Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే సహించేది లేదు

ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే సహించేది లేదు

- Advertisement -

అణాపైసాతో సహా వసూలు చేస్తాం
ధరణి లొసుగులతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్‌ నిర్వహిస్తాం
భూభారతి పోర్టల్‌లో అక్రమాలకు తావులేదు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని జనగాం తదితర ప్రాంతాల్లో బయటపడిన స్టాంప్‌ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ఐదేండ్ల లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించగా మొత్తం 52 లక్షల లావాదేవీల్లో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3వేల లోపాలను రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో గుర్తించామన్నారు. వీటికి సంబంధించిన మొత్తాన్ని తప్పకుండా రికవరీ చేస్తామని తెలిపారు.

రెవెన్యూ యంత్రాంగం ఇటీవల అన్ని జిల్లాల్లో నిర్వహించిన ఆడిటింగ్‌లో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలాన్‌ సొమ్ము పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్‌ విధానం లేకపోవడమే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణమన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చి చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా? లేదా? అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని ఆదేశించారు. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఐదేండ్ల కాలంలో జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్‌ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రభుత్వానికి రావాల్సిన ఒక్క పైసా సొమ్ము దుర్వినియోగం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు ఇకపై తావు ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -