ఎవరికో ఈ ప్రజలట్లు..

– ఐదేండ్లుగా సర్పంచులు లేని గ్రామాలు
– కార్యదర్శుల పాలనలోనే కాలం వెల్లదీత
– గెజిట్‌ రాలేదని ఎన్నికలు నిర్వహించని వైనం
– అభివృద్ధికి ఆమడదూరంలో అవస్థలు
నవతెలంగాణ – రామగుండం, కోల్‌సిటీ
పూర్తిస్థాయి పాలకవర్గం ఉండి ఎప్పటికప్పుడూ ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తేనే అభివృద్ధి పనులు జరగడం లేదు.. అలాంటిది నాలుగేండ్లుగా సర్పంచులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం లేకుంటే ఆ గ్రామాల అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్యదర్శుల పాలనలోనే ఐదేండ్లుగా గ్రామాలు నడుస్తున్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ప్రభుత్వం కూడా పాలకవర్గాల ఏర్పాటుకు కృషి చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రజలు ఎవరికి ఓటేస్తారోనని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనగా ఉన్నాయి.

ప్రజల ఆందోళనతో కార్పోరేషన్‌లో విలీన ప్రతిపాదన వెనక్కి
పెద్దపల్లి జిల్లా రామ గుండం నియోజకవర్గ పరిధి లోని కుందన పల్లి, లింగాపూర్‌ పంచాయతీలను ప్రభుత్వం 2019లో రామగుండం కార్పో రేషన్‌లో విలీనం చేసింది. దానిని వ్యతిరేకిస్తూ.. పంచాయతీ గానే కొనసాగుతామని ఆ గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. దాంతో కార్పోరేషన్‌ నుంచి ఆ గ్రామాలను తొలగించారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చెపట్టలేదు. పంచాయ తీలుగా కొనసాగించడానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ గెజిట్‌ రాలేదనే కారణాలతో అధికారులు పట్టించు కోలేదు. దీంతో ఐదేండ్లుగా ప్రత్యేక అధికారుల పర్య వేక్షణలోనే పాలన సాగుతోంది. ఆ అధికారులు అందు బాటులో లేకపోవడం, స్థానిక సమస్యలపై వారికి అవగాహన లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
శిథిలమైన రోడ్లు..
కుందనపల్లి నుంచి రామగుండం వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమైంది. కుందనపల్లి నుంచి మెయిన్‌ రోడ్డుకు వెళ్లే మరోదారి ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ వైపు కూడా ఆధ్వానంగా మారింది. దీంతో ఎటు వైపు వెళ్లాలన్నా గ్రామస్తులకు కష్టాలు తప్పడం లేదు. లింగాపూర్‌లో సైతం మౌలిక వసతులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
భూగర్భ జలాల కలుషితం..
ఇండియన్‌ ఆయిల్‌ కర్పొ రేషన్‌ను ఆనుకొని ఉన్న మొగల్‌ పహాడ్‌ గ్రామంలోని 10, 11వ వార్డుల్లోని భూగర్భజలాలు కలుషి తమయ్యాయి. దీంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుందనపల్లికి వచ్చి నీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. ప్రజల సౌకర్యార్థం ఐవోసీఎల్‌ నిర్వాహకులు వాటర్‌ ట్యాంకు నిర్మించినా దానికి మిషన్‌ భగీరథ నుంచి నీరు అందడం లేదు. దీంతో ఆ ట్యాంకు సైతం నిరుపయోగంగా మారింది.
చిమ్మ చీకట్లు, పారిశుధ్య లోపం
పాలకవర్గం లేని కారణంగా కుందనపల్లి, లింగాపూర్‌ గ్రామాల్లో వీధి లైట్ల నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో రాత్రుళ్లు గ్రామాల్లో అంధకారం అలుముకుంటోంది. పారిశుధ్య నిర్వహణనను కూడా పట్టించుకోక పోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయింది. గ్రామానికి సర్పంచ్‌ ఇతర పాలకవర్గం ఉంటే సమస్యలను పరిష్కరిం చుకునే అవకాశం ఉండేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ సెక్రెటరీకి పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదు.
సమస్యలు వినేవారు లేరు..
పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదేండ్లుగా ప్రత్యేక పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తగిన పరిష్కారం చూపించాలి.
– గెల్లు నరేష్‌, కుందనపల్లి.
అధికారులు పట్టించుకోవడం లేదు
ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడం.. వారి ఉద్యోగ రీత్యా బిజీగా ఉండటం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.
– అడ్డిచెర్ల కిరణ్‌, లింగాపూర్‌ గ్రామం

Spread the love