పత్రికపై సాహితీవేత్తల, పాఠకుల స్పందన ఎలా ఉన్నది ?
వ్యాసాలు, కథలు/ అనువాద కథలు, కవితలు, అనువాద కవితలతోపాటు బాలసాహిత్యానికి కూడా పునాసలో చోటు కల్పించాం. సందర్భానుసారంగా సాహితీ విలువలతో కూడిన వ్యాసాలను ప్రచురిస్తున్నాము. యువరచయత (త్రి)ల రచనలతోపాటు పుస్తక సమీక్షలు ప్రచురిస్తున్నాం. ‘పునాస’లో ప్రచురణకోసం సాహితీవేత్తల నుండి వస్తున్న రచనలే ‘పునాస’ విజయానికి సాక్ష్యం. దాశరథి, బిరుదురాజు రామరాజు శతజయంతి సందర్భంగా తీసుకువచ్చిన ప్రత్యేక సంచికలకు మంచి స్పందన వచ్చింది.
మీరు నిర్వహిస్తున్న ‘సాహిత్యవారం’ కార్యక్రమం గురించి సాహితీ లోకంలో చర్చ బాగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?
సాహితీవేత్తలకు అకాడమీ తోడ్పాటు అవసరం. సాహితీవేత్తలు వారి పుస్తకావిష్కరణలు, పుస్తక పరిచయ సభలు నిర్వహించుకోవడంలో పడుతున్న ఇబ్బందిని గమనించాను. ఈ కార్యక్రమాన్ని సాహిత్య అకాడమి నిర్వహిస్తే బాగుంటుందని అనిపించింది. అలా ‘సాహిత్యవారం’ ఆలోచన వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 100కు పైగా పుస్తకావిష్కరణలు, పరిచయ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమావేశానికి ఏర్పాట్లు, హాలు కేటాయింపు, ఇతర ఖర్చులు, పత్రికల్లో వార్త కవరేజీ అకాడమి చూసుకుంటుంది. ఈ నిర్ణయంతో సాహితీవేత్తలకు గొప్ప ఊరట లభించినట్టు భావిస్తున్నారు. వారంతా సంతోషంగా ఉన్నారు. అకాడమీని తమ సంస్థగా భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న సాహితీ సేవకు నిదర్శనం.
యువ కలాలకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నది?
సాహిత్యవారంలో యువకవులు వారి కవిత్వాన్ని వినిపించడానికి అవకాశం కల్పించింది అకాడమి. ‘పునాస’లో కవితలు, కథలు ప్రచురించి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు అయిన కొత్తలో సుమారు 100కు పైగా పుస్తకాల ముద్రణ జరిగింది. గత మూడు సంవత్సరాలుగా మీ నిర్వహణలో ఎన్ని గ్రంథలు ప్రచురించారు ?
తెలంగాణ సాంస్కతిక పదకోశం, తెలంగాణ గ్రంథసూచి, పోర్యతార, చంద్రభాగ, దాశరథి సాహిత్య పరిమళం, నిప్పుపూలు, కాళోజీ కథలు, అంతర్జాలంలో భాషా సాహిత్యాలు, క్రాంతిపిత గురువర్య లహుజీ సాల్వె, బాలల ప్రపంచం మొదలగు గ్రంథలు ప్రచురించాము. పాఠకులు ఈ గ్రంథలను కొని చదువుతున్నారు. ఆదరిస్తున్నారు.
ఈ గ్రంథ ప్రచురణ పైన మీవైన ఏమైన అభిప్రాయాలు ఉన్నాయా ?
తెలంగాణ పదకోషం, తెలంగాణ తేజోమూర్తుల సమగ్ర సాహిత్యం, ప్రాచీన కవుల సాహిత్యం నేటి తరానికి ఉపయుక్తంగా ఉండేవిధంగా ప్రచురించాలని అకాడమి భావిస్తున్నది. తెలంగాణ గ్రంథ సూచిలో 2018 వరకు సమాచారం ఉన్నది. 2019 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు గల పూర్తి సమాచారంతో 2వ భాగం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము.
తెలంగాణ సాహిత్య అకాడమీని గతంలో నిధుల సమస్య వెంటాడింది. ఈ సమస్యను మీరు ఎలా అధిగమిస్తున్నారు ?
ఈ ప్రభుత్వం సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుబాటులో ఉన్న నిధుల మేరకు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ఈ కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతుంది.
ఈ కొత్త ఏడాదిలో తెలంగాణ సాహిత్య అకాడమీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ?
సాహిత్య అకాడమీకి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి సమగ్ర సమాచారంతో పాఠకులకు అందుబాటులో ఉంచేందుకు కషిచేస్తున్నాను. తెలంగాణ సాహిత్యంలో నవల ప్రక్రియ లేని లోటును పూర్తిచేసేందుకు ఆలోచనలు చేస్తున్నాను. ఈ సంవత్సరం నవల, బాల సాహిత్యం, యువ రచయితలకు ఎక్కువ ప్రోత్సాహం అందించాలని సాహిత్య అకాడమి భావిస్తున్నది. తెలుగు సాహిత్యాన్ని ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరాన్ని అకాడమీ గుర్తించింది. అందుకు అనుగుణంగా పనిచేయాలని భావిస్తుంది.



