ఈ ఏడాదిలో పథకం ప్రకారం దాడులు జరిగే అవకాశం
యూఎస్ హోలోకాస్ట్ మ్యూజియం అధ్యయనం హెచ్చరిక
వాషింగ్టన్ : రాబోయే రెండు సంవత్సరాల కాలంలో భారత్‌లో పౌరులపై సామూహిక హింస జరగవచ్చునని, ఫలితంగా ఆ దేశం తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మ్యూజియం ప్రచురించిన వార్షిక అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. సామూహిక హత్యాకాండ జరగవచ్చునని పరిశోధకులు అనుమానిస్తున్న 168 దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున హింస జరగనప్పటికీ ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ మొదటి వరుసలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
నాలుగో స్థానంలో భారత్
మ్యూజియం ముందస్తు హెచ్చరికల ప్రాజెక్ట్ నుంచి గత నెలలో తీసుకున్న నివేదిక ప్రకారం…ఈ సంవత్సరాంతం లోగా ప్రజలపై ఉద్దేశపూర్వకంగా సామూహిక హింసకు పాల్పడే అవకాశం భారత్‌కు 7.5 శాతం ఉన్నదని అంచనా. జాతి, మతం, రాజకీయాల ఆధారంగా ఏర్పడిన సాయుధ గ్రూపులు సంవత్సరంలో కనీసం వెయ్యి మందిని హతమారిస్తే దానిని హింసగా పరిశోధకులు నిర్వచించారు. సామూహిక హింస ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ కంటే మూడు దేశాలు మాత్రమే ముందున్నాయి. మయన్మార్ మొదటి స్థానంలో నిలవగా ఛాద్, సూడాన్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. మయన్మార్, సూడాన్ దేశాలలో ఇప్పటికే సామూహిక హత్యలు కొనసాగుతున్నాయి.
పరిశోధన ఎలా జరిగింది?
నమూనాలను గుర్తించడానికి మ్యూజియం, డార్ట్‌మౌత్ కళాశాల పరిశోధకులు అనేక దశాబ్దాల పాటు విశ్లేషణలు జరిపారు. సామూహిక హింస చెలరేగడానికి ముందు ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితులను వారు అధ్యయనం చేశారు. విశ్లేషణలో భాగంగా పరిశోధకులు 30కి పైగా అంశాలను పరిశీలించారు. జనసంఖ్య మొదలు ఆర్థిక సూచికల వరకూ విశ్లేషించి ఆయా దేశాలలో నెలకొన్న రాజకీయ స్వేచ్ఛను, సాయుధ ఘర్షణలను మదింపు చేశారు. సామూహిక హింస జరుగుతున్న దేశాల జాబితాలో ప్రతి సంవత్సరం ఒకటో రెండో దేశాలు చేరుతున్నాయి. తమ నిర్ధారణలను సూచికలుగా చూడవద్దని పరిశోధకులు హెచ్చరించారు. ఉదాహరణకు ఏదైనా ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన హింస జరగదు. అయితే అధిక జనాభా కలిగిన దేశాలు సామూహిక హింస ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. 2024 వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఈ నివేదిక నిర్దిష్ట ముగింపును ఇవ్వబోదని, మరింత చర్చ, పరిశోధన అవసరాన్ని నొక్కి చెబుతుందని పరిశోధకులు తెలిపారు.
నివేదిక ఏం చెప్పిందంటే…
జాబితాలో మొదటి స్థానాలలో ఉన్న దేశాలకు నివేదిక తన ఆందోళనను తెలియజేసింది. మొదటి 30 స్థానాలలో ఉన్న ప్రతి దేశం సామూహిక హింస సమస్యకు పరిష్కారం సాధించడంపై దృష్టి సారించాలని సూచించింది. పౌరులపై పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ కనబరుస్తున్నాయా? ఎన్నికలు, రాజకీయ తిరుగుబాటు లేదా నిరసనల వంటివి విస్తృత హింసకు దారి తీస్తాయా? అని ప్రశ్నించింది. సామూహిక హింసకు సంబంధించి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాలపై అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు సొంతగా సవివరమైన అంచనాలు రూపొందించుకోవాలని చెప్పింది. ముందస్తు హెచ్చరికల ప్రాజెక్ట్ 2014 నుంచి వార్షిక అంచనాలను విడుదల చేస్తోంది. ఆ సమయంలో బర్మాలో రోహింగ్యాలపై మారణకాండ జరిగింది. దక్షిణ సూడాన్, ఇథియోపియాలలో పౌరుల సామూహిక మరణాలు సంభవించాయి. హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆయా దేశాలు ముందస్తుగా తగినన్ని చర్యలు తీసుకోలేదని పరిశోధకులు తెలిపారు.



