దానిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి
మరణించినా మరొకరి శరీరంలో జీవించే అవకాశం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
తన 18వ పుట్టినరోజు సందర్భంగా శరీరదాన అంగీకార పత్రం అందచేసిన మద్దూరు బృందా, తల్లిదండ్రులు లక్ష్మి, బాలరాజు
పలువురు నేతల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అవయవ, శరీర దానాలు వైద్య పరమైన అంశాలే కాకుండా ఒక సామాజిక బాధ్యత అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నొక్కి చెప్పారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మద్దూరు బృందా తన 18వ పుట్టినరోజు సందర్భంగా తనతో పాటు తల్లిదండ్రులు మద్దూరు లక్ష్మి, బాలరాజులతో శరీరదానం చేయడానికి అంగీకారం తెలిపారు. వారు పత్రాలను ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో జాన్‌వెస్లీ నేతృత్వంలో అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు గంజి ఈశ్వరలింగంకు వారు అందజేశారు. సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా అవయవ, శరీర దానాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అవయవ, శరీర దానం గొప్ప కార్యమన్నారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యం సామాజిక స్పృహ కలిగిన వాళ్లు మాత్రమే ప్రస్తుతం అవయవ, శరీర దానాలు చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
సుదీర్ఘకాలం చికిత్స పొందుతూ అవయవ దాతల కోసం రోగులు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. సమయానికి అవయవ మార్పిడి జరగక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దానం వల్ల మనిషి మరణించినప్పటికీ మరొకరు శరీరంలో జీవించే అవకాశాలున్నాయని చెప్పారు. అవయవ దానం ద్వారా ఎందరికో పునర్జీవనాన్ని అందించడంతోపాటు సమాజంలో ఒక గౌరవాన్ని పొందే అవకాశం ఉందని అన్నారు. మెడికల్ కాలేజీల్లో అధ్యయనం కోసం మృతదేహాలు సరిపడలేక సంపూర్ణ, సమగ్రమైన నైపుణ్యాన్ని వైద్య విద్యార్థులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శరీర దానం చేయడం వల్ల వైద్య కళాశాలలో పాఠాలు బోధించేందుకు అది ఉపయోగపడుతుందనీ, వైద్య విద్యార్థులు, డాక్టర్లు పరిశోధనలు చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. మూఢనమ్మకాల ప్రభావం వల్ల చాలామంది అవయవ, శరీర దానాలకు ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు. మద్దూరు బందా మాత్రం సామాజిక స్పృహతో, ఎంతో పరిణతితో ఆలోచించి తన 18వ పుట్టినరోజు సందర్భంగా అవయవ, శరీరదానం చేయడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించడం అభినందనీయమని కొనియాడారు. చిన్న వయస్సులోనే సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించిన బృందాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే బృందా తన శరీరంతో పాటు తల్లిదండ్రులను కూడా దానం చేయాలని ఒప్పించడం గొప్ప విషయమని ప్రశంసించారు. వారి కుటుంబం సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించిందని అభినందించారు.
శరీర దానాలు చేసిన బృందా, ఆమె తల్లిదండ్రులు లక్ష్మీ, బాలరాజు మాట్లాడుతూ.. మరణించిన అనంతరం ఈ సమాజానికి ఏదో రకంగా తమ శరీరాలు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చినట్టు తెలిపారు. సీతారాం ఏచూరి, మల్లు స్వరాజ్యం, జ్యోతిబసు లాంటి మహానేతల స్ఫూర్తితో నేటి యువత స్పూర్తి పొంది, శారీర, అవయవ దానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఎంతో మందికి అవయవ దానం చేసి పునర్జన్మనిచ్చినట్టు తెలిపారు. అవయవ, శరీర దానం అనేది శాస్త్రీయతతో కూడుకున్న అంశాలనీ, ప్రజలు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
నవ తెలంగాణ హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూనే తమ మరణం తర్వాత తమ శరీరాలు కూడా సమాజానికి ఉపయోగపడాలని ఉన్నత ఆశయంతో బృందా కుటుంబసభ్యులు ముందుకు రావడం ఆదర్శనీయమన్నారు. జన్మదినం పేరిట విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్న ప్రస్తుత సమాజంలో బృందాను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు, సీపీఐ(ఎం) నాయకులు కేవీఎస్‌ఎన్ రాజు, సీనియర్ జర్నలిస్టు మేకల కృష్ణయ్య, కేవీపీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ కుమార్, కుటుంబ సభ్యులు, నాగమణి, రాజు, భగత్, రియాన్స్, రేవంత్ పాల్గొన్నారు.



