Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇప్పుడే వద్దు..

ఇప్పుడే వద్దు..

- Advertisement -

లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దు…
జూన్‌ తర్వాతే ఆలోచిద్దాం
కార్పొరేషన్‌ పదవులపై సీఎం నిర్ణయం
కష్టపడి పనిచేసే వారి జాబితానివ్వాలంటూ మంత్రులకు సూచన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార కాంగ్రెస్‌లో నేతలను ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన కార్పొరేషన్‌ పదవుల జాతర.. మళ్లీ వెనక్కిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దీంతో క్రిస్‌మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి… అంటూ ఇప్పటిదాకా వేచి చూసిన ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కార్పొరేషన్‌ పదవులు, ఇతర నామినేటెడ్‌ పోస్టులను ఇప్పుడే భర్తీ చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు జిల్లాకు ఒకరికో ఇద్దరికో ఈ పదవులనిచ్చి.. మిగతా వారిని ఎందుకు దూరం చేసుకోవాలంటూ ఆయన తన మంత్రివర్గ సహచరులతో అన్నట్టు సమాచారం. ‘అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల్లోని నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి, పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈ ఐక్యతే మనకు బలం. ఇప్పుడు కార్పొరేషన్‌ పదవుల పేరిట కొంతమందికే పదవులనిచ్చి, మిగతా వారిని నిరుత్సాహపరచటం సరికాదు. ఇలా చేసే ఇప్పటిదాకా ఉన్న ఐక్యత దెబ్బతింటుంది. ఇది మున్సిపల్‌ ఎన్నికల్లో నష్టాన్ని చేకూరుస్తుంది. అంతిమంగా పార్టీకి ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. అందువల్ల ఇప్పుడప్పుడే వాటి జోలికెళ్లొద్దు.

ఆ మేరకు మీరు కూడా జిల్లా నేతలను మానసికంగా సిద్ధం చేయండి…’ అంటూ సీఎం… మంత్రులతో వ్యాఖ్యానించినట్టు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అంకితభావంతో, కష్టపడి పనిచేసే వారి జాబితాను జిల్లాల వారీగా తనకు పంపాలంటూ ముఖ్యమంత్రి… అమాత్యులకు సూచించారు. మినిష్టర్ల ప్రాధాన్యతలపై కూడా ఆయన ఇటీవల ఆరా తీసిసినట్టు సమాచారం. ‘మీ దృష్టిలో ఉన్నవారు, ఎన్నో ఏండ్లుగా కష్టపడి, పార్టీకి సేవలందిస్తున్న వారి లిస్టును పంపండి…’ అని ఆయన కోరారు. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యతనివ్వాలంటూ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఒక డీసీసీ అధ్యక్షుడి పేరును ఈ సందర్భంగా ఒక మంత్రి.. సీఎంకు పంపినట్టు తెలిసింది. తమ జిల్లాలో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా.. సీట్లన్నీ ఎస్టీలకు రిజర్వ్‌ అయి ఉన్నాయి…కాబట్టి బీసీ అయిన డీసీసీ అధ్యక్షుడికి కార్పొరేషన్‌ పదవిని కట్టబెడితే సామాజిక సమతూల్యత పాటించినట్టు అవుతుంది, రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పని చేయటానికి అవకాశం ఉంటుందంటూ సదరు మంత్రి…ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇలంటి అంశాలన్నింటిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు.

జూన్‌ తర్వాతే…
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదన, అనంతరం కేంద్ర ప్రభుత్వ జనగణన, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు… ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరసగా రాబోతున్నాయి. జూన్‌ నాటికి గానీ ఇవన్నీ పూర్తయే అవకాశాల్లేవు. అప్పటికి రేవంత్‌ సర్కార్‌ రెండున్నరేండ్లు పూర్తి చేసుకుంటుంది. అందువల్ల జూన్‌ తర్వాతే కార్పొరేషన్‌ పదవుల భర్తీ చేపడితే బాగుంటుందని సీఎం నిర్ణయించారు. ‘తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయిన సందర్భంగా సీనియర్లు, అంకితభావమున్న నేతలకు కార్పొరేషన్‌ పదవులు…’ అని చెప్పుకోవటానికి వీలుగా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -